సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ఒడిశాలోని భువనేశ్వర్‌లో రేపు ప్రారంభం కానున్న 2వ జీ20 కల్చర్ వర్కింగ్ గ్రూప్ (సీడబ్ల్యూజీ) సమావేశం
మే 15న ‘సస్టెయిన్: ది క్రాఫ్ట్ ఇడియమ్’ ఎగ్జిబిషన్ ప్రారంభించనున్న శ్రీ జి.కిషన్ రెడ్డి, శ్రీ నవీన్ పట్నాయక్
మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో జరిగిన 1వ సీడబ్ల్యూజీ సమావేశానికి కొనసాగింపుగా జరగనున్న 2వ సీడబ్ల్యూజీ సమావేశం
Posted On:
13 MAY 2023 5:20PM by PIB Hyderabad
2వ జీ20 కల్చర్ వర్కింగ్ గ్రూప్ (సీడబ్ల్యూజీ) సమావేశం ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈ నెల 14-17 తేదీల్లో జరుగుతుంది. జీ20 దేశాల సభ్యులు, అతిథి దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. సాంస్కృతిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలను లోతుగా చర్చించడానికి, సమస్యల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేయడానికి ఒక అవకాశాన్ని ఈ సమావేశం అందిస్తుంది.
మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో జరిగిన 1వ సీడబ్ల్యూజీ సమావేశానికి కొనసాగింపుగా 2వ సీడబ్ల్యూజీ సమావేశం జరుగుతుంది. 1వ సమావేశం తర్వాత, గత రెండు నెలలుగా నిపుణుల ద్వారా అంతర్జాతీయ వెబ్‌నార్‌లు జరిగాయి.
"కల్చర్ ట్రాక్ ఆఫ్ ఇండియాస్ జీ20 ప్రెసిడెన్సీ" కింద గుర్తించిన 4 కీలక ప్రాధాన్యత రంగాలపై కల్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు దృష్టి పెట్టాయి. అవి 1.సాంస్కృతిక ఆస్తి రక్షణ & పునరుద్ధరణ; 2.స్థిరమైన భవిష్యత్తు కోసం జీవన వారసత్వాన్ని ఉపయోగించడం; 3.సాంస్కృతిక & సృజనాత్మక పరిశ్రమలు, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం; 4.సంస్కృతి రక్షణ & ప్రోత్సాహం కోసం డిజిటల్ సాంకేతికతను పెంపొందించడం.
భువనేశ్వర్‌లోని పూరీ బీచ్‌లో, ఈ నెల 14వ తేదీన, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుదర్శన్ పట్నాయక్ ప్రదర్శించే ఇసుక కళ కార్యక్రమం ఉంటుంది. 'కల్చర్ యునైట్స్ ఆల్' అనే ప్రదర్శనాంశంతో దీనిని నిర్వహిస్తున్నారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ప్రారంభిస్తారు. భారతదేశంలోని విభిన్న సంస్కృతులు, వర్గాల మధ్య శాంతియుత సహజీవనం, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రపంచానికి చాటడం ఈ కార్యక్రమం ఉద్దేశం. సాంస్కృతిక మార్పిడి, అవగాహన ద్వారా మనం మత సరిహద్దులను అధిగమించగలం, అనుబంధాలను పెంపొందించగలం, వ్యక్తులు, సంఘాలు, దేశాల మధ్య అర్ధవంతమైన చర్చలను ప్రేరేపించగలం అని చాటి చెప్పడం 'కల్చర్ యునైట్స్ ఆల్' కథాంశం.
జీ20 కల్చర్ వర్కింగ్ గ్రూప్ సభ్యుల కోసం వివిధ సాంస్కృతిక అనుభవాలను సిద్ధంగా ఉంచారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన కోణార్క్ సూర్య దేవాలయం, ఉదయగిరి గుహలు వంటి ప్రదేశాలను చూపిస్తారు. ఒడిశా రాష్ట్ర ప్రత్యేక నృత్య రీతులైన గిరిజన (సింగారి), సంబల్‌పురి, ఒడిస్సీ, గోటిపువా వంటి ప్రదర్శనలు కూడా ఈ సమావేశంలో భాగంగా ఉంటాయి.
2వ జీ20 కల్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో భాగంగా, భువనేశ్వర్‌లోని ఒడిశా క్రాఫ్ట్స్ మ్యూజియం కళాభూమిలో ‘సస్టైన్: ది క్రాఫ్ట్ ఇడియమ్’ పేరుతో ప్రదర్శన ఉంటుంది. కల్చర్ వర్కింగ్ గ్రూప్ రెండో ప్రాధాన్యత అంశమైన 'సుస్థిర భవిష్యత్తు కోసం జీవన వారసత్వాన్ని ఉపయోగించడం' ఆధారంగా ఈ ప్రదర్శన ఉంటుంది.
ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్నాయక్; కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి; సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ఈ ప్రదర్శనను మే 15న ప్రారంభించనున్నారు. మే 16 నుంచి 22 వరకు ప్రజల కోసం దీనిని తెరిచి ఉంచుతారు.
జీ20 దేశాల సభ్యులు, అతిథి దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో లోతైన చర్చల ద్వారా కల్చర్ వర్కింగ్ గ్రూప్ పని చేస్తుంది. పరస్పర సహకారం కోసం కీలక అంశాలను గుర్తించడం, స్థిరమైన అభివృద్ధి కోసం స్పష్టమైన సిఫార్సులు & ఉత్తమ పద్ధతులను మరింత మెరుగుపరచడం వంటివాటిని కల్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
****
(Release ID: 1923994)
Visitor Counter : 197