జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ గంగ పరిశుభ్రత మిషన్ (ఎన్ ఎం సి జి) ఆధ్వర్యంలో నదీతీర నగరాల మైత్రిపై ప్రపంచ సదస్సు

Posted On: 04 MAY 2023 5:18PM by PIB Hyderabad


జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ (ఎన్ ఐ యు ఎ)తో కలిసి జాతీయ  గంగ పరిశుభ్రత మిషన్ (ఎన్ ఎం సి జి) నదీతీర నగరాల మైత్రిపై (ఆర్ సి ఎ) ప్రపంచ సదస్సు నిర్వహించింది.  

        అంతర్జాతీయంగా నదుల కారణంగా సత్వర స్పందన వంటి సమస్యలు ఎదుర్కొంటున్న నగరాల మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి న్యూ ఢిల్లీలో గురువారం సదస్సు నిర్వహించడం జరిగింది.  నదీతీర నగరాల మైత్రిపై ప్రపంచ సదస్సు ప్రధాన ఉద్దేశం నగరాలు / పట్టణాలకు చేరువలో ఉన్న నదుల నిర్వహణకు యోగ్యమైన పద్ధతులను తెలుసుకోవడానికి, చర్చించడానికి సభ్య నగరాల అధికారులు,  అంతర్జాతీయ భాగస్వామ్య పక్షాలని   ఒక వేదికపై తేవడం.    
     
        ఆర్ సి ఎ  ప్రపంచ సదస్సుకు ఎంపిక చేసిన దేశాల రాయబారులు / హై కమిషనర్లు మరియు వారి సంబంధిత నదీతీర   నగరాల అధికారులు హాజరయ్యారు.   తద్వారా వారంతా తాము నిర్వహించిన కార్యక్రమం ఉద్దేశాలు, సాధించిన విజయాలు మరియు ఈ విధంగా కలిసి పనిచేయడం వల్ల కలిగే లాభాల గురించి పరస్పర చర్చలు జరిపారు.  

          రాష్ట్ర  గంగ పరిశుభ్రత మిషన్లు మరియు ప్రపంచ బ్యాంకు,  ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి), జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జికా), కె ఎఫ్ డబ్ల్యు అభివృద్ధి బ్యాంకు వంటి ఆర్ధిక సంస్థలు  కూడా చర్చలలో పాల్గొన్నాయి.

          ఆర్ సి ఎ ప్రపంచ సదస్సుకు ఎన్ ఎం సి జి డైరెక్టర్ జనరల్ శ్రీ జి. అశోక్ కుమార్ అధ్యక్షత వహించారు.  

          సదస్సులో మాట్లాడుతూ శ్రీ జి. అశోక్ కుమార్ నదీతీర నగరాల మైత్రి కూటమిలో చేరుతున్న నగరాల సంఖ్య పెరగడం,  ఈ అంశంపై  ఎన్ ఎం సి జి ఎంతో ఆసక్తిని పుట్టించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.  పట్టణ నదీ నిర్వహణ ప్రణాళికతో బొట్లు బొట్లుగా ప్రారంభమైన కార్యక్రమం అప్పటి నుంచి ప్రహిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.  వాతావరణ మార్పులకు, పట్టణ నీటి నిర్వహణకు  సంబంధించిన అంశాల ప్రాముఖ్యత మరియు  పట్టణ ప్రణాళికా రూపకర్తల ముందున్న సవాలును ఆయన ఉద్ఘాటించారు.  "వాతావరణ మార్పు వాస్తవం.  ఢిల్లీలో మనం దాని ఇప్పుడు చూస్తున్నాం.  మే నెలలో మనకు బ్లాంకెట్లు కప్పుకోవలసి వస్తోంది"  అని ఆయన అన్నారు.     

            మొదట గంగా  నదీ పరీవాహక ప్రాంతం / హరివాణం లో  ఉన్న 30 నగరాలతో  నదీతీర నగరాల మైత్రీ కూటమి  ప్రారంభమైంది.  క్రమంగా దానిని గంగ బేసిన్ కు పరిమితం చేయకుండా అన్ని నగరాలకు విస్తరించాలని నిర్ణయించడం జరిగింది.  " మునుపు నీరు అంత ముఖ్యమైన అంశం కాదని పెదవి విరిచిన నగర ప్రణాళిక రూపకర్తలు పూనాలో జరిగిన ధారా 2023 సమ్మేళనంలో ఎంతో ఆసక్తిని చూపించడం మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు.  అంతేకాక " వరదలు, అనావృష్టి,  కరవుకాటకాలు, ఘన వ్యర్థాల నిర్వహణలో అసమగ్రత మొదలైన  నీటికి సంబంధించిన విషయాలు పట్టించుకోకపోతే నగరాల మనుగడకే ముప్పు వాటిల్లగలదని వాస్తవాన్ని తెలుసుకున్న ప్రజలు, అధికారులు జాగరూకతతో వ్యవహరిస్తున్నారు"  అని కూడా ఆయన అన్నారు.    ఇప్పటికైనా పట్టణ ప్రణాళికా రచయితలు ప్రణాళిక తయారీ స్థాయిలో నీటి నిర్వహణ కూడా దానిలో చేర్చి ఇవ్వాల్సినంత ప్రాధాన్యతను ఇవ్వగలరనే ఆశాభావాన్ని ఎన్ ఎం సి జి డైరెక్టర్ జనరల్ వ్యక్తం చేశారు.

          ప్రధానమంత్రి నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్,  జల జీవన్ మిషన్ మంచి ప్రగతిని సాధిస్తున్నాయని,  వాటివల్ల సాధిస్తున్న సానుకూల  ఫలితాలు నీరు, పారిశుద్ధ్య రంగాల్లో ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని శ్రీ అశోక్ కుమార్ అన్నారు.   బహిరంగ మల విసర్జన నిలిపివేయడం వల్ల మంచి నీటి వనరులు కలుషితం కాకుండా శుభ్రమైన నీరు లభిస్తోందని,   జల జీవన్ మిషన్ ద్వారా  ఇంటింటికీ తాగునీటి సరఫరావల్ల గ్రామీణ ప్రాంతాలకు చెందిన స్త్రీలకు మంచి నీటి కోసం మైళ్ళ కొద్దీ నడవాల్సిన బాధ తప్పిందని ఆయన అన్నారు.  

         " పట్టణీకరణ జరుగుతున్న క్రమంలో మురుగు నీటిని బయటకు పంపించడానికి  , శుద్ధి చేయడానికి శ్రద్ధ చూపకపోతే అది ఆయా పట్టణాలకు, నగరాలకు ముప్పుగా మారగలదు.   కేవలం మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిని కేంద్రీకరించిన పట్టణ ప్రణాళికా రూపకర్తలు నదులు, ఇతర జల వనరులను పరిశుభ్రంగా ఉంచే విషయంలో శ్రద్ధ తీసుకోవాలి" అని ఆయన అన్నారు.  

          న్యూయార్క్ నగరంలో 2023 మార్చి నెలలో జరిగిన ఐక్య రాజ్య సమితి జల సమ్మేళనంలో ఆర్ సి ఎ ఇతివృత్తం ప్రతిధ్వనించింది.  సరైన సమయంలో ఇండియాలో  నీటి రంగం విజయం సాధించడానికి కారణం ప్రజల ప్రాతినిధ్యం (జన భాగీరథి),  ప్రభుత్వంలోని అన్ని శాఖలు  కలిసి పనిచేయడం అని ఆయన అన్నారు.  అంతేకాక  ఇప్పుడు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి యోచనకు అనుగుణంగా ప్రపంచమంతా ఒకటే అనే భావనతో ముందడుగు వేసి నీటి విభజనకు కట్టిన అడ్డుగోడలు కూలగొట్టాలని కూడా ఆయన అన్నారు.  

   ప్రపంచ దేశాలు సహకరించి ,  కలిసి కట్టుగా పనిచేయాలని,  ఇతరుల మంచి అనుభవాల నుంచి నేర్చుకొని విజ్ఞానాన్ని పంచుకోవాలని (జ్ఞాన భాగీరథి),  పరివర్తనకు తోడ్పడే పరిష్కారాలను చూపించి విజయంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపు ఇచ్చారు.  

       ఆర్ సి ఎ గ్లోబల్ గురించి ప్రస్తావిస్తూ విదేశీ భూభాగంపై ఉన్న రైన్ ,  థేమ్స్ నదులను శుభ్రం చేస్తున్న తీరును చూసి స్ఫూర్తి పొంది పాఠాలు నేర్చుకోవాలని ఆయన అన్నారు.  అంతర్జాతీయ నగరాల భాగస్వామ్యంలో ఇండియాలో సుందర నగరాలను సృష్టించాలని అన్నారు.   ఇతరులను చూసి మక్కీకి మక్కీ కాపీ కొట్టకుండా మన అవసరాలకు అనుగుణంగా వారి అనుభవాలలో మంచి వాటిని అనుసరించి మన నగరాలను సుందరంగా మార్చాలని అన్నారు.

        ప్రకృతి సంపద పునరుద్ధరణ పనులకు సంబంధించి కెనడాలోని మాంట్రియల్ లో జరిగిన సభలో  మన 'నమామిగంగే' కార్యక్రమం ప్రపంచంలో ప్రకృతి పునరుద్ధరణకు జరుగుతున్న మొదటి 10 పనులలో ఒకటిగా నిలిచిందని డైరెక్టర్ జనరల్ తెలియజేశారు.
         
        సదస్సులో ఆసియా అభివృద్ధి బ్యాంకు సంస్థ (ఎ డి బి ఐ)  , ఆర్ సి ఎ  పరిశోధనా వ్యాసాలు సమర్పించారు.  స్లయిడ్లను ప్రదర్శించారు.   ఆర్ సి ఎ ద్వారా  పట్టణాల కోసం  ఎన్ ఎం సి జి ఎజెండా గురించి,  నగరతీర నదుల గురించి,  నదుల నిర్వహణ గురించి,  భవిష్యత్ లక్ష్యాలు /చర్యల గురించి పరిచయం చేశారు.   రౌండ్ టేబుల్ చర్చ జరిగింది. అయోధ్య , ఛత్రపతి శంభాజీ నగర్ గురించి ప్రదర్శన ఏర్పాటు చేశారు.  అంతేకాక ఇండియా - డెన్మార్క్ భాగస్వామ్యంపై ప్రతినిధులు స్లయిడ్లను ప్రదర్శించారు.

       అంతర్జాతీయ నగరాలు గ్రేట్ మాంచెస్టర్,  హాంబర్గ్ ,  కోపెన్ హాగన్ గురించి ప్రదర్శించారు.  ప్రతినిధుల చర్చా గోష్టి జరిగింది. ఎన్ ఎం సి జి  డిప్యూటీ సెక్రటరీ శ్రీ ధీరజ్ జోషి వందన సమర్పణ చేశారు.     ఎన్ ఎం సి జి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  (టెక్నీకల్) శ్రీ డి.పి. మథురియా  తమ  ప్రత్యేక ప్రసంగంలో  జల భద్రత, వాతావరణ మార్పు వంటి సవాళ్లను ఎదుర్కోడానికి భారత ప్రభుత్వం జల రంగంలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతోందని చెప్పారు.  

       దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రతినిధులు,  అధికారులు,  నిపుణులు పాల్గొన్నారు.  

***


(Release ID: 1922226) Visitor Counter : 197


Read this release in: English , Urdu , Hindi , Tamil