విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆర్మీ ఎస్టాబ్లిష్‌మెంట్‌ లలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్‌ ల అమలు కోసం భారత సైన్యంతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన - ఎన్‌.టి.పి.సి. రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్


శిలాజ ఇంధనాలపై సైన్యం ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది

Posted On: 21 MAR 2023 3:02PM by PIB Hyderabad

భారత సైన్యానికి చెందిన వివిధ ప్రదేశాల్లో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్‌లను నిర్మించి, అప్పగించి, నిర్వహించే (బి.ఓ.ఓ) పద్ధతిలో ఏర్పాటు చేయడానికి భారత సైన్యంతో ఎన్.టి.పి.సి. ఆర్.ఈ.ఎల్. ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.  రవాణా తో పాటు, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం, డీకార్బోనైజేషన్‌ ను వేగవంతం చేయడం దీని ఉద్దేశం.  ఈ అవగాహన ఒప్పందం పై ఎన్.టి.పి.సి. ఆర్.ఈ.ఎల్. ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ మోహిత్ భార్గవ మరియు భారత సైన్యానికి చెందిన పి.వి.ఎస్.ఎం., ఏ.వి.ఎస్.ఎం., వి.ఎస్.ఎం., క్యూ.ఎం.జి. లెఫ్టినెంట్ జనరల్ రాజిందర్ దేవాన్ సంతకం చేశారు.

ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా, విద్యుత్ సరఫరా కోసం గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తించడానికి ఇరు పక్షాలు దశల వారీగా ఉమ్మడి కార్యాచరణ చేపడతాయి.   భారత సైన్యం కోసం ఎన్.టి.సి.పి. ఆర్.ఈ.ఎల్. సంస్థ సౌర, పవన మొదలైన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల రూపకల్పన, అభివృద్ధితో పాటు వాటిని నెలకొల్పుతుంది. 

భారత సైన్యం ఆధునీకరణ కోసం ఒక అధునాతన విధానం అమలు తో పాటు, దేశానికి దాని డీకార్బనైజేషన్ లక్ష్యాలలో సహాయం చేయడానికి ఎన్.టి.పి.సి. నిబద్ధతను ఈ అవగాహన ఒప్పందం సూచిస్తుంది.  ఈ రకమైన ఒప్పందాల్లో మొదటిదైన ఈ ఒప్పందం దేశ రక్షణ మార్గాల కోసం ఇంధన భద్రతతో కూడిన నూతన సరిహద్దు భద్రతా విధానానికి నాంది పలికింది.

భారత సైన్యానికి చెందిన వివిధ ఆఫ్-గ్రిడ్ ప్రదేశాల్లో డి.జి. సెట్ల ద్వారా విద్యుత్ సరఫరా చేయడం జరుగుతోంది.   "పంచామృతం", అదే విధంగా, “కార్బన్ న్యూట్రల్ లడఖ్” అనే ప్రధానమంత్రి దృష్టికి అనుగుణంగా భారత సైన్యం, విద్యుత్ ఉత్పత్తి తో పాటు వేడి కోసం శిలాజ ఇంధనం, వాటి రవాణా పై ఆధారపడటాన్ని తగ్గించాలని భావిస్తోంది. 

ఎన్.టి.పి.సి. ఆర్.ఈ.ఎల్. అనేది ఎన్.టి.పి.సి. సంస్థ కు చెందిన పూర్తి అనుబంధ సంస్థ.  ప్రస్తుతం ఇది నిర్మాణంలో ఉన్న 3.6 జి.డబ్ల్యూ. ఆర్.ఈ. సామర్థ్యంతో కూడిన పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది.  ఎన్.టి.పి.సి. గ్రూప్ ప్రస్తుతం, 3.2 జి.డబ్ల్యూ. ఆర్.ఈ. సామర్థ్యంతో ఉండగా, 2032 నాటికి 60 జి.డబ్ల్యూ. ఆర్.ఈ. సామర్థ్యంతో ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను కలిగి ఉంది. 

హైడ్రోజన్ సాంకేతికతతో ఎన్.టి.పి.సి. అనేక కార్యక్రమాలు చేపట్టింది, ఇప్పటికే గుజరాత్‌ లో పైప్డ్ నేచురల్ గ్యాస్ ప్రాజెక్ట్‌ తో హైడ్రోజన్ కలపడాన్ని ప్రారంభించింది.  అదేవిధంగా, ప్రస్తుతం, లడఖ్, ఢిల్లీ నగరాల్లో హైడ్రోజన్ ఆధారిత మొబిలిటీ ప్రాజెక్టులతో పాటు, మధ్యప్రదేశ్ లో గ్రీన్ మిథనాల్ ప్రాజెక్టును కూడా ఎన్.టి.పి.సి. అమలు చేస్తోంది. 

 

 

*****


(Release ID: 1909452) Visitor Counter : 186


Read this release in: English , Urdu , Hindi , Punjabi