రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
జాతీయ రహదారి నిర్మాణంలో ఫాస్ఫర్-జిప్సమ్ వినియోగాన్ని అన్వేషిస్తున్న - ఎన్.హెచ్.ఏ.ఐ.
Posted On:
22 FEB 2023 5:04PM by PIB Hyderabad
పర్యావరణపరంగా స్థిరమైన జాతీయ రహదారి మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, వ్యర్థ పదార్థాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, ఎన్.హెచ్.ఏ.ఐ. నిబద్ధతతో తన కృషిని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా, కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ కు చెందిన ఎరువుల విభాగంతో కలిసి జిప్సం వినియోగంలో వృత్తాకార ఆర్థిక వ్యవస్థను సాధించేందుకు జాతీయ రహదారి నిర్మాణంలో ఫాస్ఫర్-జిప్సమ్ ను ఉపయోగించడం కోసం, ఎన్.హెచ్.ఏ.ఐ. వివిధ ప్రాజెక్టులపై క్షేత్ర స్థాయి ప్రయోగాలు చేపట్టనుంది.
ఫాస్ఫర్-జిప్సం అనేది ఎరువుల ఉత్పత్తిలో ఒక ఉప ఉత్పత్తి. ఒక భారతీయ ఎరువుల కంపెనీ ఫాస్ఫర్-జిప్సమ్ తో ఒక రహదారిని నిర్మించింది. కేంద్ర రహదారి పరిశోధనా సంస్థ (సి.ఆర్.ఆర్.ఐ) ఆ రహదారిని క్షుణ్ణంగా పరీక్షించింది, ఆ సంస్థ సమర్పించిన నివేదిక ఆధారంగా, తటస్థీకరించిన ఫాస్ఫర్-జిప్సమ్ వ్యర్థ పదార్థాలను మూడు సంవత్సరాల పాటు రహదారి నిర్మాణం కోసం ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐ.ఆర్.సి) గుర్తించింది.
జాతీయ రహదారిపై ఫాస్ఫర్-జిప్సమ్ పనితీరును అంచనా వేయడం తో పాటు, రహదారుల నిర్మాణంలో ఫాస్ఫర్-జిప్సమ్ వ్యర్థ పదార్థాల వినియోగం పై వివిధ వాటాదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి, ఏదైనా ఒక ఎన్.హెచ్.ఏ.ఐ. ప్రాజెక్టు పై క్షేత్ర స్థాయి ప్రయత్నాలు చేపట్టాలని ఎరువుల కంపెనీ తో పాటు, సి.ఆర్.ఆర్.ఐ. ని కోరడం జరిగింది.
రోడ్డు నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాల వాడకాన్ని కూడా ఎన్.హెచ్.ఏ.ఐ. ప్రోత్సహిస్తోంది. ఇది ఇప్పటికే చాలా విజయవంతంగా పరీక్షించబడింది. ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి నిర్మించిన రోడ్లు మన్నికైనవి, స్థిరమైనవి, తారు మన్నికను పెంచుతాయని అధ్యయనాలు నిర్ధారించాయి. ఒక కిలోమీటరు మేర నాలుగు వరుసల రహదారి నిర్మించడానికి సుమారు ఏడు టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సద్వినియోగ మవుతాయి.
అదేవిధంగా, హైవేలు, ఫ్లై ఓవర్ కట్టల నిర్మాణం కోసం థర్మల్ పవర్ ప్లాంట్ల లో (టి.పి.పి.లు) బొగ్గు దహనం కారణంగా వచ్చే ‘ఫ్లై యాష్’ వంటి చక్కటి అవశేషాలను ఎన్.హెచ్.ఏ.ఐ. ఉపయోగించింది. 135 కి.మీ పొడవు, ఆరు వరుసల "ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వే” నిర్మాణంలో 1.2 కోట్ల ఘనపు మీటర్ల ఫ్లై-యాష్ ని ఉపయోగించారు.
కొత్త పదార్థాల వినూత్న వినియోగాన్ని ఎన్.హెచ్.ఏ.ఐ. ప్రోత్సహిస్తోంది. కార్బన్ వినియోగాన్ని తగ్గించడం, మన్నికను పెంచడం, నిర్మాణాన్ని మరింత పొదుపుగా చేయడంపై ఎన్.హెచ్.ఏ.ఐ. దృష్టి సారించింది.
*****
(Release ID: 1901621)
Visitor Counter : 193