రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

మానెక్‌షా కేంద్రంలో "లెఫ్టినెంట్‌ జనరల్ పీఎస్ భగత్ స్మారక ఉపన్యాసం" నిర్వహించిన భారత సైన్యం

Posted On: 14 JUN 2023 5:30PM by PIB Hyderabad

ఈ నెల 14న, మానెక్‌షా కేంద్రంలో, "లెగసీ ఆఫ్ లెఫ్టినెంట్ జనరల్ ప్రేమ్ భగత్- ఎ విజనరీ అండ్ స్ట్రాటజిక్ లీడర్"పై మొదటి "లెఫ్టినెంట్ జనరల్ పీఎస్‌ భగత్ స్మారక ఉపన్యాసం" కార్యక్రమాన్ని భారత సైన్యం నిర్వహించింది. యునైటెడ్ సర్వీస్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా (యూఎస్‌ఐ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ పాండే చేతుల మీదుగా యూఎస్‌ఐలో "లెఫ్టినెంట్ జనరల్ పీఎస్ భగత్ మెమోరియల్ చైర్ ఆఫ్ ఎక్సలెన్స్‌" ఏర్పాటు చేశారు.

విశ్రాంత సైన్యాధిపతి జనరల్ వీపీ మాలిక్ కీలకోపన్యాసం చేశారు. లెఫ్టినెంట్ జనరల్ భగత్ సెకండ్ లెఫ్టినెంట్‌గా ప్రారంభమైనప్పటి నుంచి, మరణించే ముందు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) ఛైర్మన్‌గా పని చేసిన వరకు ఆయన జీవిత ఘట్టాలను జనరల్‌ వీపీ మాలిక్‌ గుర్తు చేశారు.

ప్రస్తుత సైన్యాధిపతి (సీవోఏఎస్‌) జనరల్ మనోజ్ పాండే, మాజీ సైన్యాధిపతులు జనరల్ వీఎన్‌ శర్మ (విశ్రాంత), జనరల్ ఎంఎం నరవణె (విశ్రాంత), ప్రస్తుత సీనియర్‌ అధికారులు ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా సైన్యాధిపతి మాట్లాడారు. "కొత్త మార్పులు జరిగిన నార్తర్న్ కమాండ్‌కు మొదటి జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా సేవలు అందించిన దివంగత లెఫ్టినెంట్ జనరల్ పీఎస్ భగత్ అత్యుత్తమ అధికారి, ఉత్తమ రచయిత" అని చెప్పారు. "యువ సెకండ్ లెఫ్టినెంట్‌గా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొని, ప్రతిష్టాత్మక విక్టోరియా క్రాస్‌ను పొందిన మొదటి భారతీయ సైనికుడు లెఫ్టినెంట్ జనరల్ భగత్. శత్రువుల కాల్పుల్లో, మందుపాతరలు తొలగిస్తున్నప్పుడు ఆయన వాహనం మూడుసార్లు ధ్వంసమైంది. చెవి లోపలి భాగం దెబ్బతిన్నా, 96 గంటలపాటు నిర్విరామంగా తన పనిని చేస్తూనే ఉన్నారు. 1971 సెప్టెంబరులో లఖ్‌నవూలో ఆర్మీ కమాండర్‌గా సేవలు అందించిన లెఫ్టినెంట్ జనరల్ భగత్, గోమతి నది ఆనకట్టకు గండి పడినప్పుడు, వరదను అడ్డుకోవడానికి పెద్ద పెద్ద బండరాళ్లతో నిండిన ట్రక్కులను ఆ గండిలోకి నెట్టి లఖ్‌నవూ నగరాన్ని కాపాడారు. ఆ మరుసటి రోజు వార్తాపత్రికల్నీ లఖ్‌నవూ రక్షకుడు అని ఆయన గురించి రాశాయి" అని గుర్తు చేసుకున్నారు.

లెఫ్టినెంట్‌ జనరల్ పీఎస్ భగత్ స్మారక ఉపన్యాసం తదుపరి ఎడిషన్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. ఆ కార్యక్రమంలో కీలక ఉపన్యాసం చేయడానికి, అరుణాచల్‌ప్రదేశ్ గౌరవనీయ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ కేటీ పర్నాయక్ (విశ్రాంత) అంగీకరించారు. 

***



(Release ID: 1932672) Visitor Counter : 107


Read this release in: English , Urdu , Hindi , Punjabi