రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భోపాల్‌లో సంయుక్త కమాండర్ల సదస్సు సందర్భంగా సాయుధ బలగాల కార్యాచరణ సంసిద్ధతపై ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సమీక్ష

Posted On: 01 APR 2023 6:28PM by PIB Hyderabad

   భోపాల్‌లో 2023 ఏప్రిల్ 01న సంయుక్త కమాండర్ల సదస్సు-2023 ముగింపు కార్యక్రమం సందర్భంగా భద్రత పరిస్థితులతోపాటు సాయుధ దళాల కార్యాచరణ సన్నద్ధతను  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమీక్షించారు. ఈ సమీక్షలో భాగంగా ఈ ఏడాది సదస్సు కార్యకలాపాల్లో భాగంగా సాగిన చర్చల వివరాలను ప్రధానమంత్రికి సంయుక్త సాయుధ బలగాల అధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ అనిల్ చౌహాన్ నివేదించారు. దేశ ప్రగతి, మిత్ర దేశాలకు మానవతా సహాయం-విపత్తు చేయూత (హెచ్‌ఎడిఆర్‌) అందించడంలో సాయుధ దళాలు పోషించిన కీలక పాత్రను శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

   నేటి ఆధునిక, అనూహ్య ముప్పు పరిస్థితులను ఎదుర్కొనేందుకు త్రివిధ దళాలు సదా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ దిశగా సాయుధ దళాలను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానాలను సమకూర్చేందుకు చర్యలు చేపట్టామని ఆయన వివరించారు.

   చివరి రోజు కార్యక్రమాల్లో డిజిటలీకరణ, సైబర్ భద్రత; సామాజిక మాధ్యమ సవాళ్లు, స్వావలంబనసహా అగ్నివీరుల ఏకీకరణ, సమష్టి స్ఫూర్తి వగైరా అంశాలపై చర్చించారు. మునుపటి ముఖ్యమైన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది సదస్సు చర్చల పరిధిని విస్తరించారు. ఈ మేరకు అండమాన్‌-నికోబార్‌ త్రివిధ దళాల కమాండ్‌సహా భారత సైన్యం, నావికాదళం, వాయుసేనలలోని ప్రతి కమాండ్ నుంచి సైనికుల భాగస్వామ్యంతో కొన్ని బహుళ-అంచెల, పరస్పర సంప్రదింపుల చర్చాగోష్ఠులు నిర్వహించారు. దేశంలోని సైనిక దళాల అత్యున్నత సంయుక్త నాయకత్వం పాల్గొన్న ఈ మూడు రోజుల సదస్సు 2023 మార్చి 30న ప్రారంభమైంది. “సంసిద్ధ-సముద్ధరిత-సముచిత” సాయుధ బలగాలు ఇతివృత్తంగా సాగిన ఈ సమావేశంలో జాతీయ భద్రత, భవిష్యత్తు కోసం సంయుక్త సైనిక బలగాల దృక్పథం రూపకల్పనసహా వివిధ రకాల అంశాలపై వారు చర్చించారు.

   క్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌  2023 మార్చి 31న సాయుధ బలగాల రక్షణ సంసిద్ధతను అగ్రశ్రేణి కమాండర్లతో సంభాషణలో సందర్భంగా సమీక్షించారు. జాతీయ ప్రయోజనాల పరిరక్షణ, ‘స్వయం సమృద్ధ భారతం’ దార్శనికత సాకారం దిశగా ప్రభుత్వానికి మద్దతునివ్వడంలో సాయుధ బలగాలు ఎనలేని సహకారం అందిస్తున్నాయని ఆయన ప్రశంసించారు. కాగా, వివిధ కారణాల రీత్యా ఈ ఏడాది సదస్సుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ మేరకు ‘టిటిపి’లో మార్పుచేర్పులతోపాటు త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం దిశగా అనుసరణీయ మార్గాలవంటి సమకాలీన సమస్యలపై క్షేత్రస్థాయి యూనిట్ల నుంచి సూచనలు, సలహాలను ఆహ్వానించారు. తదనుగుణంగా అందిన అభిప్రాయాలపై సైనిక కమాండర్లు  లోతుగా చర్చించారు. సాయుధ దళాల ఆధునికీకరణతోపాటు ప్రస్తుత-మునుపటి సైనిక కార్యకలాపాలపై సమీక్షకు ఈ సమావేశం అవకాశం కల్పించింది. అలాగే దేశ రక్షణ సామర్థ్యాల మెరుగుకు అనువైన మార్గాలపైనా చర్చకు వేదికగా నిలిచింది.(Release ID: 1913084) Visitor Counter : 156


Read this release in: English , Urdu , Hindi , Manipuri