శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌పై భారత్‌ విజయాన్ని సంక్షోభ నిర్వహణకు ఒక నమూనాగా ప్రపంచ దేశాలు కీర్తించాయన్న కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్

Posted On: 12 APR 2023 5:39PM by PIB Hyderabad

కొవిడ్‌పై భారతదేశం సాధించిన విజయాన్ని సంక్షోభ నిర్వహణకు ఒక నమూనాగా ప్రపంచ దేశాలు కీర్తించాయని కేంద్ర శాస్త్ర, సాంకేతికత శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) డా.జితేంద్ర సింగ్ చెప్పారు.

దిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో (జేఎన్‌యూ) “డిజాస్టర్‌ రెసిలియెంట్‌ మెథడాలజీస్‌ ఆన్‌ పాండమిక్‌” అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో మంత్రి ప్రారంభోపన్యాసం చేశారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో భారతదేశంలో కొవిడ్ నిర్వహణ విజయవంతంగా సాగిందని డా.జితేంద్ర సింగ్ అన్నారు. కొవిడ్ మహమ్మారి ప్రబలినప్పుడు, భారతదేశం అతి పెద్ద కొవిడ్ కేంద్రంగా ప్రపంచం భావించిందని, అప్పుడు రెండేళ్ల పాటు మనం బలంగా నిలబడ్డామని, 2 టీకాలను కనిపెట్టామని చెప్పారు. ఆ టీకాలను ప్రపంచవ్యాప్తంగా 50కు పైగా దేశాలకు అందించామని అన్నారు.

ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే, కొవిడ్‌పై భారతదేశం అనుసరించిన వ్యూహం చాలా ప్రభావవంతంగా పని చేసిందని డా.జితేంద్ర సింగ్ చెప్పారు. ఈ మహమ్మారి కారణంగా మన వ్యవస్థలోని లొసుగులు, బలాలను తెలుసుకున్నామన్నారు. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి, కొవిడ్ నిర్వహణను ప్రధాని మోదీ రోజుకు రెండుసార్లు వ్యక్తిగతంగా పర్యవేక్షించారని చెప్పారు.

భారతదేశానికి లోతైన మరియు బలమైన స్వాభావిక సామర్థ్యం ఉందని మంత్రి అన్నారు. కొవిడ్‌కు ముందు, దేశం నివారణ ఆరోగ్య సంరక్షణకు ప్రసిద్ధి చెందలేదు. కానీ ప్రతికూలతను ఒక ధర్మంగా మార్చడం, భారతదేశం ప్రివెంటివ్ హెల్త్‌కేర్‌లో రోల్ మోడల్‌గా ఉద్భవించింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యుత్తమ విజయగాథల్లో ఇదీ ఒకటి. ఇది ప్రపంచ వేదికపై మన గౌరవాన్ని పెంచిందని ఆయన అన్నారు.


 

సవాలు ఎదురైనప్పుడల్లా మన దేశం మరింత బలంగా తయారైందని, ఇలాంటి విపత్తులను తట్టుకునేలా మే 2014 నుంచి మన ప్రధాని దేశాన్ని సిద్ధం చేస్తున్నారని కేంద్ర మంత్రి వెల్లడించారు. 2015 నేపాల్ భూకంపం, సార్క్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన సమయంలో భారతదేశం అందించిన సహాయాన్ని గుర్తు చేస్తూ, మనం మన సమాజానికి మాత్రమే కాకుండా మన పొరుగు దేశాలకు కూడా సేవ చేస్తున్నామని, ఈ సేవాభావం భారతీయ తత్వంలో లోతుగా పాతుకుపోయిందని అన్నారు.

మొదటి లాక్‌డౌన్ సమయంలో, విధ్వంసకర పరిస్థితిని పరిష్కరించడానికి ఎన్‌జీవోలు, ప్రభుత్వం, కార్పొరేట్‌ సంస్థలు కలిసి పని చేశాయని మంత్రి వెల్లడించారు. కొవిడ్‌ సమయంలో చేసిన పనులను కేస్ స్టడీస్ రూపంలో పుణెలోని స్పార్క్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ జనకళ్యాణ్ వెలుగులోకి తెచ్చాయని చెప్పారు. ఈ పుస్తకంలోని కేస్ స్టడీస్ ద్వారా పొందే ఆచరణాత్మక జ్ఞానం అన్ని విపత్తు నిర్వహణ కేంద్రాలు/సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో రిఫరెన్స్‌గా ఉపయోగపడుతుందని డా.జితేంద్ర సింగ్‌ అన్నారు.

కష్టాలను ఎలా ఎదుర్కోవాలో కొవిడ్ మనకు నేర్పించడమే కాకుండా, యువతలో జీవ సాంకేతికత పట్ల ఆసక్తిని పెంచిందని మంత్రి చెప్పారు. 2014కి ముందు బయోటెక్ అంకురాలు 50 మాత్రమే ఉండేవని, ఇప్పుడు దాదాపు 6,000 ఉన్నాయని వివరించారు. ప్రధాని మోదీ హయాంలో, భారతదేశ జీవ-ఆర్థిక వ్యవస్థ 2014లోని 10 బిలియన్ డాలర్ల నుంచి 2022 నాటికి 80 బిలియన్ డాలర్లకు చేరిందని, గత 8 ఏళ్లలోనే 8 రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి వెల్లడించారు.

భారతదేశం స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలను జరుపుకునే 2047 సమయంలో, ఇప్పటి యువత "భారతదేశం @2047"కి రూపుదిద్దుతారు. ఎందుకంటే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఊహించిన విధంగా 'నవ భారత్‌' నిర్మాణంలో పాల్గొనే  ప్రత్యేక అవకాశం వారికి ఉందని డా.జితేంద్ర సింగ్‌ చెప్పారు.

*****


(Release ID: 1916059) Visitor Counter : 198


Read this release in: English , Urdu , Hindi , Punjabi