యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఫిట్ ఇండియా క్విజ్ - 2022 రాష్ట్ర స్థాయి పోటీలు ఫిట్ ఇండియా సామాజిక మాధ్యమ అధికారిక ఖాతాల్లో ప్రసారం
Posted On:
07 JUN 2023 5:51PM by PIB Hyderabad
2వ ఫిట్ ఇండియా క్విజ్ రాష్ట్ర స్థాయి పోటీలు ఈ నెల 10 నుంచి ఫిట్ ఇండియా అధికారిక యూట్యూబ్, ఫేస్‌బుక్ ఖాతాల్లో ప్రసారం అవుతాయి. ఇది క్రీడలు, శారీరక దారుఢ్యంపై జరిగే క్విజ్. విజేతలకు ₹3.25 కోట్ల నగదు బహుమతిని అందించే భారతదేశపు అతి పెద్ద క్విజ్. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో క్విజ్ పోటీలు జరుగుతున్నాయి. ఫిట్ ఇండియా అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల్లో మొత్తం 84 ధారావాహికలు ప్రసారం అవుతాయి.
36 రాష్ట్రాలు/యూటీల నుంచి 348 జట్లు పోటీ పడతాయి. ఈ దశ తర్వాత, 36 రాష్ట్ర/యూటీ విజేతల జట్లు ఫిట్ ఇండియా క్విజ్ జాతీయ స్థాయి తుది పోరులో పోటీ పడతాయి. మే-జూన్ నెలల్లో 36 రాష్ట్ర/విజేతలను నిర్ణయించడానికి మొత్తం 120 దఫాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. 36 రాష్ట్ర స్థాయి తుది పోటీలు దూరదర్శన్‌లో కూడా ప్రసారం అవుతాయి.
ఫిట్ ఇండియా క్విజ్ ప్రాథమిక పోటీ తర్వాత, 348 పాఠశాలలు & 418 మంది విద్యార్థులు రాష్ట్రం/యూటీ పోటీకి ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులలో 39% మంది బాలికలు ఉన్నారు. ఎంపికైన పాఠశాలలు తమ పాఠశాల నుంచి అదనంగా ఇద్దరు విద్యార్థులతో బృందాలను ఏర్పాటు చేశాయి. ఈ విద్యార్థి బృందాలు వివిధ దశల ద్వారా రాష్ట్ర/యూటీ స్థాయిలో పోటీ పడతాయి.
పాఠశాలల కోసం 'ఫిట్ ఇండియా నేషనల్ ఫిట్‌నెస్ అండ్ స్పోర్ట్స్ క్విజ్' 2వ ఎడిషన్‌ను, గత ఏడాది ఆగస్టు 29న, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా, కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు. ఆ శాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్, కేంద్ర విద్య & నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.
క్విజ్ 2వ ఎడిషన్‌లో, దేశంలోని 702 జిల్లాలకు చెందిన 16,702 పాఠశాలల నుంచి 61,981 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఫిట్ ఇండియా క్విజ్ మొదటి ఎడిషన్‌లో 13,502 పాఠశాలల నుంచి 36,299 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఫిట్ ఇండియా క్విజ్ 2022 ప్రాథమిక పోటీలో అత్యధిక ప్రాతినిధ్యం ఉత్తరప్రదేశ్ నుంచి ఉంది. ఆ రాష్ట్రంలోని 5,368 పాఠశాలల నుంచి 20,470 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గుజరాత్, మధ్యప్రదేశ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఫిట్ ఇండియా క్విజ్, దేశంలోని మూలమూలల్లో ఉన్న పాఠశాల విద్యార్థులకు క్రీడలు, శారీరక దారుఢ్యంలో ఉన్న జ్ఞానాన్ని ప్రదర్శించడానికి ఒక ప్రత్యేక వేదికగా ఉంటుంది. జాతీయ టెలివిజన్‌లో కనిపించి, వారి తెలివితేటలను ప్రదర్శించే అవకాశాన్ని అందిస్తుంది.
*****
(Release ID: 1930626)
Visitor Counter : 171