శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

వ్యవసాయ.. పారిశ్రామిక వ్యర్థాల నుంచి ఫైబర్‌ తయారీపై ‘మెసర్స్‌ సాహి ఫ్యాబ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్’కు ‘టిడిబి-డిఎస్‌టి’ చేయూత


‘వ్యర్థం నుంచి అర్థం’ పథకం కింద సాంకేతిక పరిజ్ఞానంతో

‘వ్యర్థరహిత నగరాల కార్యక్రమం’ విజయం దిశగా తొలి ఒప్పందం;

సాంకేతికత లేమితో వ్యవసాయ వ్యర్థాల వినియోగం వీలుకాని నేపథ్యంలో ఇది తొలి ఫైబర్‌ తయారీ అంకుర సంస్థ: టీడీబీ కార్యదర్శి శ్రీ రాజేష్‌ కుమార్‌ పాఠక్

Posted On: 28 MAR 2023 1:26PM by PIB Hyderabad

   దేశంలోని నగరాలన్నిటినీ ‘వ్యర్థ రహితం’ చేయాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత మేరకు స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 కింద ఆ లక్ష్యం సాధించే దిశగా ముందడుగు పడింది. ఇందులో భాగంగా కేంద్ర శాస్త్ర-సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వశాఖ పరిధిలోని ‘టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డు’ (టిడిబి) ‘పరిశుభ్రత’పై దృష్టి సారించింది. తదనుగుణంగా వ్యర్థాల నిర్వహణ రంగంలోని వాణిజ్యీకరణ దశలోగల వినూత్న/దేశీయ సాంకేతికతలు కలిగిన స్వదేశీ కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ‘వ్యర్థం నుంచి అర్థం’ పథకం కింద సాంకేతిక చర్యలతో ‘వ్యర్థ రహిత నగరాల కార్యక్రమం’ దిశగా ప్రతిపాదనల  కోసం ఈ పిలుపు ఇవ్వబడింది.

   నేపథ్యంలో సదరు కార్యక్రమం కింద ‘టిడిబి’ తొలి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు “ వ్యవసాయ వ్యర్థాలతోపాటు పారిశ్రామిక జనుము, అవిసె, దూలగొండి తదితర మొక్కల కాండాలనుంచి ఫైబర్‌ తయారీ-వాణిజ్యీకరణ”పై న్యూఢిల్లీలోని మెసర్స్‌ సాహి ఫ్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.2.08 కోట్లు కాగా, ఇందులో రూ.1.38 కోట్ల మేర చేయూతనిచ్చేందుకు బోర్డు హామీ ఇచ్చింది. పారిశ్రామిక జనపనార (ఐహెంప్‌) ‘0.3 శాతంకన్నా తక్కువ టెట్రా హైడ్రో కన్నబినాల్ (టిహెచ్‌సి)గల గంజాయి లేదా సిద్ధపత్రితో కూడినది. ఈ చిన్న గోధుమరంగు గింజలలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలతో కూడిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే వీటిలో ఒమేగా-3, ఒమేగా-6 వంటి కొవ్వు ఆమ్లాలు అనేక వ్యాధులలక్షణాలను తగ్గించడంలో తోడ్పడతాయి. గుండె, చర్మం, కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

   లాగే ఈ కాండం బాక్టీరియా నిరోధక లక్షణాలు, సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, పెక్టిన్, లిగ్నిన్ తదితరాలతో కూడినది కావడం వల్ల దీనినుంచి తయారయ్యే ఉత్పత్తులు అతి నీలలోహిత కిరణాల నివారణ వంటి వివిధ ప్రయోజనాలు కలిగి ఉంటాయి. పత్తితో పోలిస్తే  తక్కువ నీటితో సాగవడమేగాక తక్కువ శక్తి వినియోగంతోపాటు తక్కువ కార్బన్‌డయాక్సైడ్ విడుదల చేస్తుంది. అంతేగాక పత్తి, పాలిస్టర్ ఫైబర్‌తో పోలిస్తే మెరుగైన కర్బన సంగ్రహణ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇలా ఎన్ని సానుకూలతలు ఉన్నా సాంకేతికత లేమివల్ల ఇది  సుస్థిర, పర్యావరణహిత ఫైబర్ వనరుగా, బలమైన-మన్నికైన సహజ నూలు రకాల్లో ఒకటిగా ఇప్పటికీ వినియోగంలో రాలేదు. అందుకే సద్వినియోగం కాని వ్యర్థాలను అర్థం (సంపద)గా మార్చే లక్ష్యంతో ఈ కంపెనీ ముందుకొచ్చింది. ఆ మేరకు వినూత్న సాంకేతికతతో ఈ వ్యర్థాల నుంచి ఫైబర్‌/ఫైబర్‌తో కూడిన ఉత్పత్తులను రూపొందించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఉత్పత్తుల తయారీ కిందివిధంగా ఉంటుంది:

డికార్టికేషన్‌: దేశీయంగా రూపొందించబడిన డికార్టికేటర్‌ యంత్రంతో జనపనార కాండం నుంచి నారను తీస్తారు.

వెట్‌ ప్రాసెసింగ్‌: ఇలా తీసిన నారను అధిక ఉష్ణోగ్రతగల అధిక పీడన యంత్రాలను ఉపయోగించి క్షార/ఎంజైమ్‌లతో శుద్ధి చేస్తారు.

ఫైబర్ ప్రాసెసింగ్: ఈ విధంగా శుద్ధిచేసిన ఫైబర్‌ను కార్డింగ్ ప్రక్రియతో  వేరుచేయటంతోపాటు నీడిల్‌ పంచింగ్‌ (అల్లక రహితం) సహా వివిధ పద్ధతులలో ప్రాసెస్ చేస్తారు.

   ఈ విధంగా కాండం నుంచి తీసిన ఫైబర్‌ వృత్తాకార ఆర్థిక వ్యవస్థకు తోడ్పడటమేగాక రైతుల  ఆదాయాన్ని 7 రెట్లకుపైగా పెంచుతుందని అంచనా.

   సందర్భంగా ‘టిడిబి’ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ పాఠక్ మాట్లాడుతూ- “సామాన్యుల జీవన సౌలభ్యం మెరుగు లక్ష్యంగా వినూత్న స్వదేశీ సాంకేతికతలను ప్రోత్సహించడంలో ‘టిడిబి’ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుంది. తదనుగుణంగా అనేక అంకుర సంస్థలు ఈ తాజా రంగంలో ప్రవేశిస్తూ తమ కృషికి ఆర్థికంగా చేయూతనివ్వాలని కోరుతున్నాయి. ఈ కోవకు చెందిన సంస్థలలో మెసర్స్‌ సాహి ఫ్యాబ్‌ సంస్థ ఒకటి. సాంకేతికత లేమి కారణంగా ఇప్పటిదాకా సద్వినియోగం చేసుకోని వ్యవసాయ, పారిశ్రామిక వ్యర్థాలనుంచి ఫైబర్‌ తయారీ ద్వారా సంపద సృష్టికి ఇది తోడ్పడుతుంది” అని పేర్కొన్నారు.

*****



(Release ID: 1911644) Visitor Counter : 162


Read this release in: English , Urdu , Hindi , Punjabi