ఆయుష్
సాక్ష్యం ఆధారిత పరిశోధనలను ప్రోత్సహించడం ద్వారా సాంప్రదాయ వైద్య విధానాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉంది - శ్రీ సర్బానంద సోనోవాల్
యునాని వైద్యంపై అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన ఆయుష్ మంత్రి
యునాని మెడిసిన్‌లో సాధారణ చికిత్సలకు సిసిఆర్‌యుఎం అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ ఆవిష్కరణ
Posted On:
11 FEB 2023 4:03PM by PIB Hyderabad
సాంప్రదాయ వైద్య రంగంలో ప్రపంచంలో భారతదేశం ఎలా అగ్రగామిగా ఉందో కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ వివరించారు. ఆయుష్ రంగంలో సాక్ష్యాధారాల ఆధారిత శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన యునానీ దినోత్సవం 2023 మరియు అంతర్జాతీయ సదస్సు అధికారిక ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు, కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా, ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ ప్రమోద్ కుమార్ పాఠక్, ఆయుష్ మంత్రిత్వ శాఖ జాయింట్ అడ్వైజర్ (యునాని) డాక్టర్. ఎం. ఏ. ఖాస్మీ, సిసిఆర్‌యుఎం డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్. అసిమ్ అలీ ఖాన్ మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ నుండి ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ “మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారతదేశం డబ్ల్యుహెచ్‌ఓ జీసీటీఎం స్థాపనకు శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోని సాంప్రదాయ వైద్యంలో మనం నాయకత్వ పాత్ర పోషిస్తున్నామని ఇది సూచిస్తుంది. ఈ క్రమంలో మన పరిశోధనా సామర్థ్యాలు మరియు విద్యా సౌకర్యాలను బలోపేతం చేయాలి. పరిశోధనలను బలోపేతం చేయడానికి కృషి చేయాలి" అని తెలిపారు.
కేంద్ర బడ్జెట్‌లో ఆయుష్ మంత్రిత్వ శాఖకు బడ్జెట్‌ను గణనీయంగా 20% పెంచినందున సంపూర్ణ రోగుల సంరక్షణ వ్యవస్థ దిశగా బలమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్మించాలనే ప్రధానమంత్రి సంకల్పం బలంగా ఉందని ఆయన అన్నారు. యునాని వైద్యవిధానానికి అపారమైన మద్దతు లభించిందని ఇది 2014 సంవత్సరం నుండి అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల యునాని వైద్యంలో అతిపెద్ద ఇన్‌స్టిట్యూట్ అయిన ఘజియాబాద్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ మన ప్రధాని చేత ప్రారంభించబడిందని చెప్పారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజు ప్రసంగిస్తూ “యునాని వైద్య విధానం భారతదేశపు గొప్ప సాంప్రదాయ వైద్య విధానం. కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఆయుష్ ఆధారిత చికిత్సలు ఎలా ఉపశమనాన్ని అందించాయో మనం చూశాము. మన సుసంపన్నమైన సాంప్రదాయ ఔషధ పద్ధతులు దేశంలోని మానవ జీవితాలను సుసంపన్నం చేయడానికి ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందించగలవు" అని తెలిపారు.
స్వాతంత్ర్య సమరయోధుడు హకీమ్ అజ్మల్ ఖాన్‌కు ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్ నివాళులర్పించారు. యునాని మెడిసిన్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు వ్యాధులను నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు సంబంధించిన వివరణాత్మక మార్గదర్శకాలను అందజేస్తుందని ఆయన అన్నారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా మాట్లాడుతూ " ఆయుష్ సిస్టమ్‌లకు ఎక్కువ ఆమోదం పొందడంలో ఎన్‌ఏబిహెచ్ క్యూసిఐ నాణ్యత ధృవీకరణ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ 2023 నాటికి 12,500 ఆయుష్ వెల్‌నెస్ సెంటర్‌లకు ఎంట్రీ లెవల్ ఎన్‌ఏతబిహెచ్ సర్టిఫికేషన్ పొందాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోందని" పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్ (సిసిఆర్‌యుఎం), అంతర్జాతీయ సదస్సు సావనీర్, ఆన్‌లైన్ జర్నల్‌ను విడుదల చేశారు. అలాగే, రెండు సిసిఆర్‌యుఎం ఇన్‌స్టిట్యూట్‌లకు ఎన్‌ఏబిహెచ్ సర్టిఫికేట్ ఇవ్వబడింది. యునాని మెడిసిన్‌లో సాధారణ చికిత్సలపై సిసిఆర్‌యుఎం అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ కూడా ఈరోజు ప్రారంభించబడింది.
సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునాని మెడిసిన్ హైబ్రిడ్ మోడ్‌లో యునాని మెడిసిన్‌పై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును కూడా నిర్వహిస్తోంది. సదస్సులో దాదాపు 1300 మంది ప్రతినిధులు, రిసోర్స్ పర్సన్లు, విద్యావేత్తలు, పరిశోధకులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొంటున్నారు.
*****
(Release ID: 1898382)
Visitor Counter : 190