రైల్వే మంత్రిత్వ శాఖ

మేఘాలయలో తొలిసారిగా పరుగులు పెట్టిన ఎలక్ట్రిక్ రైళ్లు


ముఖ్య సెక్షన్లు అభయపురి-పంచరత్న, దుధ్నయ్‌-మెండిపత్తర్ మార్గంలో విద్యుదీకరణ పూర్తి చేసిన భారతీయ రైల్వే

విద్యుదీకరణ వల్ల ఈశాన్య భారతదేశంలో గణనీయంగా మెరుగుపడనున్న రైలు రవాణా

Posted On: 17 MAR 2023 3:24PM by PIB Hyderabad

2030 నాటికి సున్నా ఉద్గారాలకు మారే దిశగా భారతీయ రైల్వే వేగంగా పరుగులు తీస్తోంది. పూర్తి స్థాయి విద్యుదీకరణ కార్యక్రమంలో భాగంగా, దుధ్నయ్‌-మెండిపత్తర్ (22.823 ట్రాక్ కిలోమీటరు) సింగిల్ లైన్ సెక్షన్, అభయపురి-పంచరత్న (34.59 ట్రాక్ కిలోమీటర్‌) డబుల్‌ లైన్‌ సెక్షన్‌ను ప్రారంభించడం ద్వారా నార్త్‌ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వే మరో మైలురాయిని సాధించింది. 15 మార్చి 2023న వీటిని ప్రారంభించింది. ఈ సెక్షన్లలో విద్యుదీకరణ పనులను సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ (కోర్‌) పూర్తి చేసింది.

ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏకైక రైల్వే స్టేషన్ మెండిపత్తర్. 2014లో గౌరవనీయ ప్రధానమంత్రి దీనిని ప్రారంభించారు. విద్యుదీకరణ పనులు ప్రారంభించిన నేపథ్యంలో, ఎలక్ట్రిక్ లోకోమోటివ్ రైళ్లు ఇప్పుడు మేఘాలయలోని మెండిపత్తర్ నుంచి నడుస్తాయి, రైళ్ల సగటు వేగం పెరుగుతుంది. మరిన్ని ప్యాసింజర్ & సరుకు రవాణా రైళ్లు ఈ విభాగాల ద్వారా పూర్తి వేగంతో నడుస్తాయి. ఈ సెక్షన్‌లో సమయపాలన కూడా మెరుగుపడుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి బయలుదేరే ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌ పార్శిల్ & సరుకు రవాణా రైళ్లు ఇప్పుడు నేరుగా మేఘాలయ చేరుకోగలవు.

విద్యుదీకరణ వల్ల ఈశాన్య భారతదేశంలో రైళ్ల కదలిక గణనీయంగా మెరుగుపడుతుంది. శిలాజ ఇంధనం నుంచి విద్యుత్‌కు మారడం వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు, ఈ ప్రాంతంలో రైల్వే వ్యవస్థ సామర్థ్యమూ పెరుగుతుంది. ఇది, అంతరాయం లేని రవాణాను సులభతరం చేస్తుంది. విలువైన విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడంతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే & తిరిగి వచ్చే రైళ్ల సమయం కూడా ఆదా అవుతుంది.

 

***



(Release ID: 1908085) Visitor Counter : 143