వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సీడ్ ట్రేసబులిటీ పోర్టల్, మొబైల్ యాప్ ను ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ తోమర్


వ్యవసాయ రంగంలో ఒక విప్లవం కానున్న సతి పోర్టల్ – శ్రీ తోమర్

Posted On: 19 APR 2023 4:10PM by PIB Hyderabad

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్రసింగ్  తోమర్  నేడు సతి (సీడ్  ట్రేసబులిటీ, అథెంటికేషన్, హోలిస్టిక్ ఇన్వెంటరీ) పోర్టల్  ను, మొబైల్  యాప్  ను ప్రారంభించారు. విత్తన లభ్యతకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించేందుకు విత్తనాలు ఎక్కడ అందుబాటులో ఉన్నది తెలియచేసి, వాటి నాణ్యతను ధ్రువీకరించడంతో పాటు ఎంత మొత్తంలో విత్తనం అందుబాటులో ఉంది అనే వివరాలందించే సెంట్రలైజ్డ్  ఆన్  లైన్  వ్యవస్థ ఇది. ఈ పోర్టల్   నాణ్యమైన విత్తనాల గుర్తింపు, సర్టిఫికేషన్ వంటి సవాళ్లను పరిష్కరిస్తుంది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఎన్ఐసి సహకారంతో ‘‘ఉత్తమ్  బీజ్ – సమృద్ధి కిసాన్’’ థీమ్  తో ఈ యాప్  ను తయారుచేసింది. వివిధ కార్యక్రమాలు, పథకాలు అమలుపరచడం ద్వారా  కేంద్రప్రభుత్వం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నదని, ఈ దిశగా సతి పోర్టల్ ఒక కీలకమైన అడుగు అని శ్రీ తోమర్  ఈ సందర్భంగా అన్నారు. గ్రామీణ స్థాయిలో దీన్ని ఉపయోగించడం ప్రారంభించినట్టయితే వ్యవసాయ రంగానికి సంబంధించి ఇది ఒక విప్లవాత్మకమైన అడుగు అని నిరూపణ అవుతుందని ఆయన చెప్పారు.

భారతదేశానికి వ్యవసాయం అత్యంత కీలకమని ముఖ్య అతిథి అయిన కేంద్ర మంత్రి శ్రీ తోమర్  అన్నారు. మారుతున్న పరిస్థితుల్లో వ్యవసాయ రంగం ప్రాధాన్యం మరింత పెరిగిందని చెప్పారు. గతంలో మనం కేవలం సొంత అవసరాలకే వ్యవసాయం చేసే వారమని, కాని ఇప్పుడు భారతదేశంపై ప్రపంచం అంచనాలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. వ్యవసాయ రంగానికి, వాతావరణ మార్పులకు సంబంధించిన అన్ని సవాళ్లను పరిష్కరిస్తూనే ప్రపంచానికి ఆహారం అందించాల్సిన బాధ్యత మనపై పెరిగిందని చెప్పారు. వ్యవసాయంలో విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు, ఇరిగేషన్  కీలక పాత్ర పోషిస్తాయని శ్రీ తోమర్  అన్నారు. నాణ్యత లేని నాసిరకం, కల్తీ విత్తనాలు వ్యవసాయ రంగం వృద్ధిని దెబ్బ తీస్తాయని, అవి దేశంలో వ్యవసాయ ఉత్పాదకతను ప్రభావితం చేసి వ్యవసాయదారులకు నష్టం  మిగులుస్తాయని ఆయన చెప్పారు. మార్కెట్లో నాసిరకం, కల్తీ విత్తనాలు లేకుండా చేసి నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించడానికి మనం ఒక వ్యవస్థను సిద్ధం చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు.  ఆ దిశగా చేసిన ప్రయత్నమే నేడు విడుదల చేసిన సతి పోర్టల్ అని ఆయన వివరించారు. వాతావరణ మార్పుల యుగంలో కొత్త రకం కీటకాలు పంటలను ఆశ్రయిస్తున్నాయని, వాటిని నిర్మూలించడంపై వ్యవసాయ శాస్ర్తవేత్తలు తమ పరిశోధనను కేంద్రీకరించాలని ఆయన సూచించారు. ఈ నష్టాన్ని మనం నివారించినట్టయితే మొత్తం వ్యవసాయ దిగుబడుల్లో 20 శాతం దిగుబడిని మనం రక్షించవచ్చునని ఆయన చెప్పారు.

సతి (సీడ్  ట్రేసబులిటీ, అథెంటికేషన్, హోలిస్టిక్) పోర్టల్  తొలి దశను ఇప్పుడు ప్రారంభించామని కేంద్ర మంత్రి శ్రీ తోమర్ అన్నారు. రెండో దశ పోర్టల్  తయారుచేయడం మరీ జాప్యం కాకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే ఈ పోర్టల్  పై రైతుల్లో సంపూర్ణ అవగాహన పెంచేందుకు కృషి  చేయాలని, ఫలితంగా రైతులు దాని నుంచి పూర్తి ప్రయోజనం పొందగలుగుతారని ఆయన అన్నారు.  ఈ పోర్టల్  లేదా యాప్  లో ఒక క్యుఆర్  కోడ్  ఉంటుందని, దాన్ని స్కాన్   చేయడం ద్వారా విత్తనం ఎక్కడ ఉన్నది తెలుసుకోవచ్చునని ఆయన తెలిపారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసిఏఆర్), రాష్ర్ట ప్రభుత్వాలు కృషి విజ్ఞాన్  కేంద్రాలు దీని వినియోగం విషయంలో శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. సీడ్  ట్రేసబులిటీ వ్యవస్థలో చేరాలని రాష్ర్టప్రభుత్వాలను ఆయన కోరారు.

సతి పోర్టల్  ఒక నాణ్యత హామీ వ్యవస్థగా పని చేస్తుంది. విత్తన ఉత్పత్తి వ్యవస్థ మొత్తం మీద నాణ్యమైన విత్తనం ఎక్కడ అందుబాటులో ఉన్నది యూజర్లకు తెలియచేస్తుంది. సీడ్  చెయిన్-పరిశోధన సంఘం,  సీడ్  సర్టిఫికేషన్, సీడ్  లైసెన్సింగ్,  సీడ్  కేటలాగ్, డీలర్  స్థాయి నుంచి రైతు స్థాయికి అమ్మకాలు, రైతు రిజిస్ర్టేషన్, సీడ్  డిబిటి పేరిట 7 వర్టికల్స్  (విభాగాలు) ఇందులో ఉన్నాయి. ఈ పోర్టల్  లో రిజిస్టర్  అయిన వ్యవసాయదారులకు మాత్రమే చెల్లుబాటు లైసెన్స్  గల డీలర్లు  చెల్లుబాటు సర్టిఫికేషన్  తో కూడిన విత్తనాలు విక్రయించాల్సి ఉంటుంది. ఇందులో రిజిస్టర్  అయిన వ్యవసాయదారులందరికీ సబ్సిడీ లభిస్తుంది. దాన్ని డిబిటి విధానంలో వారి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తారు.  

వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ అహూజా, జాయింట్  సెక్రటరీ  (సీడ్) శ్రీ పంకజ్  యాదవ్, ఇతర అధికారులు;  రాష్ర్టప్రభుత్వాలు, ఐసిఏఆర్  కీలక అధికారులు వీడియో కాన్ఫరెన్సింగ్  ద్వారా  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

***


(Release ID: 1918393) Visitor Counter : 214