వ్యవసాయ మంత్రిత్వ శాఖ
పుడమి సంరక్షణ బాధ్యతకు ప్రతి ఒక్కరూ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
'మితిమీరిన రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకం వల్ల ఇప్పటికే పర్యావరణం, భూసారం దెబ్బతిన్నాయి'.. శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
ప్రధానమంత్రి సూచన మేరకు ప్రకృతి వ్యవసాయ విధానాలు అమలు కావాలి.. శ్రీ చౌహాన్
జీ-20 వ్యవసాయ వర్కింగ్ గ్రూప్ మొదటి అగ్రికల్చర్ డిప్యూటీల సమావేశాన్ని ఇండోర్ లో ప్రారంభించిన శ్రీ చౌహాన్
Posted On:
13 FEB 2023 7:38PM by PIB Hyderabad
పుడమి సంరక్షణ బాధ్యతకు ప్రతి ఒక్కరూ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
"పంటల దిగుబడి ఎక్కువ చేయడానికి మితిమీరిన రసాయన ఎరువులు, సరికి సంహారక మందుల వాడకం వల్ల భూసారం ఇప్పటికే తగ్గింది. దీనివల్ల కలిగే దుష్ప్రభావం ప్రజల ఆరోగ్యంపై కూడా పడుతుంది." అని శ్రీ చౌహాన్ అన్నారు. ఈరోజు ఇండోర్‌లో జీ-20 అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్ తొలిసారిగా జరిగిన అగ్రికల్చర్ డిప్యూటీస్ సమావేశాన్ని శ్రీ చౌహాన్ ప్రారంభించారు. తన ప్రారంభ ఉపన్యాసంలో పర్యావరణహిత సాంకేతిక వినియోగం పెరగాలని శ్రీ చౌహాన్ అన్నారు. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన సహజ వ్యవసాయ పద్ధతులు అవలంభించాలని ఆయన సూచించారు.
' ప్రకృతి దోపిడీకి గురి కాకూడదు. సహజ వనరుల వినియోగం అవసరాల మేరకు మాత్రమే జరగాలి. మానవులు, జంతువులు, పక్షులు జీవించే విధంగా ప్రర్యావరణ సమతుల్యత సాధించాలి అని భారతదేశం తొలుత నుంచి భావిస్తోంది' అని శ్రీ చౌహాన్ అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతున్నదని పేర్కొన్న శ్రీ చౌహన్ ప్రజలందరికీ ఆహార భద్రత అందించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ' ప్రపంచంలో 12 శాతం భూమి మాత్రమే వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. 2030 నాటికి ఆహార ధాన్యాల వినియోగం 345 మిలియన్ టన్నులకు చేరే అవకాశం ఉంది. 2000 సంవత్సరంలో 196 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల వినియోగం జరిగింది. వ్యవసాయం సాగించడానికి అనుకూలంగా ఉండే భూమి విస్తీర్ణం పెరిగే అవకాశం లేదు. అదేవిధంగా సహజ వనరుల లభ్యత కూడా పెరిగే అవకాశం లేదు' అని సి చౌహాన్ అన్నారు.
వ్యవసాయ భూముల్లో దిగుబడి పెరిగేలా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని శ్రీ చౌహన్ అన్నారు. 'దిగుబడి ఎక్కువ చేయడానికి యంత్రాల వినియోగం, డిజిటలీకరణ, నూతన సాంకేతిక వినియోగం పెరగాలి. అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఎక్కువగా ఉపయోగించాలి' అని శ్రీ చౌహన్ వివరించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత 1ఓ సంవత్సరాల కాలంలో వ్యవసాయ దిగుబడులు పెరిగాయని శ్రీ చౌహన్ తెలిపారు.
“దేశ ఆహార ధాన్యాల అవసరాలను తీర్చడంలో రాష్ట్రం గణనీయమైన కృషి చేసింది. నూనె గింజల ఉత్పత్తిలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. దేశంలో సోయా ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ 60 శాతం భాగస్వామ్యం కలిగి ఉంది. మధ్యప్రదేశ్ దేశంలోనే గోధుమలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది. రాష్ట్రంలో ఉత్పత్తిని పెంచేందుకు అన్ని విధాలా కృషి చేశాం. ఇందులో సాగునీటి విస్తీర్ణాన్ని పెంచే పనులు చేపట్టడం గుర్తించాల్సిన అంశం. . 2003లో రాష్ట్రంలో కేవలం 7.5 లక్షల హెక్టార్లకు మాత్రమే సాగునీరు అందేది. ఇప్పుడు 45 లక్షల హెక్టార్లకు సాగునీరు సరఫరా అవుతోంది. 65 లక్షల హెక్టార్ల భూమికి సాగునీటి సౌకర్యం కల్పించడం లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఉత్పత్తిని పెంచేందుకు రాష్ట్రంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం, మంచి విత్తనాలు వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాము.'అని శ్రీ చౌహాన్ చెప్పారు.
ఉత్పత్తిని పెంచడంతో పాటు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం కూడా అవసరం అని శ్రీ చౌహాన్ పేర్కొన్నారు.
“ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి, వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడానికి రైతులకు అవసరమైన సహాయాన్ని అందించడానికి ప్రధాన మంత్రి శ్రీ మోదీ నాయకత్వంలో నిరంతర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా సాంకేతికత , యాంత్రీకరణ ఉపయోగించడంతో రైతులకు సహాయం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైతులకు సున్నా శాతం వడ్డీకే రుణాలు అందుతున్నాయి. ప్రధాని మోదీ చొరవతో ప్రతి సంవత్సరం రైతులకు నిర్ణీత మొత్తాన్ని కిసాన్ సమ్మాన్ నిధి లో అందుబాటులో ఉంచుతున్నారు. ఇందులో మధ్యప్రదేశ్ కూడా తన సొంత మొత్తాన్ని జోడించింది. వ్యవసాయానికి అయ్యే ఖర్చులో రైతును ఆదుకోవడమే దీని లక్ష్యం' అని ఆయన అన్నారు.
రైతులు వారి ఉత్పత్తులకు సరైన ధర పొందేలా చూడడానికి చర్యలు అవసరం అని శ్రీ చౌహాన్ అన్నారు.
“పంటలకు కనీస మద్దతు ధర చెల్లించే విధానం భారతదేశంలో అమలు జరుగుతోంది. దీంతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులను ఆదుకోవడంలో చురుకుగా పనిచేస్తున్నాయి.' అని శ్రీ చౌహాన్ తెలిపారు.
సంప్రదాయ చిరు ధాన్యాలకు ప్రోత్సాహం అందించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నిర్ణయించారని శ్రీ చౌహాన్ అన్నారు.
“చిరుధాన్యాలకు ప్రధాని మోదీ “శ్రీ అన్న” అని పేరు పెట్టారు. ఐక్యరాజ్య సమితి కూడా ఈ సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించింది. పోషక విలువలున్న ఈ గింజలు భూమి నుంచి కనుమరుగై పోకుండా ఉండేందుకు మనమంతా కృషి చేద్దాం'' అని ఆయన అన్నారు.
సమావేశంలో భాగంగా చిరు ధాన్యాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ వ్యవసాయం , అనుబంధ రంగాలు సాధించిన ప్రగతి , విజయాలు పురోగతిని ప్రదర్శించే ఒక ప్రదర్శనను కూడా శ్రీ చౌహాన్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి వివిధ స్టాళ్లను సందర్శించి వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించారు. ఎగ్జిబిషన్‌లో చిరు ధాన్యాలతో పాటు పశుసంవర్ధక, మత్స్యశాఖఏర్పాటు చేసిన ప్రదర్శనలు , విలువ ఆధారిత ఆహార ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మూడు రోజుల పాటు జరిగే సమావేశాల మొదటి రోజున జీ-20 కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరు, ఆహార భద్రతపై వాతావరణ స్మార్ట్ వ్యవసాయంపై ప్రపంచ సదస్సు జరిగాయి. ప్రతినిధులతో పాటు కార్యక్రమంలో వివిధ సంస్థలు, ప్రముఖులు పాల్గొన్నారు.
సమావేశం ముగిసిన తర్వాత కిసాన్ మేళా, లైవ్ కౌంటర్, , స్థానిక సంస్కృతి , వంటకాల రుచి ఆస్వాదించిన ప్రతినిధులు సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు.
రాజ్‌వాడ ప్యాలెస్‌లో హెరిటేజ్ వాక్‌తో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రతినిధులకు 18 వ శతాబ్దంలో హోల్కర్లు నిర్మించిన ప్యాలెస్ చరిత్ర తెలుసుకునే అవకాశం లభించింది .
కేంద్ర పౌర విమానయాన, ఉక్కు మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా రేపు సదస్సులో ప్రసంగిస్తారు. ఆ తర్వాత పాల్గొనే సభ్యులు, అంతర్జాతీయ సంస్థల మధ్య సాధారణ చర్చలు జరుగుతాయి.
మూడవ రోజున కీలక అంశాలపై వర్కింగ్ గ్రూప్ చర్చలు జరుపుతుంది. దీనిలో భాగంగా జరిగే సాంకేతిక సదస్సులో సంబంధిత సభ్యులు ,అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు.
భారతదేశం అధ్యక్షత వహిస్తున్న జీ-20 సమావేశాల్లో భాగంగా ఏర్పాటైన కార్యక్రమాన్నికేంద్ర వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఆధ్వర్యంలో కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ నిర్వహిస్తోంది. దీనిలో జీ -20 సభ్య దేశాలు, అతిథి దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులుపాల్గొంటున్నారు.
***
(Release ID: 1899009)
Visitor Counter : 300