రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

జాతీయ రహదారుల నిర్మాణ రంగంలో వినూత్న ఆలోచనలు, సాంకేతికతలను పంచుకోవడానికి ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌, సీఎస్‌ఐఆర్‌-ఎస్‌ఈఆర్‌సీ మధ్య అవగాహన ఒప్పందం

Posted On: 24 MAR 2023 4:01PM by PIB Hyderabad

కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌), చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌-ఎస్‌ఈఆర్‌సీ (స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్) 23.03.2023న ఒక అవగాహన ఒప్పందంపై (ఎంవోయూ) సంతకాలు చేశాయి. జాతీయ రహదారుల నిర్మాణ రంగంలో వినూత్న ఆలోచనలు, సాంకేతికతలను పంచుకోవడానికి ఈ ఒప్పందం కుదిరింది. ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ చంచల్ కుమార్, చెన్నై సీఎస్‌ఐఆర్‌-ఎస్‌ఈఆర్‌సీ డైరెక్టర్ డా. ఎన్.ఆనందవల్లి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

 

ఇరు పక్షాల మధ్య సహకారానికి ఒక వేదికను ఈ ఒప్పందం ఏర్పాటు చేస్తుంది. జాతీయ రహదారుల నిర్మాణ రంగంలో వినూత్న ఆలోచనలు, సాంకేతికతలు పంచుకోవడం, ఉమ్మడి ఆసక్తి ఉన్న వివిధ నిర్మాణ పనులు చేపట్టడం వంటి కార్యకలాపాలను పరస్పరం అంగీకరించిన నిబంధనలు, షరతుల ప్రకారం రెండు సంస్థలు కలిసి చేపట్టవచ్చు. ఈ సహకారం రహదారి రంగంలో ఆర్‌&డీ కార్యకలాపాలను బలోపేతం చేస్తుందని, జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల రంగంలో పరిశోధన, అభివృద్ధి, శిక్షణలను నిర్వహించడం, సమన్వయం చేయడానికి దారి తీస్తుందని భావిస్తున్నారు.

 

 

ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ చంచల్ కుమార్ మాట్లాడారు. భాగస్వామ్యాలు & మార్గదర్శక కార్యక్రమాల ద్వారా నాణ్యమైన పరిశోధనను పెంపొందించుకోవడానికి ప్రభుత్వం మద్దతు ఇస్తుందని అన్నారు. ప్రభుత్వం-విద్యాసంస్థ భాగస్వామ్యానికి కొత్త పారామితిని ఈ ఒప్పందం నిర్దేశిస్తుందని, సీఎస్‌ఐఆర్‌-ఎస్‌ఈఆర్‌సీ సాంకేతిక అధికారుల్లో అభ్యాస అభివృద్ధికి కొత్త అవకాశాలను తెరుస్తుందని అన్నారు. అంతర్గత సామర్థ్య నిర్మాణానికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.

 జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌) దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం సహా జాతీయ రహదారుల సర్వే, ఆకృతి, నిర్మాణం, నిర్వహణ, ఆధునీకరణ పనులను చేస్తుంది. పొరుగు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులు పంచుకునే ప్రాంతాల్లో వ్యూహాత్మక రహదారుల నిర్మాణంలో పాల్గొంటుంది.

చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌-ఎస్‌ఈఆర్‌సీ, విద్య & పరిశోధనలో 'సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌'గా ఉన్న దేశంలోని ఒక ప్రధాన పరిశోధన కేంద్రం. విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, సంస్థల నిర్వహణలో ప్రపంచ నాయకులను ఇది తయారు చేస్తుంది.

ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌, చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌-ఎస్‌ఈఆర్‌సీ రెండూ తమ రంగాల్లో అగ్రగామి జాతీయ సంస్థలు. జాతీయ లక్ష్యాలను సాధించడానికి కలిసికట్టుగా పని చేయాలని కోరుకుంటున్నాయి.

 

****



(Release ID: 1910505) Visitor Counter : 160


Read this release in: English , Urdu , Hindi , Tamil