వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
2వ 'ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ వర్కింగ్ గ్రూప్' సమావేశం జీ20 ప్రతినిధుల కోసం 'ది బెంగళూరు స్టోరీ' పేరిట నగర పర్యటన, సాంస్కృతిక కార్యక్రమం నిర్వహణ
Posted On:
24 MAY 2023 1:45PM by PIB Hyderabad
బెంగళూరులో జరిగిన 2వ 'ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ వర్కింగ్ గ్రూప్' (టీఐడబ్ల్యూజీ) సమావేశంలో పాల్గొన్న జీ20 ప్రతినిధుల కోసం, నిన్న సాయంత్రం, ‘ది బెంగళూరు స్టోరీ’ పేరిట నగరంలో బస్ యాత్ర, కర్ణాటక సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేశారు.
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బెంగళూరు నగరం, నగరంలోని అందమైన ఉద్యానవనాలు, సిలికాన్ వ్యాలీగా పేరు సాధించిన బెంగళూరు ఘనతను గురించి అవగాహన కల్పించడం ఈ పర్యటన ఉద్దేశం.
బెంగళూరు రాజప్రాసాదంలో, రాచరిక నిర్మాణ కౌశలాన్ని చాటి చెప్పే బురుజులు, తోరణాలు, బలమైన కట్టడాలను ప్రతినిధులు వీక్షించారు. ఇంగ్లండ్‌లోని విండ్సర్ కోట స్ఫూర్తితో దీనిని నిర్మించారు. కోటలో ఉన్న భారీ బహిరంగ ప్రాంగణం కర్ణాటక సుదీర్ఘ సాంస్కృతిక, చారిత్రక, సంగీత వారసత్వానికి నిదర్శనంగా నిలిచింది. మ్యూజియం ఆఫ్ ఆర్ట్ అండ్ ఫోటోగ్రఫీ, కబ్బన్ పార్క్, విధాన సౌధను కూడా ప్రతినిధులు సందర్శించారు. మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర బృంద ఫోటో కార్యక్రమంతో నగర పర్యటన ముగిసింది. ‘ది బెంగళూరు స్టోరీ’ని కర్ణాటక పర్యాటక శాఖ రూపొందించింది.
2వ టీఐడబ్ల్యూజీ సమావేశం మొదటి రోజు సాంస్కృతిక కార్యక్రమం, పసందైన విందుతో ముగిసింది. కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలు, నృత్య రూపాలను సాంస్కృతిక కార్యక్రమంలో ప్రదర్శించారు. కళానిధి నృత్య మందిరం, స్పేస్ కథక్, శ్రీ నాట్య నికేతన్ ఈ ప్రదర్శనలు ఇచ్చాయి.
నిన్న జరిగిన 2వ టీఐడబ్ల్యూజీ సమావేశంలో 100 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. జీ20 దేశాల ప్రతినిధులతో పాటు, ఆహ్వానిత దేశాల ప్రతినిధులు, దేశీయ & అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా తరలివచ్చారు. ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులను వేగవంతం చేయడం వంటి చర్చల్లో అందరూ పాల్గొన్నారు.
*****
(Release ID: 1926955)
Visitor Counter : 143