వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ముంబైలో సమావేశం కానున్న వాణిజ్యం, పెట్టుబడిపై ఏర్పాటైన జీ-20 వర్కింగ్ గ్రూప్

Posted On: 24 MAR 2023 5:52PM by PIB Hyderabad

భారతదేశం అధ్యక్షతన జీ-20 లో వాణిజ్యం, పెట్టుబడిపై ఏర్పాటైన గ్రూప్ తొలి సమావేశం ముంబై లో 28, 29,30 తేదీల్లో జరగనున్నది. మూడు రోజుల పాటు జరిగే సమావేశానికి జీ-20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాలు, ప్రాంతీయ గ్రూపులు, అంతర్జాతీయ సంస్థలకు చెందిన దాదాపు 100 మంది ప్రతినిధులు హాజరవుతారు. ప్రపంచ వాణిజ్య, పెట్టుబడి రంగాల అభివృద్ధికి అమలు చేయాల్సిన చర్యలను సమావేశంలో చర్చిస్తారు. 

ముంబై తాజ్ ల్యాండ్స్ ఎండ్ బాల్ రూంలో మొదటి రోజున ' ట్రేడ్ ఫైనాన్స్' అంశంపై సదస్సు జరుగుతుంది. దీనిలో వాణిజ్య పెట్టుబడి లోటు పూడ్చే అంశంలో  బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, డెవలప్‌మెంట్ ఫైనాన్స్ సంస్థలు,ఎగుమతి పరపతి సంస్థల  పాత్ర , డిజిటలైజేషన్ , ఫిన్‌టెక్ ద్వారా వాణిజ్య అవసరాలు  ఎలా తీర్చ వచ్చు  అనే అంశంపై  రెండు ప్యానల్ చర్చలు జరుగుతాయి.  దీని తర్వాత ప్రతినిధులు  భారత్ డైమండ్ బోర్స్‌లో పర్యటిస్తారు. 

2023 మార్చి 29న కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి వాణిజ్యం, పెట్టుబడిపై ఏర్పాటైన జీ-20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలను ప్రారంభిస్తారు. 

అనంతరం అభివృద్ధి, సంక్షేమం కోసం వాణిజ్య కార్యక్రమాలను విస్తరించడానికి అమలు చేయాల్సిన చర్యలు, పటిష్ట ప్రపంచ స్థాయి విలువ ఆధారిత వ్యవస్థ అభివృద్ధి పై రెండు సమావేశాలు జరుగుతాయి.  సమగ్ర  విలువ ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేయడం,   విలువ ఆధారిత వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాలు  గ్లోబల్ సౌత్ భాగస్వామ్యాన్ని పెంచడం,   విలువ ఆధారిత వ్యవస్థ   సమగ్ర అభివృద్ధి కోసం పని చేయడం, భవిష్యత్తు సవాళ్లను   తట్టుకుని మనుగడ సాగించే  విలువ ఆధారిత వ్యవస్థ రూపొందించడం కోసం ప్రపంచ దేశాల మధ్య సమన్వయం సాధించే అంశాలకు చర్చల్లో ప్రాధాన్యత ఇస్తారు.  

ప్రపంచ వాణిజ్య రంగంలో ఎంఎస్ఎంఈ రంగానికి ప్రాధాన్యత లభించేలా చూసేందుకు అమలు చేయాల్సిన చర్యలు, పటిష్ట రవాణా వ్యవస్థ అభివృద్ధి అమలు చేయాల్సిన చర్యలపై ముగింపు రోజున రెండు సమావేశాలు నిర్వహిస్తారు. గతంలో జీ-20 అధ్యక్ష హోదాలో ఇతర దేశాలు తీసుకున్న చర్యలను కొనసాగిస్తూ ఎంఎస్ఎంఈ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలకు జీవనోపాధి అందించే అంశంలో ఎంఎస్ఎంఈ పోషిస్తున్న పాత్రను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రవాణా ఖర్చు తగ్గించడానికి దోహదపడే పటిష్ట రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసే అంశానికి జీ-20 సదస్సు ప్రాధాన్యత ఇచ్చి చర్చలు జరుపుతుంది. 

ప్రపంచ వాణిజ్య, పెట్టుబడి రంగాలను అభివృద్ధి  చేయడానికి సంఘటితంగా పటిష్ట చర్యలు అమలు జరగాలని భారతదేశం భావిస్తోంది. దీనికోసం వసుదైక కుటుంబం స్ఫూర్తితో  అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు ఉపయోగించుకుని ఉమ్మడి పరిష్కార మార్గాలు సిద్ధం చేయాలని జీ-20 అధ్యక్ష హోదాలో భారతదేశం నిర్ణయించింది.  

***



(Release ID: 1911022) Visitor Counter : 138


Read this release in: English , Urdu , Hindi , Tamil