ఆర్థిక మంత్రిత్వ శాఖ
'ఏఐఎస్ ఫర్ టాక్స్‌పేయర్స్' మొబైల్ యాప్ ప్రారంభం
Posted On:
22 MAR 2023 6:37PM by PIB Hyderabad
'ఏఐఎస్ ఫర్ టాక్స్‌పేయర్స్' పేరిట ఒక మొబైల్ అప్లికేషన్‌ను ఆదాయపు పన్ను విభాగం ప్రారంభించింది. వార్షిక సమాచార పత్రం (ఏఐఎస్)/పన్ను చెల్లింపుదార్ల సమాచార సారాంశంలో (టీఐఎస్) అందుబాటులో ఉన్న వివరాలను మరింత సులభంగా తెలుసుకోవడానికి ఈ యాప్ తీసుకొచ్చింది. 'ఏఐఎస్ ఫర్ టాక్స్‌పేయర్స్' మొబైల్ యాప్ పూర్తిగా ఉచితం. గూగుల్ ప్లే, యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పన్ను చెల్లింపుదార్లకు సంబంధించి వివిధ మార్గాల నుంచి సేకరించిన సమాచారాన్ని ప్రదర్శించే ఏఐఎస్/టిస్ సమగ్ర వీక్షణను అందించడం ఈ యాప్ లక్ష్యం.
ఏఐఎస్/టిస్‌లో అందుబాటులో ఉండే టీడీఎస్/టీసీఎస్, వడ్డీ, డివిడెండ్‌లు, షేర్ల లావాదేవీలు, పన్ను చెల్లింపులు, ఆదాయపు పన్ను రిఫండ్‌లు, ఇతర సమాచారాన్ని (జీఎస్‌టీ సమాచారం, విదేశీ చెల్లింపులు మొదలైనవి) వీక్షించడానికి పన్ను చెల్లింపుదారులు మొబైల్ యాప్‌ని ఉపయోగించవచ్చు. యాప్‌లో కనిపించే సమాచారంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అందించడానికి కూడా పన్ను చెల్లింపుదార్లకు సదుపాయం ఉంది.
ఈ మొబైల్ యాప్‌ను వినియోగించుకోవాలంటే, ముందుగా, పన్ను చెల్లింపుదారు పాన్ నంబర్ ద్వారా యాప్‌లో నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత, ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసిన మొబైల్ నంబర్ & ఈ-మెయిల్‌కు పంపిన ఓటీపీని యాప్‌లో నమోదు చేయాలి. ఈ ప్రామాణీకరణ తర్వాత, మొబైల్ యాప్‌ను ఉపయోగించుకోవడానికి పన్ను చెల్లింపుదారు 4-అంకెల పిన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.
పన్ను చెల్లింపుదార్ల కోసం సేవలను మరింత మెరుగ్గా, సౌలభ్యంగా తీర్చిదిద్దడానికి ఆదాయపు పన్ను విభాగం తీసుకొచ్చిన చేసిన మరొక ప్రయత్నం ఇది.
****
(Release ID: 1909860)
Visitor Counter : 187