గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

‘స్వచ్ఛోత్సవ్‌-2023’: అంతర్జాతీయ వ్యర్థరహిత దినోత్సవం

భారతదేశంలో పరివర్తనకు స్వచ్ఛతే పునాది;

జన భాగస్వామ్యం నుంచి ప్రజా ఉద్యమం దాకా.. ‘ఎస్‌బిఎం-యు’;

‘వ్యర్థరహిత ఉద్యమం: మహిళల నేతృత్వంలో స్వచ్ఛతవైపు యాత్ర;

వాతావరణ మార్పు లక్ష్యాల సాధనలో వ్యర్థాల నిర్వహణ కీలకం;

‘ఎస్‌బిఎం-యు 2.0’ కింద ‘ఓడీఎఫ్‌’ నుంచి వ్యర్థరహిత నగరాలవైపు పయనం

Posted On: 29 MAR 2023 3:50PM by PIB Hyderabad

   గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన 2014 నుంచి పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణలో భారతదేశం పరివర్తనాత్మకంగా ముందంజ వేసిందని కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హర్‌దీప్‌ ఎస్‌.పూరి అన్నారు. ఆ మేరకు ప్రతి ప్రభుత్వ పథకానికీ స్వచ్ఛత మూలస్తంభంగానే కాకుండా పౌరుల జీవనశైలిలో భాగమైందని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ (ఎస్‌బిఎం-యు) అనేది జన భాగస్వామ్య సూత్రాన్ని అనుసరించే తొలి బృహత్‌ కార్యక్రమం. ప్రజా నాయకత్వం, యాజమాన్యం ఫలితంగా   ప్రభుత్వ కార్యక్రమమైన ‘ఎస్‌బిఎం-యు’ ప్రజా ఉద్యమంగా మారింది. మహిళల నేతృత్వాన ప్రజా ఉద్యమం కింద చేపట్టిన ‘వ్యర్థరహిత నగరాల కోసం ర్యాలీ’లో భాగంగా లక్షలాది పౌరులు తమతమ వీధులు, పరిసరాలు, పార్కులను శుభ్రపరిచే బాధ్యతను స్వీకరించడాన్ని మంత్రి కొనియాడారు.

   సందర్భంగా క్షేత్రస్థాయిలో కొన్ని అద్భుత విజయాలను వివరించే ‘స్టోరీస్ ఆఫ్ ఛేంజ్’ సంగ్రహాన్ని శ్రీ పూరి ఆవిష్కరించారు. మహిళా స్వయం సహాయ సంఘాలకు చెందిన 300 మందికిపైగా సభ్యులు వివిధ నగరాల్లో పర్యటించి వ్యర్థాల నిర్వహణ పద్ధతులను అధ్యయనం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ విధంగా మార్పువైపు పయనానికి నాంది పలికిన ‘స్వచ్ఛత దూతల’ను మంత్రి అభినందించారు. వీరిలో చాలామంది తొలిసారి ఇలాంటి ప్రయాణాలు చేశారని పేర్కొన్నారు. పలువురితో చర్చించడానికి, నేర్చుకోవడానికి ఈ సుసంపన్న ప్రయాణానుభవం ఒక వేదికగా మారిందని తెలిపారు. ఈ పారిశుధ్య-వ్యర్థాల నిర్వహణలో మొత్తం నాలుగు లక్షల మంది మహిళలు నిమగ్నమయ్యారని, పట్టణ భారతంలో ఇప్పుడిది ఒక పరిశ్రమగా మారిందన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా, మేము మహిళలను గౌరవించడమే కాకుండా కచ్చితమైన జీవనోపాధి అవకాశాలను కూడా అందించాం.

   న్యూఢిల్లీలో నిర్వహించిన ‘స్వచ్ఛోత్సవ్‌-2023: వ్యర్థరహిత నగరాల (జిఎఫ్‌సి) కోసం ర్యాలీ’ కార్యక్రమంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి శ్రీ పూరి ప్రసంగించారు. భారత్‌లో అంతర్జాతీయ వ్యర్థరహిత దినోత్సవం-2023 నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని జిఐజడ్‌, పర్యావరణ-ప్రకృతి పరిరక్షణ-అణుభద్రత, వినియోగదారుల రక్షణ మంత్రిత్వశాఖ,  ‘యుఎన్‌ఇపి, యుఎన్‌ హ్యాబిటట్‌ తదితరాల సహకారంతో కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ నిర్వహించింది. ఇందులో భాగంగా వ్యర్థరహిత నగరాల్లో ఆచరణలోగల ఉత్తమ పద్ధతులు, ‘జిఎఫ్‌సి’ల దిశగా కృషిలో మహిళలు-యువత, ‘జిఎఫ్‌సి’ల దిశగా వ్యాపారాలు-సాంకేతికత తదితర అంశాలపై చర్చలు సాగాయి. మేయర్లు, కమిషనర్లు, మిషన్ డైరెక్టర్లు, వ్యాపార-సాంకేతిక నిపుణులు, పారిశుధ్య ఉద్యమ నేతృత్వం వహిస్తున్న మహిళలు-యువతసహా పారిశుధ్యం, సాంకేతిక సంస్థలు, అభివృద్ధి భాగస్వాములు తదితర 350 మందికిపైగా ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.

   స్వచ్ఛభారత్‌ మిషన్‌ సాధించిన విజయాల గురించి మంత్రి ఈ సందర్భంగా వివరించారు. పట్టణ భారతం ఇప్పటికే బహిరంగ విసర్జన రహితం (ఓడీఎఫ్‌)గా మారిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు 4,715 నగర స్థానిక పాలక మండళ్లు (యుఎల్‌బి) 100 శాతం ‘ఓడిఎఫ్‌’ స్థాయిని సాధించాయన్నారు. అలాగే వినియోగంలోగల పరిశుభ్ర మరుగుదొడ్ల సదుపాయంతో 3,547 ‘యుఎల్‌బి’లు ‘ఓడీఎఫ్‌ ప్లస్‌’ స్థాయిని అందుకున్నాయని తెలిపారు. మరోవైపు పూర్తిస్థాయి విసర్జక మడ్డి నిర్వహణ సదుపాయాలతో 1,191 ‘యుఎల్‌బి’లు ‘ఓడీఎఫ్‌ ప్లస్‌ ప్లస్‌’ స్థాయికి చేరాయని వెల్లడించారు. దేశంలో వ్యర్థాల శుద్ధి పరిమాణం 2014లో 17 శాతం కాగా, ఇది దాదాపు నాలుగు రెట్లు పెరిగి నేడు 75 శాతానికి చేరిందని పేర్కొన్నారు. దేశంలోని 97 శాతం వార్డులలో ఇంటింటి చెత్త సేకరణ 100 శాతానికి చేరడం, అన్ని ‘యుఎల్‌బి’ల పరిధిలోని దాదాపు 90 శాతం వార్డులలో పౌరుల ఇళ్లవద్దనే వ్యర్థాల విభజన ఈ విజయాల సాధనకు దోహదం చేశాయని చెప్పారు.

   నేపథ్యంలో సంపూర్ణ వ్యర్థరహితం కావాలని భారతదేశం లక్ష్య నిర్దేశం చేసుకుంది. ఈ దిశగా స్వచ్ఛభారత్‌-పట్టణ లక్ష్యాల సాధనలో దేశవ్యాప్తంగా కనిపించిన దృఢదీక్ష, సంకల్పం ‘ఎస్‌బిఎం-యు 2.0’ కింద రెట్టింపు కాగలవని శ్రీ పూరి విశ్వాసం వ్యక్తం చేశారు. వినియోగ విధానాలలో మార్పులతోపాటు పట్టణీకరణ వేగంతో వ్యర్థాల పరిమాణం కూడా పెరుగుతున్నందున దేశంలో వ్యర్థాల నిర్వహణపై అవగాహన పెంచడంలో నేటి ‘వ్యర్థ రహిత నగరాలు’ ర్యాలీకిగల ప్రాముఖ్యాన్ని ఆయన ప్రముఖంగా వివరించారు. దేశంలోని నగరాల మధ్య ఉద్యమ స్ఫూర్తితో ఆరోగ్యకర స్పర్థాత్మకతను పెంచేలా 2018 జనవరిలో ప్రారంభించిన ‘జిఎఫ్‌సి-స్టార్‌’ రేటింగ్‌ పద్ధతి గురించి మంత్రి ప్రస్తావించారు. తొలుత 56 నగరాలతో ప్రారంభమైన ఈ ధ్రువీకరణ తొలి ఏడాదిలో 56 నగరాలకు పరిమితం కాగా, ఇవాళ 445 నగరాల స్థాయికి పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో 2024 అక్టోబరు నాటికి దేశంలో ‘3 స్టార్‌’ వ్యర్థరహిత నగరాల సంఖ్య కనీసం 1,000కి చేరాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

   పారిస్ ఒప్పందం నిర్దేశిత లక్ష్యాల సాధనలో భారతదేశానికి వ్యర్థాల నిర్వహణ ఓ కీలకాంశం. ఈ మేరకు గత సంవత్సరం జూన్‌లో ప్రధానమంత్రి ‘లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్’ (లైఫ్) పేరిట వినూత్న ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తద్వారా మన జీవితాల్లో వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, ‘వ్యర్థం నుంచి అర్థం’ భావనలను ప్రోదిచేస్తూ మనమంతా ‘భూగోళ మిత్రులు’గా మారాలని పిలుపునిచ్చారు. తదనుగుణంగా వృత్తాకార ఆర్థిక వ్యవస్థ సాకారానికి 2023-24 బడ్జెట్‌ తన నిబద్ధతను చాటింది. అందులో భాగంగా తడి-పొడి వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణపై మెరుగ్గా దృష్టి సారించనున్నట్లు ప్రకటించింది.

   కార్యక్రమంలో గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి మాట్లాడుతూ- వృత్తాకార వ్యర్థాల నిర్వహణలో, వాటిని విలువైన వనరులుగా మార్చే వ్యర్థరహిత విధానం అమలులో మహిళా నాయకత్వ పాత్రను ప్రశంసించారు. స్వయం సహాయక సంఘాల పనితీరును వృత్తిపరమైన స్థాయికి పెంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. తద్వారా ఈ బృందాలకు అధికాదాయ మార్గం చూపవచ్చునని పేర్కొన్నారు. అలాగే గౌరవనీయ ప్రధాని దార్శనికత మేరకు ‘వ్యర్థాల నిర్వహణలో మహిళలు’ స్థాయి నుంచి ‘మహిళల నేతృత్వంలో వ్యర్థరహిత నగరాలు’ కార్యక్రమం ఆశించిన ఫలితాలిస్తున్నదని తెలిపారు.

   చివరగా మంత్రి మాట్లాడుతూ- వ్యర్థరహిత నగరాలకు సంబంధించి ‘స్వచ్ఛత నవరత్నాలు’ ప్రతిజ్ఞపై సంతకాలు చేసిన నగరాల మేయర్లు, కమిషనర్లను ప్రశంసించారు. దీనికి అనుగుణంగా ‘జిఎఫ్‌సి’ భావనపై ప్రతి పౌరుడికీ అవగాహన పెంచడంలో వారు మరింతగా కృషి చేయగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వ్యర్థరహిత దినోత్సవ నిర్వహణలో సహకరించిన ఐరాస, భారత విభాగంతోపాటు ఇతర భాగస్వామ్య సంస్థలకు, స్వచ్ఛత ఉద్యమానికి సదా సహకరిస్తున్న రాష్ట్రాలు/నగరాల ప్రతినిధులకు శ్రీ పూరి కృతజ్ఞతలు తెలిపారు.

 

*****(Release ID: 1912136) Visitor Counter : 93


Read this release in: English , Urdu , Hindi