వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్ యూరోపియన్ యూనియన్ వాణిజ్య, సాంకేతిక పరిజ్ఞాన మండలి సమావేశం సందర్భంగా బ్రెటన్ తో గోయెల్ భేటీ
Posted On:
17 MAY 2023 3:31PM by PIB Hyderabad
భారత్ యూరోపియన్ యూనియన్ వాణిజ్య, సాంకేతిక పరిజ్ఞాన మండలి సమావేశం సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల, జౌళి, వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజాపంపిణీ శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయెల్ అంతర్గత వర్తక యూరోపియన్ కమిషనర్ శ్రీ తియరీ బ్రెటన్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రజాస్వామ్య విలువలు పాటిస్తూ పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరాన్ని, అటు భారతదేశం, ఇటు యూరోపియన్ యూనియన్ ఉమ్మడిగా ముందుకు సాగాల్సిన విధానాన్ని ఈ సందర్భంగా చర్చించుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత శిఖరాలకు చేరాలంటే రాజకీయంగా నిబద్ధత అవసరమని ఇరుపక్షాలూ అభిప్రాయపడ్డాయి.
భారతదేశం ఇప్పటికే సుస్థిరాభివృద్ధి లక్షాలు అధికభాగం సాధించిందని, వచ్చే 25 ఏళ్లలో ప్రగతికి ప్రణాళికలు రచించి అమలు చేస్తున్నదని శ్రీ పీయూష్ గోయెల్ చెప్పారు.2030 లక్ష్యంగా పెట్టుకున్న 40% పునరుత్పాదక ఇంధన తయారీని లక్ష్యానికి ముందే సాధించిన విషయాన్ని శ్రీ గోయెల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం తయారుచేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇరు పక్షాల ఆర్థిక వ్యవస్థల ప్రాతిపదికలు వేరువేరుగా ఉన్నందున ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ఉమ్మడి కృషికి చాలా అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. అంతరిక్ష రంగంలో సహకారానికి ఉన్న అవకాశాలు పరిశీలించాలని శ్రీ బ్రెటన్ చేసిన సూచనకు శ్రీ గోయెల్ సానుకూలంగా స్పందించారు. అంతరిక్ష రంగంలో భారతదేశం ప్రధాన శక్తులలో ఒకటిగా ఉందని, అందువలన ఈ రంగంలో బలమైన సహకారానికి సిద్ధమని చెప్పారు.
యూపీఐ, రూపే ద్వారా భారతదేశం ఫిన్ టెక్ లో అంతర్జాతీయంగా చాలా ముందున్నదన్న విషయం కూడా మంత్రి గోయెల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. డిజిటల్ వాణిజ్యం కోసం ఓపెన్ నెట్ వర్క్ కూడా భారతదేశం రూపొందించి అందుబాటులో ఉంచిందన్నారు. అన్ని నెట్ వర్క్ ల అమ్మకం దారులు, కొనుగోలుదారులను ఏకం చేయటానికి తగిన సామర్థ్యం దీనికి ఉందని చెప్పారు. యూరోపియన్ యూనియన్ సరికొత్త డిజిటల్స్ సేవల చట్టాన్ని రూపొందించే పనిలో ఉందని శ్రీ బ్రెటన్ చెప్పగా, ఈ విషయంలో ఇరుపక్షాలూ మరింతగా సహకరించుకొని ఐటీ రంగంలో ప్రధాన శక్తి అయిన భారత్ సేవలను ఉపయోగించుకోవచ్చునని సూచించారు. ప్రపంచంలో మూడవ అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్ఠ భారతదేశంలో ఉన్నదని అందుకే జి 20 సమావేశాలలో ఈ అంశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. దీనివల్ల డిజిటల్ రంగంలో మరింత సహకారం సాధ్యమవుతుందన్నారు.
కార్బన్ బోర్డర్ సర్దుబాటు ప్రక్రియ గురించి మాట్లాడుతూ, వస్తుసేవాల ధరల పెరుగుదల కారణంగా ఇరుపక్షాల వాణిజ్య సంస్థల మీద, వర్తకం మీద, వినియోగదారుల మీద దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందో మరింత అధ్యయనం చేయాల్సి ఉంటుందని శ్రీ గోయెల్ చెప్పారు.
***
(Release ID: 1925112)
Visitor Counter : 186