పర్యటక మంత్రిత్వ శాఖ
పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన 2023 ఫిబ్రవరి 7 నుంచి 9 వరకూ గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్‌లో జి-20 పర్యాటక కార్యాచరణ బృందం తొలి సమావేశం
జి-20 అధ్యక్షత కాలంలో పర్యాటక రంగంలోని 5 ప్రాధాన్య రంగాలకు ఉత్తేజం;
హరిత పర్యాటక రంగంగా మార్పు.. డిజిటల్ శక్తి వినియోగం.. యువతకు నైపుణ్య సాధికారత కల్పన.. పర్యాటక ‘ఎంఎస్‌ఎంఇ'లు/అంకుర సంస్థల సంరక్షణ.. పర్యాటక గమ్యస్థానాల వ్యూహాత్మక నిర్వహణ: పర్యాటక కార్యదర్శి ప్రకటన
Posted On:
03 FEB 2023 6:47PM by PIB Hyderabad
జి-20 చట్రం కింద తన పరిధిలోని పర్యాటక కార్యాచరణ బృందం తొలి సమావేశాన్ని 2023 ఫిబ్రవరి 7 నుంచి 9 వరకూ గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్‌లో కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ నిర్వహించనుంది. దీనికి సంబంధించిన వివరాలను ఆ శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్ న్యూఢిల్లీలో ఇవాళ విలేకరులకు వెల్లడించారు.
భారత జి-20 అధ్యక్షత కాలంలో పర్యాటక రంగానికి సంబంధించి 5 అంతర్గత ప్రాధాన్య రంగాలున్నాయని ఆయన తెలిపారు. తదనుగుణంగా “పర్యాటక రంగాన్ని పచ్చగా మార్చడం, డిజిటల్ శక్తి వినియోగం, యువతకు నైపుణ్య సాధికారత కల్పన, పర్యాటక ‘ఎంఎస్‌ఎంఇ’/అంకుర సంస్థల సంరక్షణ, పర్యాటక గమ్యాల వ్యూహాత్మక నిర్వహణపై పునరాలోచన” వగైరాలపై నిశితంగా దృష్టి కేంద్రీకరిస్తామని ఆయన విశదీకరించారు. ఇందులో భాగంగా కార్యాచరణ బృందం తొలి సమావేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా గ్రామీణ-పురావస్తు పర్యాటకంపై అనుబంధ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అదే సమయంలో విదేశీ ప్రతినిధులకు భారతీయ పర్యాటక విజయగాథలను ప్రదర్శిస్తామని చెప్పారు.
సుస్థిర ప్రగతి లక్ష్యాలను 2030 నాటికల్లా సాధించే మార్గాలపై ఏకాభిప్రాయ సాధన జి-20 వేదికకుగల ప్రాథమ్యాలలో ఒకటని కార్యదర్శి వెల్లడించారు. ఆ మేరకు పర్యావరణానికి మాత్రమేగాక స్థానిక వ్యాపార సంస్థలకు అవకాశాల సృష్టికీ కీలకమైన సుస్థిర పర్యాటకానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. భారత పర్యాటక సామర్థ్యంపై ప్రపంచ స్థాయిలో అవగాహన పెంచడానికి జి-20 దోహదం చేస్తుందని శ్రీ అరవింద్ సింగ్ పేర్కొన్నారు. తదనుగుణంగా సమావేశాలకు హాజరయ్యే విదేశీ ప్రతినిధులకు భారతీయ సంస్కృతిని తెలిపేలా పర్యాటక ప్రదేశాల సందర్శన ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో భాగంగా రాన్ ఆఫ్ కచ్ సమావేశం సందర్భంగా వారిని యునెస్కో ప్రపంచ వారసత్వ పర్యాటక ప్రదేశం ధోలావీరకు తీసుకెళ్తామని తెలిపారు. తద్వారా మన దేశ పౌరులే కాకుండా విదేశీ ప్రజలు ఇలాంటి ప్రదేశాల గురించి తెలుసుకుంటారని, దీనివల్ల పర్యాటక రంగ ప్రగతికి ఉత్తేజం లభిస్తుందని పేర్కొన్నారు.
స్థానిక ప్రజల్లో… ముఖ్యంగా పర్యాటక తాకిడిని నిభాయించగల యువతరంలో ఆతిథ్య-నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరచడం కూడా కార్యాచరణలో ఒక భాగమని కార్యదర్శి తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2023-24లోని ముఖ్యాంశాలలో కూడా ఇదొక ప్రాధాన్యం కావడం గమనార్హం. ప్రతినిధుల సమక్షంలో స్థానిక కళా-హస్తకళల ప్రత్యక్ష ప్రదర్శనలు ఉంటాయని, అలాగే ఒక జిల్లా-ఒక ఉత్పత్తి కార్యక్రమం కింద వారికి వీడ్కోలు బహుమతులు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. శ్రీ అరవింద్ సింగ్ మరికొన్ని వివరాలు తెలుపుతూ- భారత జి-20 అధ్యక్షతను సద్వినియోగం చేసుకుంటూ 3 పర్యాటక సంబంధ భారీ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ మేరకు జి-20 సంబంధిత కార్యక్రమాలతోపాటు ఏప్రిల్‌లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు, ‘ఎంఐసిఇ’ సదస్సు, ప్రపంచ పర్యాటక సీఈవోల వేదిక సమావేశం నిర్వహిస్తామని వివరించారు.
జి-20 శిఖరాగ్ర సదస్సు ముగింపు సందర్భంగా- దానికిముందు జరిగే సమావేశాల్లో వివిధ దేశాలు ఆమోదించిన మంత్రుల స్థాయి దిశానిర్దేశ తీర్మానాన్ని సమర్పిస్తామని శ్రీ అరవింద్ సింగ్ తెలిపారు. జి-20 కార్యక్రమాల కోసం ఎంచుకున్న వివిధ ప్రదేశాలు గ్రామీణ, పురావస్తు, చారిత్రక వగైరా విభిన్న ఆకర్షణీయాంశాలతో కూడినవై ఉంటాయి.
*****
(Release ID: 1896204)
Visitor Counter : 289