వ్యవసాయ మంత్రిత్వ శాఖ
"తేనెటీగల పెంపకం రంగంలో సాంకేతిక సహకారం, ఆవిష్కరణలు" అనే అంశంపై జాతీయ వర్క్‌షాప్
Posted On:
19 APR 2023 6:10PM by PIB Hyderabad
జాతీయ తేనెటీగల పెంపకం, తేనే మిషన్ (ఎన్.బి.హెచ్.ఎం) కింద బుద్నీ లోని కేంద్ర వ్యవసాయ యంత్రాల శిక్షణ, పరీక్షల సంస్థ (సి.ఎఫ్.ఎం.టి. & టి.ఐ) సహకారంతో కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఈ రోజు మధ్యప్రదేశ్ లోని బుద్నీలో "తేనెటీగల పెంపకంలో సాంకేతిక సహకారం, ఆవిష్కరణలు" అనే అంశంపై జాతీయ వర్క్‌షాప్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల తేనెటీగల పెంపకందారులు / వాటాదారులు, అంకుర సంస్థలు, పారిశ్రామికవేత్తలు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు, కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, తేనె శుద్ధి చేసేవారు దాదాపు 500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వీరితో పాటు, దేశంలోని ఇతర ప్రాంతాల నుండి సుమారు వంద మందికి పైగా ప్రతినిధులు దృశ్యమాధ్యమం ద్వారా ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు.
ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన, డి.ఏ.&ఎఫ్.డబ్ల్యూ, అదనపు కార్యదర్శి డాక్టర్ అభిలాక్ష్ లిఖి మాట్లాడుతూ, తేనెటీగల పెంపకంలో అధునాతన సాధనాలను ఉపయోగించడం ద్వారా తేనె రంగం విస్తరిస్తుందని పేర్కొన్నారు. తక్కువ పెట్టుబడితో గ్రామీణ, పట్టణ, వర్గాలకు జీవనోపాధిని సంపాదించడానికి ఇది వ్యవసాయంలో ఒక భాగంగా అభివృద్ధి చెందుతోంది. వ్యవసాయానికి అనుబంధ రంగంగా ఇది, స్థానిక, వ్యవసాయ వర్గాల ఆర్థిక వ్యవస్థతో పాటు, ఉపాధిని వేగవంతం చేస్తుంది. తేనెటీగల పెంపకం అనేది వ్యవసాయ అనుబంధ కళ, దీనికోసం సరైన నిర్వహణ, తేనె, తేనెటీగ ఉత్పత్తుల సేకరణ కోసం శాస్త్రీయ, ఆచరణాత్మక విధానాలు పాటించాలి. తేనెలో కల్తీని నివారించేందుకు 31 మినీ-టెస్టింగ్ ప్రయోగశాలలతో పాటు, నాణ్యమైన తేనె ఉత్పత్తి కోసం 4 ప్రాంతీయ ప్రయోగశాలలలను కూడా ఎన్.బి.హెచ్.ఎం. ఆమోదించి, ఏర్పాటు చేసింది. ఈ రంగాన్ని ప్రోత్సహించడానికి, తేనె మరియు అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి ఇది సహాయపడుతుంది. తేనెటీగల పెంపకం మరియు తేనె ఉత్పత్తి ద్వారా ఉత్పత్తిదారుల ఆదాయాన్ని, ఉపాధిని పెంచడం ద్వారా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో సహాయపడే తేనెలో జి.ఐ. ట్యాగింగ్ కోసం ఎన్.బి.హెచ్.ఎం. తీసుకున్న చర్యల గురించి కూడా ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. ఉత్పత్తుల నాణ్యత తేనె ఉత్పత్తిదారులకు జాతీయ, అంతర్జాతీయ అవకాశాలను కల్పిస్తుంది.
అంతకుముందు, ఈ జాతీయ సదస్సు నుద్దేశించి, బుద్ని లోని సి.ఎఫ్.ఎం.టి.&టి.ఐ. డైరెక్టర్, శ్రీ అనిల్ ఉపాధ్యాయ స్వాగతోపన్యాసం చేస్తూ, ఈ జాతీయ స్థాయి వర్క్‌షాప్ ను నిర్వహించడానికి అవకాశం కల్పించినందుకు ఎన్.బి.హెచ్.ఎం. తో పాటు, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. మధ్యప్రదేశ్ ప్రాంతంలోని రైతులు, తేనెటీగల పెంపకందారులు, అంకురసంస్థలు, ఎఫ్.పి.ఓ.ల గురించి ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో వ్యవసాయం సమృద్ధిగా ఉందనీ, అధిక సంఖ్యలో సమర్థులైన రైతులు ఉన్నారనీ, అదేవిధంగా తేనెటీగల పెంపకం అభివృద్ధి చెందడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయనీ, ఆయన వివరించారు. తేనెటీగల పెంపకం అనేది తక్కువ పెట్టుబడితో కూడిన, అత్యంత సమర్థవంతమైన వ్యాపార నమూనా అని, ఇది టెక్నాలజీ అప్లికేషన్ తో పాటు, సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విధంగా, రైతులతో పాటు, ఇతర ప్రజల జీవనోపాధిని పెంచడానికి తేనెటీగల పెంపకం సహాయపడుతుందని, ఆయన చెప్పారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల్లో భాగంగా, నాణ్యమైన తేనె, ఇతర అనుబంధ ఉత్పత్తులను పొందడానికి 'తేనెటీగల పెంపకాన్ని' ప్రోత్సహిస్తోందని ఆయన తెలియజేశారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఈ "స్వీట్ రెవల్యూషన్" అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమంగా కొనసాగుతోందని, ఆయన చెప్పారు.
దేశంలో ఎన్.బి.హెచ్.ఎం. క్రింద సాధించిన పాత్ర, విజయాల గురించి, ఎన్.బి.హెచ్.ఎం. కింద సహాయం పొందిన లబ్ధిదారుల విజయగాథలు, తేనెటీగల పెంపకందారులకు అందుబాటులో ఉన్న అవకాశాలు, ఎన్.బి.హెచ్.ఎం. క్రింద వ్యవసాయ అంకురసంస్థలు/భాగస్వాములు మొదలైన విషయాల గురించి, జాతీయ తేనెటీగల మండలి (ఎన్.బి.బి) అడిషనల్ కమిషనర్ (హార్టికల్చర్) మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.కె. పాట్లే వివరించారు.
వర్క్ షాప్ కు హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, తేనెటీగల పెంపకంలో సాంకేతిక పురోగతి ఎంతో అవసరమని, చెప్పారు. ముఖ్యంగా రైతులు, తేనెటీగల పెంపకందారులు, తేనె అంకురసంస్థలు, ఎఫ్.పి.ఓ. లకు సహాయం చేయడం ద్వారా తేనెటీగలను పెంచే పరిశ్రమ మొత్తం సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ఆయన తెలియజేశారు. దేశంలో ఉత్పత్తి అయ్యే తేనె నాణ్యతను నిర్ధారించడం కోసం 31 మినీ టెస్టింగ్ ల్యాబ్ లు, 4 ప్రాంతీయ ప్రయోగశాలలను ఎన్.బి.హెచ్.ఎం. ఆమోదించిందని ఆయన తెలిపారు. తేనెటీగల పెంపకందారులు, ఇతర భాగస్వాముల నమోదు ద్వారా దేశవ్యాప్తంగా తేనెటీగల పెంపకం డేటాను అందించడం కోసం, మధుక్రాంతి అనే పోర్టల్ ను కూడా ఎన్.బి.హెచ్.ఎం. అభివృద్ధి చేసింది.
తేనెటీగల పెంపకం / తేనె ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, ప్రారంభించడానికి వీలుగా ఎన్.బి.హెచ్.ఎం. వ్యవసాయ పారిశ్రామికవేత్తలు / అంకుర సంస్థలకు తగిన సహాయం అందిస్తోందని ఆయన తెలియజేశారు. ఈ కృషిని ఆత్మ నిర్భర్ కృషిగా మార్చడానికి ఎఫ్.పి.ఓ.ల ప్రోత్సాహం, ఏర్పాటు మొదటి అడుగు అని, దీని కోసం తేనెటీగల పెంపకం రంగాన్ని బలోపేతం చేయడానికి సాంకేతికతలు, ఆవిష్కరణలను ఉపయోగించడం ద్వారా ఎన్.బి.హెచ్.ఎం. పథకం అమలు విప్లవాత్మక మార్పులను తీసుకు వస్తుందని ఆయన హామీ ఇచ్చారు. దేశవిదేశాల్లో తేనెటీగల పెంపకంతో పాటు, తేనె ఉత్పత్తిని ప్రారంభించడానికి తేనెటీగల పెంపకందారులందరూ ఎన్.బి.హెచ్.ఎం. క్రింద సహాయం పొందేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులు, తేనెటీగల పెంపకందారుల / ఇతర భాగస్వాములు ఎన్.బి.హెచ్.ఎం. కింద అందుబాటులో ఉన్న సౌకర్యాలను పొందాలనీ, తేనె, ఇతర తేనెటీగల ఉత్పత్తుల ఉత్పత్తి, మార్కెటింగ్ ద్వారా ఆదాయాన్ని పెంచడంతో పాటు, రైతులు, తేనెటీగల పెంపకందారుల జీవితాలను మెరుగుపరచడానికి, శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకాన్ని అనుసరించాలని ఆయన కోరారు.
మేనేజ్ సంస్థ బిజినెస్ మేనేజర్ శ్రీ ఏ.యోవరాజు మాట్లాడుతూ, తేనెటీగల పెంపకం రంగంలో వ్యవసాయ అంకుర సంస్థల సామర్థ్యాన్ని గురించి వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలలో విజయవంతమైన వెంచర్లను రూపొందించడానికి ఇది పరిపూర్ణమైన పరిష్కారాలను సూచిస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. తేనెటీగల పెంపకం పై పూర్తి సమాచారం అందుబాటులోకి తేవాలని ఆయన ప్రతిపాదించారు. ఈ పథకానికి మరింత విస్తృత ప్రచారం కల్పించడానికి వివిధ ప్రాంతీయ భాషలలో ఈ సమాచారం తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని కూడా ఆయన సూచించారు. తేనెటీగల పెంపకం రంగంలో అంకురసంస్థలు, వ్యవస్థాపకుల కోసం మరిన్ని సామర్ధ్య నిర్మాణ కార్యక్రమాలు, పర్యావరణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఎన్.బి.హెచ్.ఎం. మద్దతు ద్వారా ముందుకు వచ్చిన అంకుర సంస్థల విజయ గాథలను కూడా ఆయన పంచుకున్నారు.
ఎన్.బి.హెచ్.ఎం. సహాయంతో అంకురసంస్థలు స్థాపించిన బుందేలి హనీ కి చెందిన శ్రీ మనోజ్ పటేల్, ట్రైబ్ గ్రోన్ కు చెందిన శ్రీ భవేష్ మాట్లాడుతూ, తేనెటీగల పెంపకం పరిశ్రమ ద్వారా తమ కొద్ది పాటి ఆదాయం ఏ విధంగా వృద్ధి చెందినదీ వివరించారు. ఈ రోజు ఒక ముఖ్యమైన సంస్థగా గుర్తింపు పొందినదని తెలియజేస్తూ, తమ విజయ గాథలను పంచుకున్నారు.
బాలాఘాట్‌కు చెందిన తేనెటీగల పెంపకందారు / రైతు శ్రీ సుమన్ సింగ్ మెరావి మాట్లాడుతూ, తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తిలో తన అద్భుతమైన ప్రయాణాన్ని పంచుకున్నారు. యువతరం ఈ వ్యాపకాన్ని తమ అభిరుచిగా స్వీకరించి, వ్యవసాయ వారసత్వాన్ని రక్షిస్తూ, క్రమంగా దీనిని ఒక సక్రమమైన ఆదాయ వనరుగా మార్చుకోవాలని ఆయన సూచించారు.
ముడి అడవి తేనె ను ఉత్పత్తి చేసి, దాని ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్న మధ్యప్రదేశ్ లోని నర్మదాపురం జిల్లా స్వయం సహాయక బృందానికి చెందిన శ్రీమతి కవితా రాజ్‌పుత్, మేకల్‌సుత పర్యావరణ పరిరక్షణలో తేనెటీగల పెంపకం ప్రాముఖ్యతను పంచుకున్నారు. పురుషులతో పాటు, స్త్రీలు కూడా తేనెటీగల పెంపకాన్ని తమ జీవనోపాధికి ఆధారంగా చేసుకోగలరని ఋజువు చేస్తూ, మహిళలకు ఉదాహరణగా నిలిచారు. తేనెటీగల పెంపకంలో అధునాతన సాధనాలను ఉపయోగించడం ద్వారా వ్యవసాయ / ఉద్యానవన పంటలలో దిగుబడిని పెంచడానికి సాంకేతిక సహకారం గురించి దామోహ్, కృషి విజ్ఞాన కేంద్రం, జె.ఎన్.కె.వి.వి., ఎం.పి. శాస్త్రవేత్త డా. మనోజ్ అహిర్వార్ వివరించారు. మెరుగైన తేనెటీగ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా, మనం తేనె ఉత్పత్తిపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపవచ్చు, ఉద్యానవన ఉత్పత్తిని పెంచవచ్చు. తేనెటీగల పెంపకందారులు సాంకేతికతను స్వీకరించడాన్ని, లేదా ఉపయోగించడాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే పెట్టుబడిపై రాబడి, అంటే ఉత్పాదకత పెరుగుతుంది. మెరుగైన తేనెటీగల సాంకేతికతను అమలు చేయడం వల్ల తేనెటీగల పెంపకం, ఉత్పాదకత పెరగడం నుండి ఆర్థిక వృద్ధి, పేదరిక నిర్మూలన వరకు అనేక సానుకూల ప్రభావాలు ఉంటాయి. తేనెటీగల రకాల్లో కావాల్సిన లక్షణాలను గుర్తించడం ద్వారా, అదేవిధంగా, తేనెటీగ జనాభా స్థిరమైన జన్యుపరమైన మెరుగుదల లక్ష్యంగా క్రమబద్ధమైన, ప్రణాళికాబద్ధమైన కార్యకలాపాలను అమలు చేయడం ద్వారా. తేనెటీగల పెంపకం రంగం అభివృద్ధితో పాటు, తేనెటీగల పెంపకందారుల అభివృద్ధిని కూడా సాధించవచ్చు.
తేనెటీగల పెంపకం పరిశ్రమకు రైతులు, తేనెటీగల పెంపకందారులు, విద్యార్థులలో తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తిని అంగీకరించి ప్రారంభించడంతోపాటు వారి ఆదాయాన్ని పెంచడానికి, ఎన్.బి.హెచ్.ఎం. పాత్ర మరియు మద్దతును కూడా ఆయన వివరించారు. మధ్యప్రదేశ్‌లో అనేక మంది రైతులు ఉత్సాహంగా ఉన్నందున రాష్ట్రంలో తేనె ఉత్పత్తికి అపారమైన అవకాశం ఉందనీ, గిరిజన జనాభా ఎక్కువగా ఉందనీ, ఇది తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తికి మరింత సామర్థ్యాన్ని సృష్టిస్తుందని, ఆయన మధ్యప్రదేశ్ రైతులను ప్రోత్సహించారు. వ్యవసాయంలో పుష్కలంగా ఉంది, స్థానిక జనాభా ఎక్కువగా ఉన్న మధ్యప్రదేశ్‌లోని గ్రామాలు, అనేక ఇతర జిల్లాల్లో తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహిస్తారు. తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తితో పాటు, పంటల రక్షణను పెంపొందించడంలో మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్ జిల్లాల్లోని స్థానిక జనాభాకు ఎన్.బి.హెచ్.ఎం. చేపట్టిన ఈ తాజా చర్య జీవనోపాధిని అందిస్తుంది.
తేనె ఉత్పత్తిని మెరుగుపరచడానికి, పెంపొందించడానికీ, నాణ్యమైన న్యూక్లియస్ స్టాక్ సెంటర్ ను అభివృద్ధి చేయడం ఒక తప్పనిసరి విధానమని, ఉత్తరాఖండ్, పంత్ నగర్ లోని జి.బి. పంత్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రమోద్ మాల్ పేర్కొన్నారు.
తేనెటీగల పెంపకంలో ముఖ్య భాగమైన తేనెటీగల వ్యాధులను తనిఖీ చేయడంలో సహాయపడే తేనెటీగల రోగ నిర్ధారణ కేంద్రాల ప్రాముఖ్యతను డాక్టర్ వై.ఎస్.పర్మార్ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు డాక్టర్ ఆర్.కె. ఠాకూర్ వివరించారు. తేనెటీగలను పెంచే స్థల పరిశీలకులు, తేనెటీగల పెంపకందారులు తప్పనిసరిగా తేనెటీగల వ్యాధులు, పరాన్నజీవులను గుర్తించడంతో పాటు, తీవ్రమైన వ్యాధులను తక్కువ ప్రాముఖ్యత కలిగిన వ్యాధుల నుండి వేరు చేయగలగాలి. తేనెటీగల పెంపకందారుల భద్రత కోసం నాణ్యమైన తేనెటీగలను రక్షించడం, పంపిణీ చేయడం, జబ్బులను నిర్ధారించడంతో పాటు, తేనె ఉత్పత్తిని రక్షించడానికి, మెరుగుపరచడానికి ఉపయోగించే ప్రయోగశాల పద్ధతులను ఉపయోగించి తేనెటీగలను ఆశించే పరాన్నజీవులు, తెగుళ్లు, ఇతర అసాధారణతలను గుర్తించడం వంటివి తేనెటీగ వ్యాధి, రోగ నిర్ధారణ కేంద్రాల లక్ష్యాలుగా నిర్ణయించడం జరిగింది.
ఎన్.డి.డి.బి. శాస్త్రవేత్త శ్రీ హృదయ్ దార్ జీ మాట్లాడుతూ, “తేనె పరీక్షలో ప్రాథమిక ప్రమాణాల కోసం తేనెను పరీక్షించే ప్రయోగశాలల గురించి వివరించారు. తేనెలో కల్తీని నివారించడం, తగినంత మార్కెట్ ను అందించడంతో పాటు తేనె విక్రయం, ఎగుమతిని పెంచడం ద్వారా మన తేనెటీగల పెంపకందారులను ప్రోత్సహించి, భారీ పరిమాణంలో మంచి నాణ్యమైన తేనెను ఉత్పత్తి చేయడానికి వీలుగా తాజా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు.
ఎన్.బి.హెచ్.ఎం. ముందుకు రావడానికి వీలుగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ఉద్యానవన శాఖ, జబల్పూర్ లోని జవహర్‌లాల్ నెహ్రూ కృషి విశ్వ విద్యాలయం, నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్.డి.డి.బి) గుజరాత్, నాఫెడ్, హైదరాబాద్ లోని మేనేజ్, గ్వాలియర్ లోని రాజమాత విజయరాజే సింధియా కృషి విశ్వవిద్యాలయం మొదలైన సంస్థలతో కలిసి పనిచేయడానికి, ముఖ్యంగా తేనెటీగల పెంపకం రంగంలో మధ్యప్రదేశ్ ప్రాంతం అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నందున రైతులకు, తేనెటీగల పెంపకందారులకు అవగాహన కల్పించడంతో పాటు, దేశంలో కూడా ఈ రంగాన్ని పెంపొందించడానికి అవసరమైన అన్ని సదుపాయాలు అందించడానికి సహాయపడే సమాచార జ్ఞానాన్ని పంచుకుని, చర్చించినందుకు ప్రతినిధులు, వాటాదారులందరికీ, సి.ఎఫ్.ఎం.టి & టి.ఐ. కి చెందిన శ్రీ రాజీవ్ పలివాల్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ జాతీయ వర్క్‌షాప్ కు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ లిఖి ఎన్.బి.హెచ్.ఎం. ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో - మధ్యప్రదేశ్, జబల్‌పూర్ లోని జవహర్‌లాల్ నెహ్రూ కృషి విశ్వ విద్యాలయానికి చెందిన కె.వి.కె.ల ఎఫ్.పి.ఓ.లు / తేనె అంకురసంస్థలు, తేనెటీగల పెంపకందారులు, గుజరాత్ లోని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్.డి.డి.బి), నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్), హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్), గ్వాలియర్ లోని రాజమాత విజయరాజే సింధియా కృషి విశ్వ విద్యాలయ కె.వి.కె. లు, చౌదరి చరణ్ సింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ (సి.సి.ఎస్-ఎన్.ఐ.ఏ.ఎం), జైపూర్ హనీ మొదలైన సంస్థలు పాల్గొని, తేనె, తేనెటీగల ఉత్పత్తులను ప్రదర్శించాయి. ఈ ఎగ్జిబిషన్ లో ఎన్.బి.హెచ్.ఎం. భాగస్వాములు ప్రదర్శించిన ఆధునిక యంత్రాలతో పాటు, తేనె ఉత్పత్తిలో సాంకేతికతలు, ఆవిష్కరణలను డా.లిఖి ప్రశంసించారు.
మధ్యప్రదేశ్, జబల్ పూర్ లోని జవహర్ లాల్ నెహ్రూ కృషి విశ్వ విద్యాలయం (జె.ఎన్.కె.వి.వి) ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం, మధ్యప్రదేశ్, నర్మదాపురం జిల్లాకు చెందిన మేకల్‌సుత స్వయం సహాయ బృందం ఉత్పత్తి చేసిన ముడి అడవి తేనె తో పాటు, మొరెన జిల్లా ఎఫ్.పి.ఓ. ఉత్పత్తి చేసిన చమత్స్య తేనె అనే రెండు రకాల ఉత్పత్తులను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించడం జరిగింది.
*****
(Release ID: 1918398)
Visitor Counter : 207