రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
పదేళ్ల తర్వాత ట్రాక్టర్ల రద్దుపై స్పష్టత ఇచ్చినరోడ్డు రవాణా-రహదారులమంత్రిత్వ శాఖ
Posted On:
15 MAR 2023 6:07PM by PIB Hyderabad
దేశంలో వినియోగ అనర్హ, కాలుష్య కారక రవాణా-రవాణాయేతర వాహనాలను తుక్కు కిందకు మార్చే ‘వాహన తుక్కు విధానం లేదా వాహన స్వచ్ఛంద ఆధునికీకరణ కార్యక్రమాన్ని’ కేంద్ర రోడ్డు రవాణా-రహదారుల మంత్రిత్వ శాఖ రూపొందించింది. ఈ విధానం కింద వాహనాలను తుక్కు కింద పరిగణించడంపై వాటి వినియోగ కాలానికి ఎలాంటి నిర్దిష్ట పరిమితి నిర్దేశించలేదు. ఆ మేరకు స్వయంచలిత పరీక్షా కేంద్రంలో తనిఖీ చేసిన తర్వాత అది వినియోగార్హమైతే రహదారులపై వాడుకోవచ్చు.
ఇక వ్యవసాయ రంగంలో వాడే ట్రాక్టర్లను వాణిజ్యేతర వాహనం విభాగంలో చేర్చగా, వీటి తుక్కు పరిగణన వ్యవధిని తొలుత 15 ఏళ్లుగా నిర్ణయించారు. అయితే, ప్రారంభ రిజిస్ట్రేషన్ తర్వాత ఆ వ్యవధి పూర్తయ్యాక, మరో ఐదేళ్లపాటు వాడకానికి వీలుగా నవీకరించుకోవచ్చు. అలాగే 16.01.2023నాటి ‘జిఎస్‌ఆర్’ 29(ఇ) ద్వారా నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిర్దిష్ట కేంద్ర ప్రభుత్వ వాహనాలు మినహా మిగిలిన వాటికి తుక్కు పరిగణన వ్యవధిని నిర్ణయించలేదు.
దేశంలో పదేళ్లపాటు వాడిన ట్రాక్టర్లను తుక్కు కింద పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించిందంటూ వాట్సాప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో వదంతులు ప్రచారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అవి పూర్తిగా అవాస్తవమని, నిరాధార వదంతులతో ఇటువంటి తప్పుడు సమాచారమిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రిత్వశాఖ హెచ్చరించింది.
*****
(Release ID: 1907436)