పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

హెలికాప్టర్ మార్గాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉడాన్‌ 5.1 ప్రారంభించిన పౌర విమానయాన శాఖ

Posted On: 24 MAY 2023 6:23PM by PIB Hyderabad

ప్రాంతీయ అనుసంధాన పథకం (ఆర్‌సీఎస్‌) - ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ (ఉడాన్) నాలుగు విడతలు విజయవంతంగా పూర్తి కావడంతో, ఐదో విడతగా ఉడాన్‌ 5.1ను పౌర విమానయాన శాఖ ప్రారంభించింది. దేశంలోని మారుమూల ప్రాంతాల అనుసంధానాన్ని మరింత మెరుగుపరచడానికి, హెలికాప్టర్ల ద్వారా చివరి మైలు అనుసంధానతను సాధించడానికి దీనిని ప్రారంభించింది.

ఆర్‌సీఎస్‌-ఉడాన్‌ కింద మొదటిసారిగా ప్రత్యేకంగా హెలికాప్టర్ మార్గాల కోసం దీనిని రూపొందించింది.

ప్రధాన అంశాలు:

  • హెలికాప్టర్ నిర్వాహకుల కార్యకలాపాల పరిధిని పెంచడం వల్ల, ప్రారంభ లేదా గమ్యస్థానాల్లో ఏదో ఒకటి ప్రాధాన్యత ప్రాంతంలో ఉన్న మార్గాలను ఇది అనుమతిస్తుంది. ఇంతకుముందు రెండు స్థానాలు ప్రాధాన్యత ప్రాంతాల్లో ఉండాలి.
  • ప్రయాణీకులు మరింత తక్కువ ధరలకు హెలికాప్టర్లలో ప్రయాణించడం కోసం ఛార్జీల పరిమితులను 25% తగ్గించారు.
  • అందించిన మార్గాల్లో హెలికాప్టర్లను నడపడానికి, ప్రారంభ నష్టాలను అధిగమించడానికి ఏక, రెండు ఇంజిన్ హెలికాప్టర్‌ ఆపరేటర్‌ల కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (పీజీఎఫ్‌) పరిమితులు గణనీయంగా పెంచారు.

“ఉడాన్ పథకంలో కొత్త విడత భారతీయ పౌర విమానయానంలో చోటు చేసుకుంటున్న రెండు గొప్ప మార్పులకు నిదర్శనం. ఒకటి, చివరి మైలు అనుసంధానతపై దృష్టితో విమాన ప్రయాణాన్ని అందరికీ చేరువ చేయడం. రెండవది, పర్యాటక వృద్ధికి హెలికాప్టర్ల చేస్తున్న కృషి. హెలికాప్టర్ వ్యాప్తి మరింత పెరగడం వల్ల పర్యాటకం, ఆతిథ్యం, తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థలు వృద్ధి చెందుతాయి. ఉడాన్‌ 5.1 పౌర విమానయానానికి మాత్రమే కాకుండా, దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా కొత్త ఉదయాన్ని పరిచయం చేస్తుంది" అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సిందియా చెప్పారు.

హెలికాప్టర్ నిర్వాహకులు సహా సంబంధిత అన్ని వర్గాలతో సంప్రదింపుల తర్వాత పథకం ప్రస్తుత విడతను రూపొందించారు. చివరి మైలు అనుసంధానాన్ని అందించడం దీని లక్ష్యం కాగా, హెలికాప్టర్ విభాగానికి కూడా చాలా ప్రోత్సాహాన్ని అందిస్తుందని అంచనా వేశారు.

ఈ పథకంలోని గత విడతల కింద ఇప్పటి వరకు 46 హెలికాప్టర్ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి, కొండ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చాయి. తాజా విడత, చాలా పెద్ద సంఖ్యలో మార్గాలను లక్ష్యంగా చేసుకుంది.

ఉడాన్‌ పథకం కింద ప్రయాణీకులు వాయుమార్గ అనుసంధాన యొక్క ప్రయోజనాన్ని పొందుతున్నారు. వాయు మార్గాల్లో ప్రయాణీకులను చేరవేయడానికి విమానయాన సంస్థలు రాయితీలు పొందాయి. మారుమూల ప్రాంతాలు విమాన అనుసంధానం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనాలను పొందాయి. సామాన్యులు కూడా దేశంలోని మారుమూల ప్రాంతాలకు తక్కువ ధరలోనే విమానంలో ప్రయాణించేలా చేయడం ఈ పథకం ప్రస్తుత విడత ఉద్దేశం. సామాన్యుడు కూడా విమానం ఎక్కాలన్న ప్రధాన మంత్రి దార్శనికతలో మరో ముందడుగు పడింది.

 

***(Release ID: 1927146) Visitor Counter : 154


Read this release in: English , Urdu , Hindi , Marathi