ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

భారతదేశంలో డిజిటల్ అక్షరాస్యత, నైపుణ్యాభివృద్ధిని పెంపొందించే దిశగా ఒప్పందం

- అవగాహన ఒప్పందం చేసుకున్న సీఎస్సీ అకాడమీ మరియు ఎన్ఐఈఎల్ఐటీ

Posted On: 23 FEB 2023 2:45PM by PIB Hyderabad

భారత దేశంలో డిజిటల్ అక్షరాస్యత మరియు నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడానికి కామన్ సర్వీస్ సెంటర్ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ సీఎస్సీ అకాడమీ, మరియు ఎన్ఐఈఎల్ఐటీ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేశాయి.  డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించి, భారతదేశంలోని యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే కార్యక్రమాలను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి,  వాటిని అమలు చేయడానికి రెండు సంస్థల మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ఈ ఎంఓయు లక్ష్యం. ఈ అవగాహన ఒప్పందం కింద, సీఎస్సీ అకాడమీ మరియు ఎన్ఐఈఎల్ఐటీ సాంకేతికత యొక్క వివిధ రంగాలలో శిక్షణా కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి మరియు అమలు చేయడానికి కలిసి పని చేస్తాయి. ఇవి కాకుండా నైపుణ్య అభివృద్ధి, వర్చువల్ అకాడమీ, అక్రిడిటేషన్, ఫెసిలిటేషన్ సెంటర్, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, డిజిటల్ మరియు ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్, కంటెంట్ మరియు పరస్పర భాగస్వాములు, ఎన్జీఓలకు ధ్రువపత్రాలు మరియు మద్దతును అందించడం ఈ ఒప్పందంలో భాగంగా ఉండనున్నాయి.  సహకారం గురించి మాట్లాడుతూ..  ఎన్ఐఈఎల్ఐటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మదన్ మోహన్ త్రిపాఠి మాట్లాడుతూ, "భారతదేశంలో డిజిటల్ అక్షరాస్యత సమాజాన్ని సృష్టించాలి అనే మా లక్ష్యాన్ని సాధించే దిశలో సీఎస్సీ అకాడమీతో ఎమ్ఓయు ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ భాగస్వామ్యం మాకు ఒక అవకాశాన్ని అందిస్తుంది.  విస్తృతంగా దేశ యువతను చేరుకోవడానికి మరియు 21వ శతాబ్దానికి అవసరమైన కొత్త నైపుణ్యాలను పొందడంలో వారికి సహాయపడుతుంది." ఈ సందర్భంగా సీఎస్సీ ఎస్పీవీ సంస్థ ఎండీ మరియు సీఈఓ శ్రీ సంజయ్ కుమార్ రాకేష్ మాట్లాడుతూ.. "భారతదేశంలో డిజిటల్ అక్షరాస్యత మరియు నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి సమాచార సాంకేతిక రంగంలో ఒక ప్రధాన సంస్థ అయిన ఎన్ఐఈఎల్ఐటీ తో సహకార జట్టుకట్టడం మాకు సంతోషంగా ఉంది. ఈ భాగస్వామ్యం ద్వారా, దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడే నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని సృష్టించడం మా లక్ష్యం." ఈ అవగాహన ఒప్పందం సంతకాల కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ డాక్టర్ మదన్ మోహన్ త్రిపాఠి, రిజిస్ట్రార్ శ్రీ రామ్ ప్రకాష్ పాండే, అడిషనల్ డైరెక్టర్ శ్రీమతి శీతల్ చోప్రా, ఎన్‌ఐఈఎల్‌ఐటీ సంస్థ సైంటిస్ట్-సి లలిత్ దాబీ మరియు సీఎస్సీ ఎస్పీవీ సంస్థ  సీఈఓ మరియు ఎండీ శ్రీ సంజయ్ కుమార్ రాకేష్‌, సీఎస్సీ అకాడమీ సీఈఓ డా. రిషికేష్ పాటంకర్, సీఎస్సీ ఎస్పీవీ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ డాక్టర్. త్రిప్తి జైన్ తో సహా రెండు సంస్థల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

 

సీఎస్సీ అకాడమీ గురించి: సీఎస్సీ అకాడమీ అనేది కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ ఎస్పీవీ) యొక్క అనుబంధ సంస్థ మరియు భారతదేశంలోని గ్రామీణ యువతకు డిజిటల్ అక్షరాస్యత మరియు నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందిస్తోంది. దేశంలో డిజిటల్ అవగాహన విభజనను తగ్గించడం మరియు గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలను సృష్టించడం ఈ సంస్థ లక్ష్యం.

ఎన్ఐఈఎల్ఐటీ గురించి: ఎన్ఐఈఎల్ఐటీ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఒక ప్రధానమైన సంస్థ మరియు ఇది భారత ప్రభుత్వంలోని ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో అనుబంధంగా ఉంది. సంస్థ వివిధ సాంకేతిక రంగాలలో శిక్షణ మరియు ధృవీకరణ కార్యక్రమాలను అందిస్తుంది మరియు భారతదేశంలో డిజిటల్ అక్షరాస్యత సమాజాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది.

 

ఫొటో రైటప్ః భారతదేశంలో డిజిటల్ అక్షరాస్యత మరియు నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడానికి సీఎస్సీ అకాడమీ మరియు ఎన్ఐఈఎల్ఐటీ మధ్య అవగాహన ఒప్పందం

 

***(Release ID: 1901877) Visitor Counter : 191


Read this release in: English , Urdu , Hindi , Tamil