సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

భారత్ అధ్యక్షతన సాగుతున్న జి-20 సదస్సులలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో యువజన సదస్సుకు హాజరైన డాక్టర్ జితేంద్ర సింగ్


2022 డిసెంబర్ 22 న ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో భారత్ జి-20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టటం ఈ దేశ యువతకు ఒక అద్భుత క్షణం: డాక్టర్ జితేంద్ర సింగ్

భారతదేశం 2047 లో స్వాతంత్ర్య శతవార్షికోత్సవం జరుపుకునే సందర్భాన్ని నిర్వచించేది ఈనాటి యువతే: డాక్టర్ జితేంద్ర సింగ్

భారతదేశ యువతకు అత్యుత్తమ ఆదర్శ ప్రాయుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ: డాక్టర్ జితేంద్ర సింగ్


ప్రధాని నరేంద్ర మోదీ ఆశించిన నవ భారత నిర్మాణంలో పాల్గొనే అవకాశం దక్కటం నేటి భారత యువతకు గౌరవం: డాక్టర్ జితేంద్ర సింగ్


యువత నైపుణ్యాభివృద్ధికి వందలాది అవకాశాలు సృష్టించబడ్డాయి, యువత ఈ అవకాశాలను వాడుకుంటూ ‘విశ్వగురువు’ దిశగా సాగుతున్న భారత యాత్రలో చురుకైన భాగస్వాములు కావాలి: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 30 MAR 2023 5:59PM by PIB Hyderabad

భారతదేశం 2047 లో స్వాతంత్ర్య శతవార్షికోత్సవం జరుపుకునే సందర్భాన్ని నిర్వచించేది ఈనాటి యువతేనని, ప్రధాని నరేంద్ర మోదీ ఆశించిన నవ భారత నిర్మాణంలో పాల్గొనే అవకాశం  దక్కటం నేటి భారత యువతకు గౌరవమని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర ప్రతిపత్తి), ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి ( స్వతంత్ర ప్రతిపత్తి), ప్రధాని కార్యాలయం సహాయ మంత్రి, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.  

‘భారత జి-20 అధ్యక్షతన యువత పాత్ర’ మీద  కతువా లో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో  ఏర్పాటైన యువజన సదస్సునుద్దేశించి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జి-20 బాధ్యతలు చేపట్టిన తరుణంలో భాగస్వాములు కావటం యువత తమ అదృష్టంగా భావించాలని ఆయన అభివర్ణించారు. సుసంపన్నమైన భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటి చెప్పటంలో యువత కీలకపాత్ర పోషించే అవకాశం దక్కిందని, అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారం కనుక్కునే దిశలో యువత కృషి చేయాలని అన్నారు.  

 

ప్రపంచాన్ని ముందుకు నడిపించగల శక్తి సామర్థ్యాలు ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని భారతదేశానికి ఉన్నాయని గ్రహించటం వల్లనే ప్రపంచం ఈ రోజు భారత్ తలుపు తడుతున్నదని, భారత్ ను ప్రపంచ నాయకురాలిగా చూస్తున్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ అభివర్ణించారు.  

ప్రభుత్వం ఈ దేశ యువతకు అంకితమైందని చెబుతూ, యువత సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. గెజిటెడ్ అధికారులు ధృవీకరించాల్సిన అవసరం లేకుండా చేయటం, నాన్- గెజిటెడ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అవసరం లేకుండా చేయటం లాంటి నిర్ణయాలు తీసుకోవటానికి కారణం భారత యువత మీద ఉన్న బలమైన నమ్మకమేనన్నారు.  

స్టార్ట్ అప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా నిజానికి యువతకు అంకితం చేసినవేనని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేశారు. 2014 లో కేవలం 350 అంకుర సంస్థలు ఉండగా ఇప్పుడు 90 వేలకు పైబడటం, అందులో 100 కు పైగా యూనికార్న్ సంస్థలు  కావటం అందుకు నిదర్శనమన్నారు.  జమ్ము కాశ్మీర్ లోని దోడా జిల్లాలో ఆరోమా మిషన్ కింద ఏర్పాటైన అనేక అంకుర సంస్థలు ఉద్యోగాలు వదిలేసిన యువత భవిష్యత్తును తీర్చిదిద్ది  ఇప్పుడు వాళ్ళు లక్షల్లో సంపాదించుకునేట్టు చేశాయి.  

 

ప్రధాని నరేంద్ర మోదీ ఆశించిన నవ భారత నిర్మాణంలో పాల్గొనే అవకాశం  దక్కటం నేటి భారత యువతకు గర్వకారణమని, యువత అవకాశాలను వాడుకుంటూ ‘విశ్వగురువు’ దిశగా సాగుతున్న భారత యాత్రలో చురుకైన భాగస్వాములు కావాల్సిన సమయం వచ్చిందని  డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ దేశ యువతకు నైపుణ్యాభివృద్ధికి వందలాది అవకాశాలు సృష్టించబడ్డాయని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భారతదేశాన్ని విసవగురువుగా నిలపాలని కోరారు.

 

20 వ శతాబ్దపు భారతదేశ యువతకు శ్యాం ప్రసాద్ ఆదర్శప్రాయుడని చెబుతూ, 34 ఏళ్ల వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్  కావటాన్ని గుర్తు  చేశారు. జాతీయ సమైక్యత కోసం జీవితాన్ని త్యాగం చేసిన శ్యామ ప్రసాద్ ముఖర్జీని స్మరించుకుంటూ ఈ సదస్సును కతువాలో నిర్వహిస్తున్నట్టు కూడా మంత్రి చెప్పారు. ఆయన వారసత్వాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఈ దేశ యువత మీద ఉందన్నారు.

ఈ యువజన సదస్సులో పాల్గొన్నవారిలో కతువా డిప్యూటీ కమిషనర్ రాహుల్ పాండే, కతువా డీడీసీ వైస్ చేర్ పర్సన్ రఘునందన సింగ్ బబ్లూ, కతువా నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ సోమ దత్ జర్ద్ తో బాటు కతువా లోని వివివధ సంస్థల విద్యార్థులు, కతువా జిల్లాలోని వివిధ ప్రాంతాల యువత ఉన్నారు.   

 

*****



(Release ID: 1912382) Visitor Counter : 118