శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

లండన్ సైన్స్ మ్యూజియం సందర్శించి టీకా కార్యక్రమంలో భారత్ సాధించిన విజయాలు వివరించిన డాక్టర్ జితేంద్ర సింగ్


2025 నాటికి భారత వ్యాక్సిన్ మార్కెట్ రూ. 252 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 30 APR 2023 3:10PM by PIB Hyderabad

175 సంవత్సరాల పురాతన లండన్ సైన్స్ మ్యూజియం ను  కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ శాస్త్రం, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్, అణుశాస్త్రం, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు సందర్శించారు. భారతదేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో లండన్ సైన్స్ మ్యూజియం తరహాలో సైన్స్ మ్యూజియంల ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలను డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. 

ప్రజలు, ముఖ్యంగా యువత తమలో దాగి ఉన్న సామర్థ్యాన్ని గుర్తించడానికి సైన్స్ మ్యూజియంలు ఉపయోగపడతాయన్నారు. సైన్స్ మ్యూజియం సందర్శించిన తర్వాత కొన్నిసార్లు వారికే తెలియని వారి నిగూడ సామర్థ్యాన్ని కూడా ప్రజలు గుర్తిస్తారన్నారు. సామర్థ్యాలను గుర్తించడంతోపాటు సైన్స్ పట్ల వారికి ఉత్సుకత కలుగుతుందన్నారు. ఉత్సుకత వల్ల శాస్త్రీయ పరిజ్ఞానం పట్ల ఆసక్తి పెరిగి సృజనాత్మక ఆవిష్కరణలకు దారితీస్తాయని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.     

లండన్‌లోని సౌత్ కెన్సింగ్టన్‌లోని ఎగ్జిబిషన్ రోడ్ లో లండన్ సైన్స్ మ్యూజియం 1857లో ఏర్పాటయింది. కోవిడ్ సమయంలో భారతదేశం అనుసరించిన విధానం, అమలు చేసిన కార్యక్రమాలు, సాధించిన విజయాలను మ్యూజియం నిర్వాహకులు ప్రశంసించారు. 

డాక్టర్ జితేంద్ర సింగ్ తన పర్యటనలో ఇంధనం,టీకాలు, అంతరిక్ష అంశాలపై ఏర్పాటైన ప్రాంతాలపై దృష్టి సారించారు.  

కోవిడ్ పై ఏర్పాటు చేసిన ప్రత్యేక పెవిలియన్ వివరాలను మ్యూజియం నిర్వాహకుల నుంచి మంత్రి తెలుసుకున్నారు. కోవిడ్ సంబంధించిన వివిధ అంశాలపై  పెవిలియన్ ఏర్పాటయింది. కోవిడ్ చరిత్ర, కోవిడ్ సోకిన మొదటి వ్యక్తి వివరాలు తదితర అంశాలను దీనిలో ఏర్పాటు చేశారు. కోవిడ్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులను చేయాలనే లక్ష్యంతో కోవిడ్ పెవిలియన్ ఏర్పాటయింది. కోవిడ్ నిర్వహణ, నివారణ కోసం భారతదేశం అమలు చేసిన కార్యక్రమాల వివరాలను పెవిలియన్ లో పొందుపరిచిన నిర్వాహకులు భారతదేశం సాధించిన విజయాలను గుర్తించి గౌరవించారు.    

భారత ఉపఖండంలో ప్రబలంగా ఉన్న ఉష్ణమండల వ్యాధుల వివరాలు వివరిస్తూ ఏర్పాటైన మరో పెవిలియన్ ను డాక్టర్ జితేంద్ర సింగ్ సందర్శించారు. పోలియో నిర్మూలన కోసం భారతదేశంలో అమలు జరుగుతున్న కార్యక్రమం వివరాలు పెవిలియన్ లో ఏర్పాటు అయ్యాయి.దీనిలో  హిందీ భాషలో వ్రాసిన బ్యానర్‌లతో ఏర్పాటు చేసిన  ప్రత్యేక విభాగం మంత్రిని ఆకట్టుకుంది. పోలియో నివారణ, ఆరోగ్య సంరక్షణ రంగంలో భారతదేశం ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది అని లండన్ సైన్స్ మ్యూజియం పేర్కొంది.  

 ప్రపంచంలో ప్రధాన బయో-ఆర్థిక వ్యవస్థగా భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా, ఆవిష్కరణలు,సాంకేతిక రంగాల్లో భారతదేశం  వేగంగా అభివృద్ధి చెందిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. కేవలం రెండేళ్లలో భారత్‌ నాలుగు స్వదేశీ వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేసిందని ఆయన వెల్లడించారు. 

శాస్త్ర, సాంకేతిక  మంత్రిత్వ శాఖలోని బయోటెక్నాలజీ విభాగం (DBT) “మిషన్ కోవిడ్ సురక్ష” ద్వారా నాలుగు వ్యాక్సిన్‌లను పంపిణీ చేసిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.  కోవాక్సిన్ ఉత్పత్తిని ఎక్కువ చేసిన బయోటెక్నాలజీ విభాగం   భవిష్యత్తులో వ్యాక్సిన్‌ల సజావుగా అభివృద్ధి చెందడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టించిందని మంత్రి తెలిపారు. ఎటువంటి విపత్తును అయినా ఎదుర్కోవడానికి భారతదేశం సిద్ధంగా ఉందని మంత్రి ప్రకటించారు. 

వ్యాధులను నివారించడానికి భారతదేశం అమలు చేస్తున్న ఆరోగ్య సంరక్షణ విధానం అత్యుత్తమ సామర్థ్యాలను ప్రపంచ దేశాలు గుర్తించాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంలో భాగంగా   అనేక ఇతర వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేసే ప్రక్రియపై భారతదేశం దృష్టి సారించిందని  డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఇటీవల మొదటి డిఎన్ఏ వ్యాక్సిన్ భారతదేశంలో రూపుదిద్దుకుందని తెలిపిన డాక్టర్ జితేంద్ర సింగ్ ముక్కు ద్వారా తీసుకునే విధంగా అభివృద్ధి చేసిన  వ్యాక్సిన్ కూడా విజయవంతం అయ్యిందన్నారు.  గర్భాశయ క్యాన్సర్ నివారణకు  సహాయపడే హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) వ్యాక్సిన్ ను కూడా భారతదేశం అభివృద్ధి చేసిందని వెల్లడించారు. 

ప్రపంచ స్థాయిలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న భారత వ్యాక్సిన్ మార్కెట్ 2025 నాటికి రూ. 252 బిలియన్లకు చేరుకుంటుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.  బయోటెక్ స్టార్టప్‌లు వ్యాక్సిన్ అభివృద్ధి  విస్తృత సహకారం భారతదేశం, యునైటెడ్ కింగ్‌డమ్ ల మధ్య మరింత సహకారం అవసరమన్నారు. 

డాక్టర్ జితేంద్ర సింగ్ నాయకత్వంలో ఆరు రోజుల పాటు  యునైటెడ్ కింగ్‌డమ్‌లో  శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ కు చెందిన  ఉన్నత-స్థాయి భారతీయ ప్రతినిధి బృందం పర్యటిస్తుంది. 

***



(Release ID: 1920991) Visitor Counter : 167