గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ


హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్ చేస్తున్న వినూత్నప్రయత్నాలను మన్‌ కీ బాత్‌లో ప్రశంసించిన ప్రధాని మోదీ

Posted On: 09 APR 2023 1:52PM by PIB Hyderabad

 

 

బోయిన్‌పల్లి వెజిటబుల్ మార్కెట్ అమలు చేస్తున్న వినూత్న వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిని ఆకర్షించింది.ప్రధాని మోదీ  మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో బయోఎలక్ట్రిసిటీ, జీవ ఇంధనం మరియు బయో-ఎరువు ఉత్పత్తి ప్రాజెక్ట్‌ను ప్రశంసించారు. మార్కెట్‌లోని వ్యర్థాలు ఇప్పుడు సంపదగా మారుతున్నాయని పేర్కొన్న ప్రధాని “సబ్జీ మండీలలో కూరగాయలు అనేక కారణాల వల్ల కుళ్ళిపోయి, అపరిశుభ్రమైన పరిస్థితులను వ్యాప్తి చేయడం మనం గమనించాము. అయితే హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి కూరగాయల వ్యాపారులు వ్యర్థ కూరగాయలతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది ఆవిష్కరణ యొక్క శక్తి” అని తెలిపారు.

కొన్నేళ్ల క్రితం కూరగాయల వ్యర్థాల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేయడం చాలా విచిత్రమైన ఆలోచన, కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌ దీన్ని ఆచరణలో చూపుతోంది. మార్కెట్‌లో ప్రతిరోజూ దాదాపు 10 టన్నుల వ్యర్థాలు సేకరించబడతాయి. ఇది ఇంతకుముందు  వ్యర్ధ పదార్ధంగా మిగిలేది. కానీ ఇప్పుడు అది కూరగాయల మార్కెట్‌కు ప్రధాన విద్యుత్ వనరుగా మారింది.

బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌ కార్యదర్శి శ్రీనివాస్‌ మాట్లాడుతూ " ఈ మార్కెట్‌ నుంచి సేకరించే  కూరగాయలు, పండ్ల వ్యర్థాలతో  దాదాపు 500 యూనిట్ల విద్యుత్‌, 30 కిలోల జీవ ఇంధనం ఉత్పత్తి అవుతుందన్నారు. ఉత్పత్తి చేయబడిన విద్యుత్తు ఇక్కడి వీధిలైట్లు, 170 స్టాల్స్, పరిపాలన భవనం మరియు నీటి సరఫరా నెట్‌వర్క్‌కు విద్యుత్తును అందిస్తుంది.అలాగే ఉత్పత్తి చేయబడిన జీవ ఇంధనం మార్కెట్  వాణిజ్య వంటగదికి పంప్ చేయబడుతుంది.బయోగ్యాస్ ప్లాంట్‌ను ఇప్పుడు "స్థిరమైన భవిష్యత్తుకు మార్గం" అని పిలుస్తారు. మార్కెట్‌లో ఏర్పాటు చేసిన క్యాంటీన్ కూడా ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేయబడ్డ విద్యుత్ ద్వారా నడుస్తోంది.మార్కెట్ యార్డుకు అవసరమైన 650-700 యూనిట్ల విద్యుత్తుకు 7-8 టన్నుల కూరగాయలు అవసరం. సగటున 400 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి వ్యర్థాలు ఉత్పన్నమవుతాయి. ఫలితంగా మార్కెట్‌ కూడా శుభ్రంగా మరియు కాలుష్య రహితంగా ఉంటోంది. వివిధ అంతర్జాతీయ ప్రతినిధులు కూడా ప్లాంట్‌ను సందర్శించి మా ప్రయత్నాలను అభినందించారు." అని తెలిపారు.

బోయిన్‌పల్లిలోని వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్‌లో వ్యర్థాలను క్రమబద్ధీకరించడం మరియు వేరు చేయడం,యంత్రాలను ఆపరేట్ చేయడం మరియు పరిపాలనా పనులను నిర్వహించడం వంటి పనుల్లో అవకాశాలను కల్పించడం ద్వారా  మహిళలకు ఉపాధిని కల్పిస్తుంది.ఈ ప్లాంట్ మహిళా కార్మికులకు స్థిరమైన ఆదాయాన్ని అందించడంతో పాటు నైపుణ్యాభివృద్ధికి అవకాశం కల్పిస్తుంది.

బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని రుక్మిణి దేవమ్మ మాట్లాడుతూ "బయోగ్యాస్ ప్లాంట్‌లో మా పనికి మంచి జీతం ఇస్తున్నారు. అలాగే అవసరమైన మాస్క్‌లు, గమ్ బూట్‌లు, గ్లోవ్‌లు వంటి  భద్రతా సామగ్రిని కూడా మాకు అందించారు. అటువంటి సురక్షితమైన వాతావరణాన్ని పొందిన తర్వాత మాతో  పని చేయడానికి మేము ఇతరులను ప్రోత్సహిస్తున్నాము." అని తెలిపారు.

బోయిన్‌పల్లి మార్కెట్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..రోజుకు సగటున 10 టన్నుల వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఈ వ్యర్థాలు సంవత్సరానికి సుమారుగా 6,290 కిలోల సీఓ2ని ఉత్పత్తి చేయగలవు. ఇది పర్యావరణానికి మరింత హాని కలిగించవచ్చు. ఈ సమస్యను పరిష్కరించేందుకు బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్ అధికారులు ఈ వ్యర్థాలను ఇంధనంగా మార్చాలని నిర్ణయించారు.

బోయిన్‌పల్లి బయోగ్యాస్ ప్లాంట్



బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌తో పాటు సమీపంలోని యార్డుల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను (కుళ్లిన మరియు అమ్ముడుపోని కూరగాయలు) నగరం నలుమూలల నుండి సేకరిస్తారు. ఆ కూరగాయలు చిన్న ముక్కలుగా తరిగి కన్వేయర్ బెల్ట్ మీదుగా ష్రెడర్‌కు పంపబడతాయి. వ్యర్థాలు ముక్కలు చేసే ప్రక్రియకు లోనవుతాయి. ఇక్కడ అన్ని కూరగాయలను చిన్న మరియు ఏకరీతి పరిమాణంలో పొడి చేసి గ్రైండర్‌కు పంపుతారు. ఈ గ్రైండర్ ఆ వ్యర్ధాలను మరింత పల్ప్‌గా చూర్ణం చేస్తుంది. దీనిని స్లర్రీ అని కూడా పిలుస్తారు. వాటిని వాయురహిత డైజెస్టర్‌లకు పంపుతుంది.

 



ఇక్కడ ఉత్పత్తి చేయబడిన గ్యాస్ ఉపయోగించే వరకు బెలూన్లలో నిల్వ చేయబడుతుంది. జీవ ఎరువును గ్యాస్ కాకుండా ఉప ఉత్పత్తిగా పొందవచ్చు.ప్రత్యేక ట్యాంక్‌లో బయోగ్యాస్ సేకరించబడుతుంది మరియు పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా వంట కోసం పంపబడుతుంది. జీవ ఇంధనం 100% బయోగ్యాస్ జనరేటర్‌లోకి సరఫరా చేయబడుతుంది. ఇది కోల్డ్ స్టోరేజీ గదులు, నీటి పంపులు, దుకాణం, వీధి దీపాలు మొదలైన వాటి కరెంటు అవసరాల కోసం ఉపయోగించబడుతుంది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్, గీతనాథ్ (2021) నిధులతో  ఈ బయోగ్యాస్ ప్లాంట్‌ను సిఎస్‌ఐఆర్-ఐఐసిటి (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మార్గదర్శకత్వం మరియు పేటెంట్ టెక్నాలజీ కింద ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియను హైదరాబాద్‌కు చెందిన అహుజా ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పర్యవేక్షించింది.


ప్రభావం
రోజుకు దాదాపు 30 కిలోల జీవ ఇంధనం ఉత్పత్తి యూనిట్ సమీపంలోని వంటగదికి సరఫరా చేయబడుతుంది. మార్కెట్‌లోని అడ్మినిస్ట్రేటివ్ భవనం, మార్కెట్ నీటి సరఫరా నెట్‌వర్క్, సుమారు 100 వీధిలైట్లు మరియు మార్కెట్‌లోని 170 స్టాల్స్‌కు 400- 500 యూనిట్ల విద్యుత్ శక్తిని వినియోగిస్తున్నారు.

 

 

 

ఈ బయోగ్యాస్ యూనిట్ విద్యుత్ బిల్లును సగానికి తగ్గించడంలో సహాయపడుతుంది (గతంలో సగటున నెలకు రూ. 3 లక్షలు). లిక్విడ్ బయో ఎరువును రైతుల పొలాల్లో ఎరువుగా వాడుతున్నారు. దీని సామర్థ్యాన్ని తెలుసుకున్న బయోటెక్నాలజీ విభాగం వివిధ మార్కెట్ యార్డులలో (గుడిమల్కాపూర్, గడ్డిఅన్నారం -5 టన్నులు/రోజు, ఎర్రగడ్డ, అల్వాల్, సరూర్‌నగర్- 500 కిలోలు/రోజు) ఇలాంటి మరో ఐదు ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి మరిన్ని నిధులు ప్రకటించింది.

బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌లో వ్యర్థాలను శక్తిగా మార్చే ఈ వినూత్న ప్రక్రియ జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి స్థిరమైన వ్యవస్థను ఉపయోగించడం గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించింది. అలాగే పట్టణ ప్రకృతి దృశ్యాన్ని మార్చడానికి ఇలాంటి ప్రాజెక్టులను చేపట్టడానికి మరిన్ని నగరాలను ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుంది.


 

*****



(Release ID: 1915113) Visitor Counter : 225


Read this release in: English , Urdu , Hindi , Tamil