విద్యుత్తు మంత్రిత్వ శాఖ
పంప్ స్టోరేజీ పథకాలు, ఇతర పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఎన్‌హెచ్‌పీసీ
పంప్ స్టోరేజీ ప్రాజెక్టులను విద్యుత్ నిల్వ కేంద్రాలుగా ఉపయోగించుకోవడానికి అవగాహన ఒప్పందం
Posted On:
07 JUN 2023 12:21PM by PIB Hyderabad
మహారాష్ట్రలో పంప్ స్టోరేజీ పథకాలు, ఇతర పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ - మహారాష్ట్ర ఇంధన శాఖ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
కాలు – 1,150 మెగావాట్లు, సావిత్రి – 2,250 మెగావాట్లు, జలోండ్ – 2,400 మెగావాట్లు, కెంగడి – 1,550 మెగావాట్ల సామర్థ్యంతో కలిసి మొత్తం 7,350 మెగావాట్ల సామర్థ్యంతో నాలుగు పంప్ స్టోరేజీ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం ఎంఓయూలో భాగం. ఒప్పందం ప్రకారం, రాష్ట్రంలో ఇతర పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టులను కూడా అభివృద్ధి చేస్తారు.
2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ స్థాపిత సామర్థ్యం, 2070 నాటికి నికర సున్నా కర్బన ఉద్గారాలు సాధించాలన్న ఇంధన పరివర్తన జాతీయ లక్ష్యం కోసం పంప్ స్టోరేజ్ పథకాలను విద్యుత్ నిల్వ కేంద్రాలుగా ఉపయోగించడం ఒప్పందంలో కనిపిస్తుంది.
రాష్ట్రంలో పంప్ స్టోరేజీ పథకాల అభివృద్ధి కోసం ఎన్‌హెచ్‌పీసీపై నమ్మకం ఉంచినందుకు ఆ సంస్థ సీఎండీ ఆర్.కె.విష్ణోయ్ మహారాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల దాదాపు రూ.44,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, రాష్ట్రంలో 7,000 మందికి పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉపాధిని కల్పిస్తాయని వెల్లడించారు.
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సమక్షంలో ఎంఓయూపై సంతకాలు జరిగాయి. ఎన్‌హెచ్‌పీసీ డైరెక్టర్ (ప్రాజెక్టులు) బిస్వజిత్ బసు, మహారాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి (ఇంధనం) అభ శుక్లా ఒప్పందంపై సంతకాలు చేశారు. ఎన్‌హెచ్‌పీసీ స్వతంత్ర డైరెక్టర్ ఉదయ్ నిర్గుడ్కర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రజత్ గుప్తా సహా రెండు వర్గాలకు చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ భారత ప్రభుత్వ రంగ సంస్థ. దేశంలోనే అతి పెద్ద జల విద్యుత్ ఉత్పత్తి సంస్థ. సూత్రీకరణల నుంచి జల విద్యుత్ ప్రాజెక్టుల ప్రారంభం వరకు అన్ని కార్యకలాపాలు చేపట్టే సామర్థ్యం దీనికి ఉంది. సౌర & పవన విద్యుత్‌ను కూడా ఇది ఉత్పత్తి చేస్తుంది. భారతదేశం, విదేశాల్లో సాంప్రదాయ, సాంప్రదాయేతర వనరుల ద్వారా విద్యుత్ అభివృద్ధి కోసం ప్రణాళిక సిద్ధం చేయడం, ప్రోత్సహించడం, నిర్వహించడం చేస్తుంది. ఎన్‌హెచ్‌పీసీ 2009లో IPOను పూర్తి చేసుకుని ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో లిస్ట్ అయింది.
***
(Release ID: 1930449)
Visitor Counter : 180