శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సుస్థిర, వృత్తాకార జీవ-ఆర్థిక వ్యవస్థ నిర్మాణంపై దిబ్రూగఢ్ జీ20 ఆర్‌ఐఐజీ సదస్సులో చర్చలు
प्रविष्टि तिथि:
22 MAR 2023 2:19PM by PIB Hyderabad
మార్చి 23-24 తేదీల్లో, అసోంలోని దిబ్రూగఢ్‌లో జీ20 'రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ గాదరింగ్' (ఆర్‌ఐఐజీ) సదస్సు జరగనుంది. జీ20 దేశాల సభ్యులు, అతిథి దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. సుస్థిర, వృత్తాకార జీవ-ఆర్థిక వ్యవస్థను నిర్మించే మార్గాలపై చర్చిస్తారు.
కేంద్ర శాస్త్ర, సాంకేతికత విభాగం (డీఎస్‌టీ) కార్యదర్శి డా.ఎస్.చంద్రశేఖర్ జీ20 ఆర్‌ఐఐజీ సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. కేంద్ర శాస్త్ర, సాంకేతికత మంత్రిత్వ శాఖకు చెందిన జీవ సాంకేతికత విభాగం సహకారం అందిస్తుంది. ఈ సదస్సులో దాదాపు 100 మంది ప్రతినిధులు, ఆహ్వానితులు పాల్గొంటారు.
ప్రణాళికలు రచించడం, కొత్త కార్యక్రమాలు, ఇప్పటికే ఉన్న కార్యక్రమాల నిర్వహణకు బాధ్యత వహించే జీ20 దేశాల కేంద్ర అధికారులు, నిపుణులను ఈ సదస్సు ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. వ్యవసాయ రంగంలో సవాళ్లు, అవకాశాలు, పరిశ్రమల్లో కర్బన ఉద్గారాల నిర్మూలన, జీవ ఇంధనం, జీవ వనరుల నిర్వహణ వంటి అంశాలపై ఈ కార్యక్రమంలో దృష్టి పెడతారు. జాతీయ, ప్రాంతీయ స్థాయి కార్యక్రమాలు, దేశాల అనుభవాలు, నియంత్రిత పర్యావరణం, ప్రభుత్వ/ప్రైవేట్ రంగ సహకారం సహా కొత్త, సమర్థవంత వనరులు, సుస్థిర, మరింత వృత్తాకార జీవ ఆధారిత సాంకేతికతలు, ఉత్పత్తులు, సేవలు రూపొందించడంలో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలు, నిర్దిష్ట రంగాల్లో జీ20 సభ్యుల మధ్య సహకారం వంటి అంశాలపైనా చర్చలు జరుగుతాయి.
'3పీ'లు (ప్రజలు, విధానాలు, ప్రాంతాలు) సహా అందరు కీలక వాటాదారుల మధ్య చురుకైన సహకారాన్ని ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుంది. వివిధ రంగాల్లోని ప్రధాన స్రవంతి వృత్తాకార జీవ-ఆర్థిక కార్యక్రమాలకు విధివిధానాలను అందించే సమగ్ర విధాన రూపకల్పనకు బాటలు వేస్తుంది. వృత్తాకార జీవ-ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను జీ20 సభ్యులు, వర్గాల మధ్య సహకారాలు, భాగస్వామ్యాలు బలోపేతం చేస్తాయి.
<><><><>
(रिलीज़ आईडी: 1909728)
आगंतुक पटल : 177