ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా 5వ రాష్ట్ర ఆహార భద్రతా సూచికను ఆవిష్కరించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


జిల్లాలకు ఈట్ రైట్ ఛాలెంజ్ - ఫేజ్ 2 విజేతలను సత్కరించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ), ఆవిష్కరణ (ఇన్నోవేషన్) పట్ల భారత్ నిబద్ధతను చాటిచెప్పేందుకు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహించిన
ఎఫ్ఎస్ఎస్ఎఐ

వచ్చే మూడేళ్లలో 25 లక్షల మంది ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ శిక్షణ

ఆహార నాణ్యత అంటే ఆరోగ్యమే: డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ఆహారాలు- చేపలు ,చేపల ఉత్పత్తుల విశ్లేషణ పద్ధతుల మాన్యువల్, ఆహార పదార్థాల విశ్లేషణ పద్ధతుల మాన్యువల్ - తృణధాన్యాలు , తృణధాన్యాల ఉత్పత్తులు - 2 వ ముద్రణ,ఆహారాలు- పానీయాల విశ్లేషణ పద్ధతుల మాన్యువల్: టీ, కాఫీ ,చికోరీ ల ఆవిష్కరణ

Posted On: 07 JUN 2023 6:04PM by PIB Hyderabad

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2023 జూన్ 7 (బుధవారం) న విజ్ఞాన్ భవన్ లో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించడం ద్వారా ఆహార భద్రత ,ఆవిష్కరణల పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్ పి సింగ్ బఘేల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

ఈ కార్యక్రమంలో డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఆహార భద్రతకు సంబంధించిన ఆరు విభిన్న అంశాల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పనితీరును మదింపు చేసే 5వ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ (ఎస్ఎఫ్ఎస్ఐ)ను ఆవిష్కరించారు. ఇంటరాక్టివ్ సెషన్ లో భాగంగా ఈ ఇండెక్స్ ను విడుదల చేసారు. 2018-19 లో ప్రారంభమైన ప్రారంభించిన ఎస్ఎఫ్ఎస్ఐ ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడం, దేశవ్యాప్తంగా ఆహార భద్రతా పర్యావరణ వ్యవస్థలో సానుకూల మార్పును ప్రేరేపించడం, అంతిమంగా నివాసితులందరికీ సురక్షితమైన , ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

 

వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సాధించిన విజయాలను గుర్తించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ 2022-23 సంవత్సరానికి గాను ర్యాంకుల ఆధారంగా విజేతలను సత్కరించారు. పెద్ద రాష్ట్రాలలో కేరళ మొదటి స్థానంలో నిలవగా, పంజాబ్, తమిళనాడు తరువాతి స్థానాలలో ఉన్నాయి. చిన్న రాష్ట్రాలలో గోవా అగ్రస్థానంలో నిలవగా, మణిపూర్, సిక్కిం రాష్ట్రాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.కేంద్రపాలిత ప్రాంతాల్లో జమ్ముకశ్మీర్, ఢిల్లీ, చండీగఢ్ వరుసగా మొదటి, రెండు, మూడు ర్యాంకులు సాధించాయి. రాష్ట్ర ఆహార భద్రతా సూచిక స్కోర్ లలో గణనీయమైన మెరుగుదల ప్రదర్శించిన రాష్ట్రాలను కూడా డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రశంసించారు.

 

అంతేకాక, జిల్లాలకు ఈట్ రైట్ ఛాలెంజ్ - ఫేజ్ 2 విజేతలను కేంద్ర ఆరోగ్య మంత్రి సత్కరించారు. ఆహార వాతావరణాన్ని మెరుగుపరచడానికి ,ఆహార భద్రతపై అవగాహన పెంచడానికి ప్రణాళికలను అమలు చేయడంలో ఈ జిల్లాలు అసాధారణ కృషిని ప్రదర్శించాయి.

అసాధారణ ఫలితాలు సాధించిన జిల్లాలు చాలా వరకు తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఉన్నాయి. పాల్గొన్న 260 జిల్లాలలో, 31 జిల్లాలు విజయవంతంగా 75% లేదా అంతకంటే ఎక్కువ స్కోరును సాధించాయి.

 

భారత స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవం, అలాగే అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎఫ్ఎస్ఎస్ఏఐ దేశవ్యాప్తంగా ఈట్ రైట్ మిల్లెట్స్ మేళాలను నిర్వహించింది. ఈ మేళాలు దేశంలో వంటకాల వైవిధ్యాన్ని, అలాగే చిరుధాన్యాల వంటకాలను ప్రదర్శించడానికి వేదికలుగా ఆవిర్భవించాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చేసిన కృషికి గుర్తింపుగా,  జిల్లాల్లో రైట్ మిల్లెట్స్ మేళాలను విజయవంతంగా నిర్వహించిన రాష్ట్రాలకు ప్రశంసా పత్రాలను అందజేశారు.

 

దేశవ్యాప్తంగా ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించేలా వచ్చే మూడేళ్లలో 25 లక్షల మంది ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ శిక్షణ ఇస్తుందని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. ఆహార భద్రత, పరిశుభ్రత, పౌష్టికాహారం కోసం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా 100 ఫుడ్ స్ట్రీట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. "ఆహార నాణ్యత ఆరోగ్యంలో  భాగం" అని డాక్టర్ మాండవీయ అన్నారు..

 

సైంటిఫిక్ కమిటీ, సైంటిఫిక్ ప్యానెల్స్ సభ్యులు చేసిన అమూల్యమైన కృషిని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ హృదయపూర్వకంగా అభినందించారు.

ఆహార భద్రతకు సంబంధించి సాక్ష్యాధారిత విధానాలు, నిబంధనలను రూపొందించడంలో వారి పాత్ర ఎంతో కీలకమని ఆయన చెప్పారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘’ఈ గౌరవ నిపుణుల నైపుణ్యం ,సిఫార్సులు అభివృద్ధి చెందుతున్న సవాళ్లను పరిష్కరించడానికి , దేశవ్యాప్తంగా అత్యున్నతఆహార భద్రతా ప్రమాణాలను నిర్ధారించడానికి సమర్థవంతమైన వ్యూహాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించాయి. ఆహార భద్రతా నిబంధనలు, అలాగే ప్రమాణాలు నిర్ణయించే ప్రక్రియకు సంబంధించి శాస్త్రీయ నిపుణులు ఆలోచనాత్మక చర్చలు, సంప్రదింపులలో పాల్గొనడానికి ఈ సమావేశం ఒక వేదికను అందిస్తుంది,, అన్నారు. దేశానికి ఆహార భద్రతా ప్రమాణాలను నిర్ణయించడంలో, ఆహారం, జీవనశైలి, ఆహార ఉత్పత్తుల కాలానుగుణత పరంగా మన స్వంత సంప్రదాయాలు ,వారసత్వాన్ని పరిశీలించాలని, తద్వారా ప్రపంచంలో మనదైన స్వంత ఆహార ప్రమాణాలను నిర్ణయించవచ్చని మంత్రి అన్నారు.

 

ర్యాపిడ్ ఫుడ్ టెస్టింగ్ కిట్ (రాఫ్ట్) పోర్టల్ సహా ఎఫ్ఎస్ఎస్ఏఐ చేపట్టిన పలు వినూత్న చొరవలను డాక్టర్ మాండవీయ ఆవిష్కరించారు. ఈ పోర్టల్ రాఫ్ట్ పథకం కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, పారదర్శకత , జవాబుదారీతనాన్ని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది.

దరఖాస్తుదారులు ఇప్పుడు ఆన్ లైన్ లో ఆమోదం కోసం సౌకర్యవంతంగా దరఖాస్తు చేసుకోవచ్చు.   అప్లికేషన్ ప్రాసెసింగ్ నుండి సర్టిఫికేట్ జారీ , రెన్యువల్ వరకు అన్ని దశలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిర్వహించవచ్చు.

ఈ డిజిటలైజేషన్ ఫుడ్ టెస్టింగ్, స్క్రీనింగ్, నిఘా ప్రయోజనాల కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడాన్ని ప్రోత్సహించడానికి 2019 లో ప్రారంభించిన రాఫ్ట్ పథకం కాగిత రహిత నిర్వహణను ప్రోత్సహిస్తుంది.

 

ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆహార భద్రతా పద్ధతులను పెంపొందించడానికి రూపొందించిన మూడు మాన్యువల్స్ ను కేంద్ర ఆరోగ్య మంత్రి విడుదల చేశారు. ఆహారాలు- చేపలు ,చేపల ఉత్పత్తుల విశ్లేషణ పద్ధతుల మాన్యువల్, ఆహార పదార్థాల విశ్లేషణ పద్ధతుల మాన్యువల్ - తృణధాన్యాలు , తృణధాన్యాల ఉత్పత్తులు - 2 వ ముద్రణ,ఆహారాలు- పానీయాల విశ్లేషణ పద్ధతుల మాన్యువల్: టీ, కాఫీ ,చికోరీ  ఇందులో ఉన్నాయి.

 

ఆహార విశ్లేషణలో తాజా సాంకేతిక పురోగతికి అనుగుణంగా, ఆహార ఉత్పత్తుల భద్రత ,నాణ్యతను నిర్ధారించడానికి ఈ మాన్యువల్స్ ను రూపొందించారు. ఆహార వ్యాపారాలు, నియంత్రణ అధికారులు వినియోగదారులతో సహా ఆహార పరిశ్రమ లోని  భాగస్వాములు ఈ మాన్యువల్స్ లో అందించిన విలువైన మార్గదర్శకత్వం నుండి ప్రయోజనం పొందుతారు.

 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ విజేతలను అభినందిస్తూ అవార్డులు కేవలం సర్టిఫికెట్లకే పరిమితం కాకుండా పెద్ద ప్రభావాన్ని చూపుతాయన్నారు. ‘మీరు ఇంకా పెద్ద పని చేయడానికి ముందుకు వెళ్ళేటప్పుడు ఇది మీపై మరింత బాధ్యతను ఉంచుతుంది’ ఆన్నారు. ఆహార భద్రత ప్రాముఖ్యతపై ఆయన మాట్లాడుతూ..

‘ఎంత మారుమూల ప్రాంతం అయినా ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయని, అందువల్ల మన పౌరుల ఆరోగ్యాన్ని నిర్ధారించడంలో ఆహార భద్రతా ప్రమాణాలకు హామీ ఇవ్వడం మరింత ముఖ్యమని’ అన్నారు.

 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి ఆరాధన పట్నాయక్,

ఎఫ్ఎస్ఎస్ఏఐ  సిఇఒ,శ్రీ జి.కమల వర్ధనరావు, అడ్వైజర్ (సైన్స్ అండ్ స్టాండర్డ్స్, కోడెక్స్), ఎఫ్ఎస్ఎస్ఏఐ,

డాక్టర్ హరీందర్ సింగ్ ఒబెరాయ్, ఇంకా

ఎఫ్ఎస్ఎస్ఏఐ కు చెందిన సైంటిఫిక్ కమిటీ , సైంటిఫిక్ ప్యానెల్స్ ప్రముఖ సభ్యులు, రాష్ట్ర ఆహార భద్రతా విభాగాలు మునిసిపల్ కార్పొరేషన్లు / స్మార్ట్ సిటీ కార్యాలయాల నుండి సీనియర్ అధికారులు, ఆహారం , పోషకాహార నిపుణులు, అభివృద్ధి ఏజెన్సీలు, ఆహార వ్యాపారాలు , ఎఫ్ఎస్ఎస్ఎఐ ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

 

******



(Release ID: 1930627) Visitor Counter : 205