వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
పప్పుధాన్యాల నిల్వల వెల్లడిని పర్యవేక్షించే ప్రయత్నాలను వేగవంతం చేసిన కేంద్ర ప్రభుత్వం
నిల్వల లభ్యతను పారదర్శకంగా ప్రకటించాలని పప్పుధాన్యాల దిగుమతిదార్లకు కేంద్రం ఆదేశం
స్టాక్ డిక్లరేషన్ పోర్టల్‌లో నమోదిత సంస్థల సంఖ్యను పెంచడానికి అన్ని మార్గాల్లో ప్రయత్నించాలని రాష్ట్రాలు/యూటీలకు అభ్యర్థన
Posted On:
29 MAR 2023 4:58PM by PIB Hyderabad
పెద్ద పప్పుధాన్యాల దిగుమతిదార్లు తమ వద్ద అందుబాటులో ఉన్న నిల్వలను క్రమం తప్పకుండా పారదర్శకంగా ప్రకటించాలని కేంద్ర వినియోగదార్ల వ్యవహారాల విభాగం కార్యదర్శి శ్రీ రోహిత్ కుమార్ సింగ్ ఆదేశించారు. దేశీయ విపణిలో పప్పుధాన్యాల లభ్యతలో అంతరాయం కలిగించే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించారు.
అదనపు కార్యదర్శి నిధి ఖరే నేతృత్వంలోని కమిటీ ఈ రోజు అన్ని రాష్ట్రాలు/యూటీలతో సమావేశమైంది. ఫాసీ లైసెన్సుదార్లు, ఏపీఎంసీ నమోదిత వ్యాపారులు, పప్పుధాన్యాల జీఎస్‌టీ నమోదిత వ్యాపారులు మొదలైనవారు సహా స్టాక్ డిక్లరేషన్ పోర్టల్‌లో నమోదిత సంస్థల సంఖ్యను పెంచడానికి అన్ని మార్గాల్లో ప్రయత్నించాలని అభ్యర్థించారు. ప్రకటించిన నిల్వలను మరోమారు నిర్ధరించుకోవడానికి, ప్రభుత్వ & ప్రైవేట్ రంగాల గోదాము సేవల ప్రదాతల నుంచి సమాచారాన్ని తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. కస్టమ్స్ అధీనంలో ఉండే గిడ్డంగుల్లో ఉన్న దిగుమతి పప్పుల నిల్వలను పర్యవేక్షించాల్సిన అవసరాన్ని కూడా స్పష్టం చేశారు. వాటిని నౌకాశ్రయాల నుంచి సకాలంలో విడుదల చేసేలా చూసుకోవాలని అభ్యరించారు.
మిల్లర్లు, నిల్వదార్లు, వ్యాపారులు, దిగుమతిదార్లు మొదలైన వర్గాలు పప్పుధాన్యాల నిల్వలను బహిర్గతం చేసేలా పర్యవేక్షించే ప్రయత్నాలను కేంద్రం వేగవంతం చేసింది. కందిపప్పు ధరలను సాధారణీకరించడానికి, దేశీయ మార్కెట్‌లో కందిపప్పు లభ్యతను పెంచడానికి ఈ ప్రయత్నాలు చేస్తోంది.
దేశంలో పప్పుధాన్యాల లభ్యతను పెంచడానికి, ధరలను తగ్గించడానికి విలువ గొలుసులో ఉన్న అందరు వాటాదార్లతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర విభాగం యోచిస్తోంది.
నిల్వలను బహిర్గతం చేయడంలో పారదర్శకంగా వ్యవహరించేందుకు మనస్పూర్తిగా సహకరిస్తారని పప్పుధాన్యాల సంఘాలు, దిగుమతిదార్లు హామీ ఇచ్చారు.
***
(Release ID: 1912045)