ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఔషధ నాణ్యత నియంత్రణ-అమలుపై హైదరాబాద్లో రెండు రోజుల ‘చింతన శిబిరం’
వక్తలుగా ఔషధ రంగ నిపుణులైన ప్రభుత్వ ప్రతినిధులుసహా
పారిశ్రామిక వేదిక.. అంకుర-విద్యా సంస్థల ప్రతినిధులు హాజరు
Posted On:
25 FEB 2023 1:28PM by PIB Hyderabad
“ఔషధ నాణ్యత నియంత్రణ-అమలు” అంశంపై కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో రెండు రోజులపాటు- 2023 ఫిబ్రవరి 26, 27 తేదీల్లో ‘చింతన శిబిరం’ నిర్వహించనుంది. ఆరోగ్య-కుటుంబ సంక్షేమ, ఎరువులు-రసాయనాల శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ దీనికి అధ్యక్షత వహిస్తారు. ఈ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, ఎరువులు-రసాయనాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవంత్ ఖుబా, నీతి ఆయోగ్ (ఆరోగ్య విభాగం) సభ్యులు డాక్టర్ వి.కె.పాల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే కేంద్ర ఆరోగ్య, ఆయుష్, డీజీహెచ్‌ఎస్ (ఔషధ) శాఖలు/విభాగాల కార్యదర్శులుసహా సీనియర్ అధికారులు, నేషనల్ హెల్త్ అథారిటీ, ఎన్‌పీపీఏ, సీడీఎస్‌సీఓ, ఎన్‌ఐబి, ఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్, ఎన్‌ఐపీఈఆర్ తదితర సంస్థల ప్రతినిధులు, ఏసీఎస్/ముఖ్య కార్యదర్శిసహా రాష్ట్రస్థాయి అధికారులు ఈ రెండు రోజుల మేధోమథన సదస్సులో పాలుపంచుకుంటారు. హైదరాబాద్‌లోని శాంతివనం వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది.
దేశంలో ఔషధ నాణ్యత-అమలు సంబంధిత విధానాలు-కార్యక్రమాల ప్రక్రియలతోపాటు అమలును సమీక్షించడం ఈ రెండు రోజుల చింతన శిబిరం లక్ష్యం. భారతీయ ఔషధ ప్రమాణాలు, కేంద్ర-రాష్ట్రాల పరిధిలో నియంత్రణ సామర్థ్యాలపై అంచనాసహా పారదర్శకత, కట్టుబాటు తదితరాలను ఈ సదస్సు సమీక్షిస్తుంది. అనంతరం వ్యాపార సౌలభ్యం కల్పనకు మార్గాలు-విధానాలపై సిఫారసులు అందజేస్తుంది. మరోవైపు ప్రపంచ స్థాయిలో ఉత్తమ పద్ధతులు, డిజిటల్ ఉపకరణాల వంటి కొత్త ఆవిష్కరణల పరిచయం, ఔషధ ప్రయోగ పరీక్షల ప్రమాణాలు తదితరాలపైనా ఇందులో పాల్గొంటున్న నిపుణులు చర్చిస్తారు. తద్వారా సామాన్య పౌరుల ప్రయోజనాల దిశగా బహుళ-భాగస్వామ్య విధాన రూపకల్పనకు ఉత్తేజమిస్తారు.
ఈ చింతన శిబిరంలో కింది అంశాలపై ఐదు భాగాలుగా చర్చాగోష్ఠి నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు:
- దేశీయ, ఎగుమతి మార్కెట్లలో మందులు, సౌందర్య సాధనాలు, వైద్య పరికరాల నాణ్యతపై నమ్మకం-విశ్వాసం ప్రోదిచేయడం.
- కేత్రస్థాయిలో విధానాల సమర్థ అమలు
- భారతీయ ఔషధ సంహిత- అది నిర్దేశించే నాణ్యత ప్రమాణాలకు కట్టుబాటు
- అన్ని నియంత్రణ కార్యకలాపాలలో ఏకీకృత సమాచార సాంకేతికత వినియోగం
- జాతీయ, రాష్ట్రస్థాయి నియంత్రణ వ్యవస్థల సామర్థ్యం పెంపు
ఈ సదస్సులో భాగంగా ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, పారిశ్రామిక వేదిక, అంకుర సంస్థలు, విద్యా సంస్థలు తదితర రంగాల ప్రముఖ వక్తలు, నిపుణుల మధ్య చర్చలు సాగుతాయి. అలాగే భాగస్వామ్య పక్షాల మధ్య పరస్పర చర్చాగోష్ఠులు కూడా ఉంటాయి. నిర్దిష్ట వ్యవధి మేరకు విధానాలు, కార్యక్రమాల అమలుకు తగిన భాగస్వామ్య విధానం రూపకల్పన లక్ష్యంగా భాగస్వాముల మధ్య పరస్పర చర్చకు ఈ గోష్ఠులు వేదికలవుతాయి.
*****
(Release ID: 1902318)
Visitor Counter : 227