సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

‘డిఎఆర్‌పిజి 9 ఏళ్ల విజయాల’పై కరదీపికను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


ప్రధాని మోదీ నాయకత్వాన సామాజిక-ఆర్థిక పరివర్తన
లక్ష్యంగా పరిపాలన సంస్కరణలు: మంత్రి వ్యాఖ్య;

న్యూఢిల్లీలో ‘9 ఏళ్ల ‘డిఎఆర్‌పిజి’ సేవ 2014-2023’పై
నిర్వహించిన వెబినార్‌లో మంత్రి ప్రారంభ ప్రసంగం;

విప్లవాత్మక పాలన సంస్కరణలకు సాంకేతిక పరిజ్ఞాన విస్తృత
వినియోగం.. సమీకృత విధానం జంట స్తంభాలు: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 02 JUN 2023 5:12PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన గడచిన తొమ్మిదేళ్లలో దీర్ఘకాలిక సామాజిక-ఆర్థిక పరివర్తన లక్ష్యంగా పరిపాలన సంస్కరణలు చేపట్టినట్లు కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ, ప్రధాని కార్యాలయ, ప్రజా ఫిర్యాదులు-పెన్షన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల (స్వతంత్ర బాధ్యతగల) సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ మేరకు ఇవాళ న్యూఢిల్లీలో ‘9 ఏళ్ల ‘డిఎఆర్‌పిజి’ సేవ 2014-2023’పై నిర్వహించిన వెబినార్‌లో ఆయన  ప్రారంభ ప్రసంగం చేశారు. గత తొమ్మిదేళ్లలో అమలు చేసిన విప్లవాత్మక పరిపాలన సంస్కరణలకు సాంకేతిక పరిజ్ఞాన విస్తృత వినియోగం, సమీకృత విధానం జంట స్తంభాలని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘9 సంవత్సరాల పరిపాలన సంస్కరణల (2014-2023)పై రెండు కరదీపికలతోపాటు ఒక సంక్షిప్త ప్రచురిత-ఎలక్ట్రానిక్‌ ప్రకటనను కూడా ఆయన ఆవిష్కరించారు.

   నంతరం పాలన సంస్కరణల గురించి వివరిస్తూ- నరేంద్ర మోదీ 2014లో ప్రధానమంత్రిగా పాలన పగ్గాలు చేపట్టిన నాటినుంచి ‘కనిష్ఠ ప్రభుత్వం-గరిష్ఠ పాలన’ తారకమంత్రంగా విధాన నిర్ణయాలు తీసుకుంటున్నారని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ పేర్కొన్నారు. ప్రభుత్వమంటే అధికారం చలాయించేదిగా కాకుండా సౌలభ్యం కల్పించేదిగా ఉండాలన్నది దీని ఉద్దేశమని చెప్పారు. ఈ మేరకు మరింత పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రభుత్వం ప్రతిరూపంగా నిలుస్తుందని, అన్నిటికీ మించి పౌర భాగస్వామ్యాన్ని మరింత పెంచుతుందని పేర్కొన్నారు. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం గురించి శ్రీ సింగ్ విశదీకరిస్తూ- బలమైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగమే చిత్తశుద్ధిగల, సమర్థ ప్రభుత్వానికి సరైన కొలబద్దగా అభివర్ణించారు. ఈ దిశగా జాప్యం తగ్గింపు, సత్వర పరిష్కార పద్ధతులను మెరుగుపరుస్తూ 10 దశల ‘సిపిగ్రామ్స్‌’ (CPGRAMS) సంస్కరణల ప్రక్రియ అమలులోకి తెచ్చినట్లు తెలిపారు. తద్వారా వారానికోసారి 95 నుంచి 100 శాతం వరకూ ఫిర్యాదులు పరిష్కృతం అవుతున్నట్లు చెప్పారు.

   మొత్తంమీద కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలలో సగటు పరిష్కార వ్యవధి మెరుగుపడిందని తెలిపారు. తదనుగుణంగా 2021లో 32 రోజులు కాగా, 2022నాటికి 27 రోజులు, 2023 ఏప్రిల్‌నాటికి 17 రోజుల స్థాయికి తగ్గిందని, ఇందులో భాగంగా 2023 ఏప్రిల్ నాటికి పెండింగ్‌లోగల 67,932 కేసులుసహా మొత్తం 1,06,847 ఫిర్యాదులు పరిష్కృతమైనట్లు వివరించారు. అంతేకాకుండా ఫిర్యాదు పరిష్కారం తర్వాత ‘బిఎస్‌ఎన్‌ఎల్‌’ అభిప్రాయ సేకరణ కేంద్రంద్వారా ఫిర్యాదుదారుల సంతృప్తి స్థాయిని తెలుసుకునే దిశగా వారిని ఫోన్‌ద్వారా సంప్రదించేందుకు ‘డిఎఆర్‌పిజి' ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. మరోవైపు ‘సిపిగ్రామ్స్‌’ను సార్వత్రిక సేవ కేంద్రా(సిఎస్‌సి)లతో అనుసంధానించినట్లు డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ చెప్పారు. ఈ మేరకు 2.5 లక్షల గ్రామీణ వ్యాపారవేత్తలతో ముడిపడిన 5 లక్షలకుపైగా కేంద్రాల్లో ‘సిపిగ్రామ్స్‌’ వ్యవస్థ అందుబాటులో ఉందని చెప్పారు. ఇది అన్ని పంచాయతీల స్థాయిలో అందుబాటులో ఉన్నందున దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ పౌరులకు ‘సిపిగ్రామ్స్‌’ సంబంధిత సేవల సౌలభ్యం కలిగిందని పేర్కొన్నారు.

   రిపాలన సంస్కరణల గురించి డాక్టర్‌ జితేంద్ర సింగ్ మరింత వివరిస్తూ... 2016 నుంచి గ్రూప్-బి (నాన్-గెజిటెడ్) గ్రూప్‌-సి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు రద్దు చేసినట్లు గుర్తుచేశారు. అలాగే శతాబ్దాల వలసపాలన విధానంలో గజిటెడ్ అధికారి నుంచి అర్హత పత్రాల ధ్రువీకరణ పద్ధతిని తొలగించడాన్ని ప్రస్తావించారు. స్వీయ ధ్రువీకరణతో పత్ర సమర్పణ ఆధారంగా  నియామకాలు చేపట్టడం వంటి వినూత్న సంస్కరణలను తెచ్చినట్లు వివరించారు. అదేవిధంగా కొత్త ‘ఐఎఎస్‌’ అధికారులు మూడు నెలలపాటు కేంద్ర ప్రభుత్వంలో సహాయ కార్యదర్శి హోదాలో పనిచేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాలనలో విశిష్టత దిశగా ప్రధానమంత్రి అవార్డు ప్రదానంలో నిర్మాణాత్మక సంస్కరణలుసహా దాదాపు 1,450 అనవసర ప్రభుత్వ నిబంధనలను రద్దు చేయడం గురించి తెలిపారు.

   దేశవ్యాప్తంగా సివిల్ సర్వెంట్ల కృషి, అసాధారణ పనితీరుకు గుర్తింపునిస్తూ ప్రభుత్వ పాలనలో నైపుణ్యం పెంపుదిశగా ప్రధానమంత్రి అవార్డులు కీలక పాత్ర పోషిస్తాయని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో 2014 అనంతరం ప్రధానమంత్రి విశిష్ట కృషి-నైపుణ్యం పురస్కార ప్రదాన ప్రక్రియలో భాగంగా అధికారుల ఎంపిక సంస్థాగతం చేయబడింది. ఆ మేరకు ఇప్పుడిది జిల్లా కలెక్టర్ లేదా వ్యక్తిగతంగా సివిల్‌ సర్వెంట్ల పనితీరుపై అంచనా కాకుండా జిల్లా మొత్తం పనితీరుపై ఆధారపడి ఉంటుంది. జిల్లాలో ప్రతిష్టాత్మక పథకాల అమలు స్థాయి, రేటింగ్‌ అంచనా నిమిత్తం ప్రవేశపెట్టిన మరో మెరుగైన విధానంగా దీన్ని పేర్కొన్నారు. దీంతో కొన్నేళ్లుగా జిల్లాల నుంచి పురస్కర ప్రతిపాదనల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆయన తెలిపారు. కొత్త పద్ధతులు, ఆవిష్కరణలకు ఈ కొత్త పద్ధతులు నాంది పలకడమేగాక, ప్రేరణనిస్తాయన్నారు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆవిష్కరణలు, ఉత్తమ పద్ధతుల అనుసరణకు ఈ పురస్కారాలు ఒక మాధ్యమంగా మారాయని చెప్పారు. తద్వారా భారత పౌరుల శ్రేయస్సుకు ఇవి ఇతోధికంగా దోహదం చేస్తాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి పురస్కారం కోసం 2022లో నమోదిత 763 జిల్లాలకుగాను 743 జిల్లాల నుంచి రికార్డు స్థాయిలో 2,520 దరఖాస్తులు అందాయని తెలిపారు. ప్రధానమంత్రి పురస్కార పథకం కింద 2016, 2017లో చెరో 12 అవార్డుల వంతున ప్రదానం చేయబడ్డాయని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ చెప్పారు. అయితే, 2018, 2019, 2020, 2021 సంవత్సరాల్లో వరుసగా 15, 16, 15, 16 వంతున ఈ పురస్కారాలు ప్రదానం చేయబడినట్లు తెలిపారు. కాగా, ప్రధానమంత్రి అవార్డుల పథకం కింద 2022కుగాను 16వ ‘సివిల్ సర్వీసెస్ డే’ సందర్భంగా 2023 ఏప్రిల్ 21న ప్రదానం కోసం 15 పురస్కారాలకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు.

   పాలన మెరుగు దిశగా చేపట్టిన కార్యక్రమాల గురించి డాక్టర్ సింగ్ వివరిస్తూ- రాష్ట్రాల పనితీరు అంచనా కోసం ఒక సూచీని రూపొందించామని చెప్పారు. ఈ మేరకు ‘డిఎఆర్‌పిజి’ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా 2019 డిసెంబర్ 25న ‘సుపరిపాలన సూచీ (జిజిఐ)  చట్రాన్ని’ ప్రారంభించిందని గుర్తుచేశారు. దీని ఆధారంగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పనితీరుపై  ర్యాంకులు ప్రకటించినట్లు తెలిపారు. ఈ చట్రం అమలుతో పాలన మెరుగుకు మార్గం ఏర్పడిందని చెప్పారు. మరోవైపు ‘జిజిఐ-2021’ కింద 20 రాష్ట్రాలు తమ సమ్మిళిత ‘జిజిఐ’ స్థాయిని మెరుగుపరచినట్లు తెలిపారు. ఇదే తరహాలో, జిల్లా స్థాయిలో పరిపాలన స్థితిగతుల అంచనా నిమిత్తం ‘డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్‌’ (డిజిజిఐ)ని ‘డిఎఆర్‌పిజి’ రూపొందించింది. ఇది 2022 జనవరిలో జమ్ముకశ్మీర్‌ యంత్రాంగంతో సంయుక్తంగా తొలి ‘డిజిజిఐ’ని ప్రచురించింది. ఆ తర్వాత గుజరాత్, ఉత్తరప్రదేశ్‌, అరుణాచల్ ప్రదేశ్‌లలో కూడా ‘డిజిజిఐ’లకు విస్తరించగా, ప్రస్తుతం మహారాష్ట్రలో కృషి సాగుతోంది. ఇక “పాలన నుంచి పాత్ర పోషణ”కు నడిపించే ‘మిషన్ కర్మయోగి’ తారకమంత్రం గురించి ప్రస్తావిస్తూ- ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలు నేడు అధికశాతం వినూత్న సాంకేతికతపై ఆధారపడినవని గుర్తుచేశారు. కాబట్టి, సరికొత్త-సవాళ్లతో నిండిన కొత్త బాధ్యతల నిర్వహణలో సివిల్ సర్వెంట్లు దీనికింద శిక్షణ పొందాలని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

   స్వచ్ఛభారత్‌ 1.0, 2.0 కార్యక్రమాలను ‘డిఎఆర్‌జిపి’ విజయవంతంగా నిర్వహించడంపై సంబంధిత బృందాన్ని డాక్టర్‌ సింగ్‌ అభినందించారు. పరిశుభ్రతతో నగదు రూపేణా ప్రయోజనం కూడా ఉంటుందన్న స్పృహ తొలిసారి సమాజంలో మొలకెత్తిందని పేర్కొన్నారు. కాగా, స్వచ్ఛభారత్ 2.0 కింద లక్షకుపైగా కార్యాలయ ప్రాంగణాల్లో నిర్వహించిన కార్యక్రమాల వల్ల 89.85 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. అలాగే తద్వారా పోగుపడిన ఎలక్ట్రానిక్, ఆఫీసు చెత్త విక్రయం ద్వారా రూ.370.83 కోట్ల ఆదాయం రావడం గమనార్హమని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో తమ మంత్రిత్వ శాఖలోని పని ఒక్క రోజు కూడా ప్రభావితం కాలేదని, పైగా కొన్ని సందర్భాల్లో మరింత ఎక్కువగా జరిగిందని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ గుర్తుచేశారు. డిజిటల్‌ పరివర్తనాత్మకత గురించి మాట్లాడుతూ- కేంద్ర సచివాలయంలోని మొత్తం 75 మంత్రిత్వ శాఖలు/విభాగాల్లో ‘ఇ-ఆఫీస్ వెర్షన్ 7.0’ అనుసరించినట్లు మంత్రి తెలిపారు. ఆ మేరకు మొత్తం ఫైళ్లలో 89.6 శాతం నేడు ఇ-ఫైళ్లుగా పరిశీలన చేయబడుతుండటం అభినందనీయ విజయంమని పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ ప్రక్రియలు-విధానాల్లో సరళత, సమర్థత, పారదర్శకతలతోపాటు  స్పందనాత్మక, బాధ్యతాయుత పాలనకు దోహదం చేసేవిధంగా 2022లో ‘సెంట్రల్ సెక్రటేరియట్ మాన్యువల్ ఆఫ్ ఆఫీస్ ప్రొసీజర్’ (సిఎస్‌ఎంఒపి)ని ‘డిఎఆర్‌పిజి’ రూపొందించిందని మంత్రి తెలిపారు.

   జాతీయ ఇ-పరిపాలన ప్రదాన అంచనా (ఎన్‌ఇఎస్‌డిఎ) గురించి ప్రస్తావిస్తూ- 2021లో అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 1400 సేవలపై దీనికింద మూల్యాంకనం చేశామని డాక్టర్ సింగ్ చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో వీలైనన్ని తప్పనిసరి ఇ-సేవలకుగాను 69 శాతం అందిస్తున్నట్లు తెలిపారు. దీనిపై పౌరుల సంతృప్తి కూడా 74 శాతం వరకూ నమోదైనట్లు పేర్కొన్నారు.

   రాష్ట్రాల స్థాయి పరిపాలన సంస్కరణలు తేవడంలో ‘డిఎఆర్‌పిజి’ పోషించిన పాత్రను డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ప్రశంసించారు. ఇందులో భాగంగా ఉత్తమ పద్ధతుల అనుసరణపై 2014-2023 మధ్య దేశవ్యాప్తంగా 23 ప్రాంతీయ సదస్సులు నిర్వహించిందని తెలిపారు. ప్రభుత్వ సేవల ప్రదానం మెరుగులో రాష్ట్ర ప్రభుత్వాలతో సహకార విస్తృతి దిశగా ‘డిఎఆర్‌పిజి’ రాష్ట్ర సహకార పథకం కింద 77 ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించిందని చెప్పారు. ఇదే తరహాలో  వివిధ దేశాల్లో అత్యుత్తమ పాలన విధానాలను కేంద్రస్థాయిలో అనుసరించేలా అంతర్జాతీయ సంస్థలతో ఆరు అవగాహన ఒప్పందాలపై సంతకం చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ సేవల ప్రదానంలో నాణ్యతాధారిత మెరుగుదల కోసం ‘సేవోత్తం’ పథకం కింద 10 రాష్ట్రాల ‘ఎటిఐ’లకు నిధులు సమకూర్చామని తెలిపారు.

   ప్రధాని మోదీ పాలనకు సంబంధించి అనేక ఆవిష్కరణలు చేసినవారని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తుతించారు. ఆ క్రమంలోనే అమృత కాలంలో భవిష్యత్‌ పరిపాలన సంస్కరణలకూ ప్రాతినిధ్యం వహించే మేథోమధన శిబిరం నమూనాను దూరదృష్టితో రూపొందించారని తెలిపారు. ఈ శిబిరం పరిపాలనాపరంగా ఉత్తమ పద్ధతులను సూచిస్తుంది. ఈ మేరకు ఒంటెద్దు పోకడలకు స్వస్తి, స్వేచ్ఛగా అభిప్రాయాల మార్పిడి వెసులుబాటు కలుగుతుంది. ఒంటిస్తంభపు మేడలను బద్దలు కొడుతూ జట్టు స్ఫూర్తిని పెంచే కసరత్తులకు 48-72 గంటల సగటు వ్యవధితో రూపొందించిన ఈ శిబిరం ఊపిరిపోస్తుంది. ఈ 21వ శతాబ్దపు పాలన పద్ధతులకు తగిన సంస్థాగత గతిశీలత కోసం ప్రతి మంత్రిత్వశాఖ మేథోమధన శిబిరాలను నిర్వహించాలని డాక్టర్‌ జితేంద్రసింగ్‌ సూచించారు.

   స్వావలంబిత భారత నిర్మాణం వైపు మన పయనంలో భాగంగా మనం మరింత ముందడుగు వేస్తున్నపుడు మన పౌరులకు సాధికారత కల్పనపై దృష్టి సారించాలని డాక్టర్‌ సింగ్‌ అన్నారు. అంతేకాకుండా వరుసలో చివరి వ్యక్తికీ ప్రయోజనాలు చేరేలా చూడటం మన లక్ష్యం కావాలన్నారు. ప్రధాని మోదీ తరచూ ఉద్బోధిస్తున్న మేరకు- పౌరులకు సాధికారత కల్పించడమంటే... దేశంలో ప్రతి వ్యక్తికీ ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉపాధి తదితర ప్రాథమిక అవసరాలన్నీ తీరేలా చూడటమేనని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతి పౌరుడూ తమ పూర్తి శక్తిసామర్థ్యాలను వినియోగించుకోగల వాతావరణ సృష్టి కూడా అవసరమన్నారు. ఈ లక్ష్యాన్ని నెరవేర్చడంలో భాగంగా ‘విజన్‌-2047’ సాకారానికి కృషి చేయడం అవసరమన్నారు. ఈ కృషిలో సాంకేతిక మెరుగుదల, గరిష్ఠ స్థాయిలో పరిష్కారాల ఆవిష్కరణ వంటివి ప్రధానాంశాలని స్పష్టం చేశారు.

*****



(Release ID: 1929613) Visitor Counter : 105


Read this release in: English , Urdu , Hindi , Manipuri