రైల్వే మంత్రిత్వ శాఖ
రైల్వే రక్షణ దళం, యు.ఐ.సి. సంయుక్తంగా నిర్వహించిన 18వ ప్రపంచ భద్రతా సదస్సు లో "జైపూర్ ప్రకటన" ఆమోదం పొందింది.
అంతర్జాతీయ రైల్వే సంస్థలు తమ దీర్ఘకాలిక లక్ష్యమైన భద్రత, రక్షణను సాధించడంలో సహాయపడే వినూత్న విధానాలను అన్వేషించడానికి వీలుగా "జైపూర్ ప్రకటన" యు.ఐ.సి. కోసం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుంది
Posted On:
23 FEB 2023 3:24PM by PIB Hyderabad
రైల్వే రక్షణ దళం (ఆర్.పి.ఎఫ్), అంతర్జాతీయ రైల్వేల సంఘం (యు.ఐ.సి) సంయుక్తంగా నిర్వహించిన 18వ యు.ఐ.సి. ప్రపంచ రక్షణ సదస్సు, "జైపూర్ ప్రకటన" ఆమోదం తో ఈ రోజు ముగిసింది. "రైల్వే భద్రతా వ్యూహం: ప్రతిస్పందనలు, భవిష్యత్తు పై దృష్టి" అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ సదస్సులో రైల్వే భద్రతలో తాజా పరిణామాలు, ఉత్తమ పద్ధతుల గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు, వాటాదారులు, ప్రతినిధులు చర్చించారు.
ఈ సదస్సు చివరి రోజు గౌరవనీయులైన ప్రధానమంత్రి కి జాతీయ భద్రతా సలహాదారు శ్రీ పంకజ్ కుమార్ సింగ్ ప్రసంగించారు. ఎదురౌతున్న భద్రతా బెదిరింపులకు పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి వీలుగా భాగస్వాములందరినీ ఒకచోట చేర్చడం కోసం యు.ఐ.సి. తో పాటు దానికి అనుబంధంగా ఉన్న విభాగాలు నిర్వహిస్తున్న పాత్రను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. పిల్లలను రక్షించడం కోసం "ఆపరేషన్ నన్హే ఫరిష్తే", మహిళలు, పిల్లలను అక్రమ రవాణాదారుల బారి నుంచి రక్షించడానికి "ఆపరేషన్ ఏ.ఏ.హెచ్.టి." వంటి వివిధ కార్యక్రమాల ద్వారా భారతదేశంలో ప్రయాణీకుల భద్రతను పెంపొందించడంలో రైల్వే రక్షణ దళం పోషించిన అసాధారణ పాత్రను కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మౌలిక సదుపాయాలు, కార్యకలాపాలు, ప్రయాణీకుల అనుభవాలతో సహా రైల్వే వ్యవస్థ లోని అన్ని అంశాలను పరిశీలించి, రైల్వే భద్రతకు అవసరమైన సమగ్ర పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి కృత్రిమ మేధస్సు, 5-జి, సమాచార సాంకేతిక పరిజ్ఞానం వంటి కొత్త సాంకేతికతలను స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
2022 జూలై నుంచి 2024 జూలై వరకు యు.ఐ.సి. భద్రతా సంస్థ ఛైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న రైల్వే రక్షణ దళం డైరెక్టర్ జనరల్ శ్రీ సంజయ్ చందర్, “జైపూర్ ప్రకటన” ను చదివి వినిపించారు. అంతర్జాతీయ రైల్వే సంస్థలు తమ దీర్ఘకాలిక లక్ష్యమైన భద్రత, రక్షణను సాధించడంలో సహాయపడే వినూత్న విధానాలను అన్వేషించడానికి వీలుగా, యు.ఐ.సి. కోసం ఒక కార్యాచరణ ప్రణాళికను ఈ ప్రకటనలో పొందుపరిచారు. 2025 నాటికి ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా ప్రాంతీయ సమావేశాలను పూర్తిగా సక్రియం చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మరింత సురక్షితంగా, భద్రత తో కూడిన రైలు వ్యవస్థను అందించడానికి యు.ఐ.సి. నిబద్ధతను ఈ ప్రకటన ప్రముఖంగా తెలియజేస్తుంది.
సదస్సు చివరి రోజు "యు.ఐ.సి. భద్రతా విభాగం కార్యకలాపాల తాజా సమాచారం" అనే అంశం తో ప్రారంభమైంది. ఇందులో భాగంగా, వర్కింగ్ గ్రూప్ లపై ప్రెజెంటేషన్, సెక్యూరిటీ హబ్ పై వర్క్‌షాప్, సెక్యూరిటీ ప్లాట్ ఫారమ్ తదుపరి దశల గురించి వివరించారు. ఈ సదస్సులో యు.ఐ.సి. భద్రతా విభాగం అధిపతి శ్రీమతి మేరీ-హెలెన్ బోన్నో తో పాటు, యు.ఐ.సి. భద్రతా విభాగం సీనియర్ సలహాదారు శ్రీమతి డారియా కార్డెల్ పాల్గొని ప్రతినిధులకు, తాజా సమాచారాన్ని తెలియజేశారు. భవిష్యత్తులో యు.ఐ.సి. భద్రతా విభాగం కోసం ఉద్దేశించిన కీలక పాత్రను వారు ప్రముఖంగా పేర్కొన్నారు. అదేవిధంగా, అంతర్జాతీయ భద్రతా బెదిరింపులను పరిష్కరించి, పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో రైల్వే రక్షణ దళం పోషిస్తున్న కీలక పాత్ర గురించి కూడా వారు నొక్కి చెప్పారు. "క్రైసిస్ మేనేజ్‌మెంట్ వర్కింగ్ గ్రూప్" కు అధ్యక్షత వహించిన పోలెండ్ లోని పి.కె.పి. రైల్వే ప్రతినిధి శ్రీ జెర్జి ట్రోచా, సహ అధ్యక్షత వహించిన భారత రైల్వే రక్షణ దళం ప్రతినిధి ఆర్.పి.ఎఫ్. ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రీ మునావర్ ఖుర్షీద్ వర్కింగ్ గ్రూప్ ఆదేశాన్ని కూడా వివరించారు.
పోలాండ్ లోని వార్సాలో జరిగిన చివరి ప్రపంచ భద్రతా సదస్సు తర్వాత పునరావృతమైన ఒక వినూత్న విధానంలో భాగంగా, నాలుగు సదస్సుల్లో చర్చించిన విషయాలపై సర్వే నిర్వహించడం జరిగింది. భారతదేశంలోని జైపూర్ లో జరిగిన సదస్సు కు హాజరైన ప్రతినిధులతో పాటు, వినియోగదారులకు అత్యంత అనుకూలంగా ఉండే "స్లైడో" వేదిక ద్వారా దృశ్య మాధ్యమ విధానం ద్వారా ఆన్-లైన్ లో పాల్గొన్న వారితో ఈ సర్వే తీసుకోవడం జరిగింది. రైల్వే స్టేషన్లు, రైళ్లు, రైల్వే వ్యవస్థకు చెందిన ఇతర ముఖ్యమైన పరికరాలు, సామగ్రి భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై రూపొందించిన ప్రశ్నల ద్వారా ఈ సదస్సులో పాల్గొన్నవారందరి అభిప్రాయాలను, సూచనలను సేకరించడం జరిగింది.
యు.ఐ.సి. ప్రపంచ రక్షణ సదస్సు అద్భుతమైన విజయాన్ని సాధించింది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుండి పరిశ్రమ నిపుణులు, విధాన రూపకర్తలు, భాగస్వాములు కలిసి రైల్వే భద్రతా రంగంలో వారి జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని ఒకరితో ఒకరు పంచుకున్నారు.
యు.ఐ.సి. గురించి :
1922 సంవత్సరంలో ప్రారంభమైన యు.ఐ.సి. (యూనియన్ ఇంటర్నేషనల్ డెస్ కెమిన్స్) లేదా "ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్" ప్రధాన కార్యాలయం ప్యారిస్ లో ఉంది. ఇది రైలు రవాణా పరిశోధన, అభివృద్ధి, ప్రోత్సాహం కోసం రైల్వే రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రపంచవ్యాప్త వృత్తి నైపుణ్య సంస్థ. ప్రాంతీయ / ప్రపంచవ్యాప్త అంశాలపై రైల్వే స్థానాన్ని రూపొందించడానికి ఏర్పాటైన యు.ఐ.సి. వర్కింగ్ గ్రూపులు, అసెంబ్లీలలో ఈ సంస్థ సభ్యులు క్రియాశీలక పాత్ర పోషిస్తారు. వర్కింగ్ గ్రూపుల్లో చురుగ్గా పాల్గొనడం అనేది ప్రపంచవ్యాప్త స్థాయిలో సమన్వయంతో రైల్వే రంగ ప్రాధాన్యత, అభిప్రాయాలను తెలియజేయడానికి, ప్రయోజనాలు పొందేందుకు ఒక ప్రత్యేక అవకాశం. వ్యక్తులు, ఆస్తితో పాటు, పరికరాలు, సామాగ్రి భద్రతకు సంబంధించిన విషయాల్లో ప్రపంచ రైలు రంగం తరపున విశ్లేషణ, విధానపరమైన నిర్ణయాలను అభివృద్ధి చేయడానికి, రూపొందించడానికి, యు.ఐ.సి. కి చెందిన భద్రతా విభాగం, అధికారం కలిగి ఉంది.
రైల్వే రక్షణ దళం (ఆర్.పిఎఫ్) గురించి :
రైల్వే రక్షణ దళం (ఆర్.పి.ఎఫ్) భారతదేశంలోని రైల్వే భద్రతా రంగంలో ప్రధాన రక్షణను, చట్టాన్ని అమలు చేసే సంస్థ. 1957 సంవత్సరంలో ఫెడరల్ ఫోర్స్ గా ఏర్పాటైన ఆర్.పి.ఎఫ్. రైల్వే ఆస్తి, ప్రయాణికులతో పాటు, ప్రయాణికులు సంచరించే ప్రాంతాల భద్రతకు బాధ్యత వహిస్తుంది. ఆర్.పి.ఎఫ్. సిబ్బంది దేశానికి సేవ చేస్తారు. "సేవా- హి- సంకల్ప్"- "సేవ చేయడానికి ఒక వాగ్దానం" అనే నినాదంతో తమ విధినిర్వహణలో మమేకమై ఉంటారు. ఆర్.పి.ఎఫ్. ఇప్పుడు రైల్వే సంస్థతో పాటు, దాని వినియోగదారులు, వాటాదారుల పూర్తి భద్రతా అవసరాలకు చేదోడు వాదోడుగా ఉంటోంది. క్షేత్రస్థాయిలో సాధారణ అవసరాలకు సైతం అందుబాటులో ఉండే విధంగా వినూత్న పరిష్కారాలను కూడా ఆర్.పి.ఎఫ్. అందిస్తోంది. అత్యధిక మహిళా సిబ్బందితో ఆర్.పి.ఎఫ్., భారతదేశ సమాఖ్య శక్తిగా ప్రత్యేకతను కలిగి ఉంది.
*****
(Release ID: 1901879)
Visitor Counter : 217