రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ నుంచి పైఠాన్ 'జాతీయ రహదారి 752-ఈ'లోకి మర్రి చెట్ల స్థల మార్పిడి కార్యక్రమాన్ని పరిశీలించిన శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
11 JUN 2023 7:50PM by PIB Hyderabad
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ నుంచి పైఠాన్ 'జాతీయ రహదారి 752-ఈ'లోకి మర్రి చెట్ల స్థల మార్పిడి కార్యక్రమాన్ని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ పరిశీలించారు. ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే శ్రీ సందీపన్ బుమ్రే, నటుడు శ్రీ సయాజీ షిండే కూడా ఉన్నారు.
ఛత్రపతి సంభాజీ నగర్ నుంచి పైఠాన్ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో, ప్రస్తుతం ఉన్న రహదారికి ఇరువైపులా 50 నుంచి 100 ఏళ్ల వయసున్న 51 మర్రి చెట్లు ఉన్నాయని శ్రీ గడ్కరీ చెప్పారు. వాటిని తొలగించకుండా ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యం కాదని, అందుకే ఆ వృక్షాలను నరికివేయకుండా వేరే చోటికి తరలించి నాటాలని నిర్ణయించినట్లు తెలిపారు. జైక్‌వాడీ డ్యామ్ వల్ల భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్న పైఠాన్ దేవభూమిని ఇందుకోసం ఎంపిక చేసినట్లు చెప్పారు.
51 చెట్లను విజయవంతంగా తరలించి ఒకే ప్రాంతంలో నాటామని, దేశంలో ఇలాంటి చెట్ల మార్పిడిలో ఇదే మొదటి, ఏకైక కార్యక్రమం అని గడ్కరీ చెప్పారు. ఈ చెట్లు భవిష్యత్‌లో ప్రతికూల జల-వాయు పరిస్థితులను, ప్రకృతి విపత్తుల ప్రభావాలను అడ్డుకుంటాయని, భూగర్భ జలాలను పెంచుతాయని, వన్యప్రాణుల ఆవాసాలను మెరుగుపరచడానికి, నేల కోతను తగ్గించడంలో సాయపడతాయని మంత్రి వెల్లడించారు.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు పర్యావరణాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తోందని ఉందని శ్రీ గడ్కరీ చెప్పారు. కొత్తగా నిర్మించే జాతీయ రహదారులకు ఇరువైపులా, అందుబాటులో ఉన్న స్థలానికి అనుగుణంగా పెద్ద చెట్లను నాటాలని కేంద్ర ప్రభుత్వం కోరడం పర్యావరణ పరిరక్షణ దిశగా కీలక ముందడుగుగా అభివర్ణించారు. భారతదేశాన్ని స్వచ్ఛ, హరిత, కాలుష్య రహితంగా మార్చేందుకు హరిత జాతీయ రహదారుల ఏర్పాటు దోహదపడుతుందని మంత్రి వివరించారు.
***
(Release ID: 1931693)
Visitor Counter : 167