ప్రధాన మంత్రి కార్యాలయం

రాజస్తాన్ లోని భిల్వారాలో భగవాన్ శ్రీ దేవనారాయణ్ జీ 1111వ అవతరణ మహోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ఆంగ్ల ప్రసంగం పూర్తి పాఠం

Posted On: 28 JAN 2023 3:25PM by PIB Hyderabad

మాలాసెరీ దుంగారీకీ జై, మాలాసెరీ దుంగారీ కీ జై!

సాదు మాతాకీ  జై, సాదు మాతా కీ జై!

సవాయ్ భోజ్ మహరాజ్ కీ జై, సవాయ్ భోజ్ మహరాజ్ కీ జై!

దేవనారాయణ్ భగవాన్ కీ జై, దేవనారాయణ్ భగవాన్ కీ జై!

 

‘కర్మభూమి’ పట్ల అపారమైన భక్తివిశ్వాసాలు గల యోధురాలు  సాధుమాత సన్యాసానికి పుట్టినిల్లు, భగవాన్ దేవనారాయణ్, మాలాసెరీ దుంగారిల జన్మస్థలం అయిన భూమికి నేను శిరసు వంచి అభివందనం చేస్తున్నాను.

శ్రీ హేమరాజ్ జీ గుర్జార్, శ్రీ సురేష్ దాస్ జీ, శ్రీ దీపక్ పాటిల్ జీ, శ్రీ రామ్ ప్రసాద్ ధబాయ్ జీ, శ్రీ అర్జున్ మేఘ్ వాల్ జీ, శ్రీ సుభాష్ బహేరియాజీ, దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన సోదరి సోదరీమణులారా!

ఈ పవిత్ర కార్యక్రమం సందర్భాన్ని పురస్కరించుకుని భగవాన్ దేవనారాయణ్ జీ పిలుపు వచ్చింది. భగవాన్ దేవనారాయణ్ పిలుపు వస్తే ఎవరైనా అలాంటి అవకాశం వదులుకుంటారా? అందుకే నేను నేడు మీ అందరి మధ్య ఉన్నాను.  ఇక్కడకు వచ్చింది ఒక ప్రధానమంత్రి కాదని మీరు గుర్తుంచుకోవాలి. మీ వంటి వారందరి ఆశీస్సులు అందుకోవాలనే సంపూర్ణ అంకిత భావంతో నేను ఇక్కడకు వచ్చాను. ‘యజ్ఞస్థల’లో ప్రార్థనలు చేసే అదృష్టం కూడా నాకు కలిగింది. నా వంటి సామాన్య మనిషికి నేడు భగవాన్ దేవనారాయణ్ జీ, ఆయన భక్తుల ఆశీస్సులు లభించడం చాలా అదృష్టం. భగవాన్ దేవనారాయణ్, ఆయన భక్తుల ‘దర్శనం’ లభించడం నా అదృష్టం. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వలెనే నేను కూడా జాతికి, పేదల సంక్షేమానికి నిరంతరం సేవ చేసే భాగ్యం కలిగేందుకు భగవాన్ దేవనారాయణ్, ఆయన భక్తుల ఆశీస్సుల కోసం వచ్చాను.

మిత్రులారా,

ఇది భగవాన్ దేవనారాయణ్ జీ 1111వ అవతరణ మహోత్సవం. ఈ సందర్భంగా వారం రోజుల పాటు వేడుకలు జరుగనున్నాయి. వైభవానికి, పవిత్రతకు మారుపేరైన ఈ వేడుకకు ఇంత భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యేలా చూడడానికి గుర్జార్ తెగ ప్రజలు ఎంతో శ్రమించారు. మీలో ప్రతీ ఒక్కరికీ నేను అభినందనలు తెలియచేస్తున్నాను. 

సోదరసోదరీమణులారా,

వేలాది సంవత్సరాల నాటి మన ప్రాచీన చరిత్ర, నాగరికత, సంస్కృతి పట్ల భారతీయులందరం గర్వపడతాం. ప్రపంచంలోని చాలా నాగరికతలు కాలంతో పాటు మారలేక అంతరించిపోయాయి. భారతదేశ  భౌగోళిక, సాంస్కృతిక, సామరస్యపూర్వక వాతావరణాన్ని, సమర్థతను విచ్ఛిన్నం చేయడానికి పలు ప్రయత్నాలు జరిగాయి. అందుకే భారతదేశం నేడు సముజ్వల భవితకు పునాదులు నిర్మిస్తోంది. దాని వెనుకనున్న స్ఫూర్తి, శక్తి ఏమిటో మీకు తెలుసా?  ఎవరి శక్తి, ఆశీస్సులతో భారతదేశం నిలకడగా, వినాశరహితంగా నిలిచిపోయిందో తెలుసా?

 

నా సోదర సోదరీమణులారా,

అదంతా మన సమాజం అందించిన శక్తి, కోట్లాది మంది దేశ ప్రజల శక్తి. భారతదేశ వేలాది సంవత్సరాల చరిత్రలో సామాజిక శక్తి కీలకపాత్ర పోషించింది. ప్రతీ కీలక  సమయంలోనూ అలాంటి శక్తి ఒకటి మన సమాజంలో ఆవిర్భవించి యావత్ దేశానికి దారి చూపుతుంది, అందరికీ సంక్షేమం తీసుకువస్తుంది. భగవాన్ దేవనారాయణ్  కూడా అలాంటి శక్తుల్లో ఒకరు. అణచివేత శక్తుల నుంచి మన జీవితాలను, సంస్కృతిని కాపాడిన అవతార స్వరూపం. 31 సంవత్సరాల వయసులోనే ఆయన శాశ్వత కీర్తిని గడించారు. సామరస్య స్ఫూర్తితో సమాజాన్ని ఐక్యం చేసి సామరస్యత శక్తి ఏమిటో చాటి చెప్పారు. సమాజంలోని విభిన్న వర్గాలను  ఐక్యం చేసి ఆదర్శవంతమైన వ్యవస్థను నిర్మించేందుకు కృషి చేశారు. భగవాన్ దేవనారాయణ్ పట్ల సమాజానికి గౌరవం, విశ్వాసం ఏర్పడడానికిదే కారణం. అందుకే ప్రజా జీవితంలో ప్రతీ కుటుంబం ఇప్పటికీ భగవాన్ దేవనారాయణ్ ను తమ కుటుంబ పెద్దగా పరిగణించి ఆనందాన్ని, బాధలను ఆయనతోనే పంచుకుంటారు.

 

సోదరసోదరీమణులారా,

భగవాన్  దేవనారాయణ్ సేవ, సమాజ సంక్షేమానికే ఎల్లప్పుడూ అగ్ర ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతీ భక్తుడూ ఇక్కడ నుంచి ఒక పాఠం, ఒక స్ఫూర్తితో వెళ్తాడు. ఆయనతో అనుబంధం గల కుటుంబానికి లోటనేదే ఉండదు. బదులుగా సౌకర్యాలే ఉంటాయి. సేవ, సామాజిక సంక్షేమం కోసం ఆయన క్లిష్టమైన దారి ఎంచుకున్నారు. మానవాళి సంక్షేమం కోసం  ఆయన తన శక్తిని ఉపయోగించారు.

 

సోదరసోదరీమణులారా,

‘భళా జీ భళా, దేవ భళా’, ‘భళా జీ భళా, దేవ భళా’. ఈ ప్రకటనలో ధర్మం, సంక్షేమం పట్ల ఆకాంక్ష ఉంది. ‘సబ్ కా వికాస్’ (అందరి అభివృద్ధి), ‘సబ్ కా సాత్’ (అందరి మద్దతుతో) భగవాన్ దేవనారాయణ్ చూపిన బాట. నేడు దేశం అదే బాటలో నడుస్తోంది. గత 8-9 సంవత్సరాలుగా సమాజంలోని ప్రతీ ఒక్క వర్గాన్ని...సమాజంలో నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురవుతున్న వర్గాలను సాధికారం చేయడానికి దేశం కృషి చేస్తోంది. సమాజంలో నిరాదరణకు గురవుతున్న వర్గాలకు ప్రాధాన్యం కల్పించే బాటలోనే మేం ప్రయాణం సాగిస్తున్నాం. ఎవరు అడిగినా తమకు రేషన్ వస్తుందా, రాదా...వచ్చేటట్టయితే ఎంత లభిస్తుంది అనేదే పేదలందరి ప్రధాన ఆవేదన అన్న అంశం మీకు గుర్తు వస్తుంది. కాని నేడు ప్రతీ లబ్ధిదారుడు పూర్తి రేషన్ అది కూడా ఉచితంగా అందుకుంటున్నారు. రోగాలు వస్తే చికిత్సకు సంబంధించిన ప్రజల ఆవేదనలను కూడా మేం ఆయుష్మాన్  భారత్ పథకం  ద్వారా తీర్చగలిగాం. పేదలకు ఇళ్లు, మరుగుదొడ్డి, విద్యుత్, గ్యాస్, కనెక్షన్ వంటి ఆందోళనలు తీర్చేందుకు కూడా కృషి చేస్తున్నాం. బ్యాంకింగ్ లావాదేవీలు కూడా కొద్ది మందికే పరిమితంగా ఉండేవి. నేడు బ్యాంకుల తలుపులు ప్రతీ ఒక్కరికీ తెరుచుకున్నాయి.

 

మిత్రులారా,

నీటి ప్రాధాన్యత ఏమిటో రాజస్తాన్ కన్నా ఎవరికి బాగా తెలుసు? వాస్తవానికి దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన పలు దశాబ్దాల అనంతరం సైతం కేవలం మూడు కోట్ల కుటుంబాలకు మాత్రమే పంపుల ద్వారా నీటి సరఫరా సదుపాయం ఉండేది. 16 కోట్లకు పైగా గ్రామీణ గృహాలు నీటి కోసం నిత్యపోరాటం చేయాల్సివచ్చేది. కాని గత మూడున్నర సంవత్సరాలుగా దేశంలో జరిగిన ప్రయత్నాల వల్ల నేడు 11 కోట్లకు పైగా కుటుంబాలకు పైప్ నీరు అందుబాటులోకి వచ్చింది. రైతుల వ్యవసాయ క్షేత్రాలన్నింటికీ నీరందించేందుకు విస్తృతంగా కృషి జరుగుతోంది. నీటి సరఫరా కోసం సాంప్రదాయిక పథకాల విస్తరణ కావచ్చు లేదా కొత్త టెక్నాలజీ ఉపయోగించి నీటి పారుదల వసతులు కల్పించడం కావచ్చు...నేడు రైతులకు అన్ని విధాల సహకారం అందించే ప్రయత్నం జరుగుతోంది. ఒకప్పుడు ప్రభుత్వ సహాయం కోసం అర్రులు చాచిన రైతులే నేడు పిఎం కిసాన్ సమ్మాన్ సహాయంతో తొలిసారిగా నేరుగా సహాయం అందుకుంటున్నారు. రాజస్తాన్ లో కూడా రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.15,000 కోట్లకు పైగా సహాయం అందింది.

 

మిత్రులారా,

భగవాన్ దేవనారాయణ్ సామాజిక సేవ,  సమాజ సాధికారతకు ‘గౌ సేవ’ (గోవులకు సేవ) మాధ్యమంగా ఎంచుకున్నారు.  గత కొద్ది సంవత్సరాల కాలంలో ‘గౌ సేవ’ దేశంలో క్రమంగా బలపడుతోంది. మన పశుగణం డెక్కలు-నోరు, గిట్టలు-నోటి సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నరాయి. కోట్లాది గోవులు, పశు  సంపదకు ఈ వ్యాధుల నుంచి రక్షణ కల్పించేందుకు దేశంలో భారీ ఎత్తున టీకాల కార్యక్రమం అమలు జరుగుతోంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా గోవుల సంక్షేమం కోసం రాష్ర్టీయ కామధేను కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ర్టీయ గోకుల్ మిషన్ కింద శాస్ర్తీయ విధానాల ద్వారా పశు  సంరక్షణను ప్రోత్సహించేందుకు గట్టి ప్రయత్నం జరుగుతోంది. పశు సంపద అనేది మన సాంప్రదాయం, విశ్వాసాల్లోనే కాదు, మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కూడా శక్తివంతమైన భాగంగా ఉంది. అందుకే గోవుల పెంపకందారులకు కూడా చరిత్రలో తొలిసారిగా కిసాన్ క్రెడిట్ కార్డుల సదుపాయం కల్పించడం జరిగింది. నేడు దేశం మొత్తంలో గోవర్థన్ యోజన అమలు జరుగుతోంది. గోవుల పేడ సహా వ్యవసాయ వ్యర్థాలన్నింటినీ సంపదగా మార్చేందుకు కృషి జరుగుతోంది.  పశువుల పేడ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా మన డెయిరీ ప్లాంట్లను నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

మిత్రులారా,

గత సంవత్సరం నేను స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి  ‘పంచప్రాణ’ (ఐదు ప్రతినలు) పిలుపు ఇచ్చాను. మనందరం మన వారసత్వం పట్ల గర్వపడుతూ బానిస మనస్తత్వం నుంచి వెలుపలికి వచ్చి దేశం పట్ల మన బాధ్యతలను గుర్తించాలన్నదే దాని ప్రధాన లక్ష్యం. మన రుషులు చూపిన బాటలో నడుస్తూ దేశం కోసం అత్యున్నత త్యాగాలు చేసిన సాహస వీరుల ధైర్యం గుర్తు చేసుకోవాలన్నది కూడా  ఇందులో భాగం. రాజస్తాన్ వారసత్వానికి పుట్టినిల్లు వంటి  ప్రదేశం. ఇక్కడ సృజనాత్మకత, ఉత్సాహం, వేడుకలున్నాయి. కష్టించి శ్రమించడంతో పాటు ధార్మిక గుణం కూడా ఉంది. సాహసం అనేది ఇంటింటిలోనూ కనిపిస్తుంది. కళ, సంగీతాలకు రాజస్తాన్ సర్వవిదితమైన ప్రదేశం. పోరాటం, ప్రతిఘటన ప్రజల నరనరాల్లోనూ కనిపిస్తాయి. భారతదేశానికి చెందిన పలు మహోజ్వల ఘట్టాలకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు గల ప్రదేశాలను మనం చూస్తాం. తేజాజీ నుంచి పాబుజీ, గోగాజీ నుంచి రామ్ దేవ్ జీ, బప్పా రావల్ నుంచి మహారాణా ప్రతాప్... ఇలా దేశాన్ని నడిపిన ఎందరో వీరులు, స్థానిక దేవతలు, సంఘ సంస్కర్తలు ఉన్నారు. దేశ చరిత్రలో స్ఫూర్తి అందించని సందర్భం రాజస్తాన్ లో ఒక్కటి కూడా లేదు. వాటిలో కూడా గుర్జర్ల సమాజం సాహసం, ధైర్యం, దేశభక్తికి మారుపేరు. దేశ రక్షణ కావచ్చు లేదా సంస్కృతి పరిరక్షణ కావచ్చు ప్రతీ సంఘటనలోనూ గుర్జర్ సమాజం కీలక పాత్ర పోషించింది. క్రాంతివీర్ భూప్ సింగ్ గా పేరొందిన విజయ్ సింగ్ పాఠిక్  గుర్జర్ రైతు ఉద్యమం నడిపిన వీరుడు. స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి. కొత్వాల్ ధన్ సింగ్ జీ, జోగ్ రాజ్ సింగ్ జీ వంటి యోధులు దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. అలాగే రామ్ ప్యారీ గుర్జర్, పన్నా దాయ్ వంటి మహిళలు కూడా ప్రతీ ఒక్క  సంఘటనను స్ఫూర్తిమంతం చేశారు. గుర్జర్ సమాజానికి చెందిన సోదరీమణులు, కుమార్తెలు దేశం, సంస్కృతికి ఎనలేని సేవ చేశారు. ఈ సంప్రదాయం నేటికి కూడా నిరంతరం వర్థిల్లుతూనే ఉంది. అలాంటి లెక్కలేనంత మంది యోధులకు రావలసిన గుర్తింపు చరిత్రలో రాకపోవడం మన దురదృష్టం. నేడు నవ భారతం పలు దశాబ్దాలుగా జరిగిన ఆ తప్పులను కూడా దిద్దుతోంది. నేడు సంస్కృతి, స్వాతంత్ర్యాలను పరిరక్షించిన వారందరినీ ముందువరుసలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం.

 

మిత్రులారా,

నేడు నవతరం, గుర్జర్  సమాజానికి చెందిన యువత భగవాన్ దేవనారాయణ్ బోధనలు, సందేశం అందరి ముందుకు తీసుకురావడం తప్పనిసరి. ఇది గుర్జర్ సమాజాన్ని సాధికారం చేయడంతో పాటు దేశం పురోగమించేందుకు సహాయకారిగా నిలుస్తుంది.

 

మిత్రులారా,

రాజస్తాన్, భారతదేశం అభివృద్ధికి 21వ శతాబ్ది చాలా కీలకమైన సమయం. మనందరం ఐక్యంగా నిలిచి దేశాభివృద్ధి కోసం కృషి చేయాలి. నేడు యావత్ ప్రపంచం భారతదేశం వైపు భారీ ఆశలతో ఎదురు చూస్తోంది. భారతదేశం ప్రపంచానికి తన సామర్థ్యం ఏమిటో చూపించినట్టుగానే దేశానికి చెందిన పోరాట యోధుల గర్వాన్ని కూడా ఇనుమడింపచేసింది. నేడు ప్రపంచానికి తన అభిప్రాయం ఏమిటన్నది స్పష్టంగా శక్తివంతంగా తెలియచేయగలుగుతోంది. అలాగే నేడు భారతదేశం ప్రపంచ దేశాలపై ఆధారనీయత తగ్గించుకుంటోంది. దేశ ఐక్యతకు భంగకరమైన ఏ అంశానికైనా మనం దూరంగా నిలవాలి. మన సంకల్పాలు సాకారం చేసుకుంటూ ప్రపంచ అంచనాలకు దీటుగా జీవించాలి. భగవాన్ దేవనారాయణ్ జీ ఆశీస్సులతో మనం తప్పకుండా విజయం సాధించగలమన్న పూర్తి విశ్వాసం నాకుంది. విజయానికి కారణమయ్యే ప్రయత్నం ఏదైనా సాకారం చేసేందుకు అందరం కలిసికట్టుగా కష్టించి కృషి చేస్తాం. భారతదేశం జి-20కి నాయకత్వం వహించడం, భగవాన్ దేవనారాయణ్ 1111వ అవతరణ సంవత్సరం రెండూ ఒకే సారి రావడం  ఎంత యాదృచ్ఛికమో చూడండి. భగవాన్ దేవనారాయణ్ కమలం మీదకి దిగి వచ్చినట్టుగానే యావత్ భూమండలం జి-20 లోగోపై అమరిపోయింది.  కమలం పూవుతో జన్మించిన  వారందరూ మనకు అనుంబంధం కలిగి ఉండడం కూడా యాదృచ్ఛికమే. ఆ రకంగా మీ అందరితోనూ మేం లోతైన అనుబంధం కలిగి ఉన్నాం. మనని దీవించడానికి అంత భారీ సంఖ్యలో దిగివచ్చిన రుషులందరి ముందూ నేను శిరసు వంచి అభివాదం చేస్తున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను ఒక భక్తుడిగా  ఆహ్వానించిన గుర్జర్ సమాజం అంతటికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇదేమీ ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఈ సమాజం శక్తి, అంకిత భావం నన్ను ఎంతగానో స్ఫూర్తిమంతం చేసింది. మీ అందరి మధ్యకి నేను వచ్చాను. అందరికీ శుభాకాంక్షలు.

జై దేవ్ దర్బార్!  జై దేవ్ దర్బార్!  జై దేవ్ దర్బార్!

 

*****



(Release ID: 1896201) Visitor Counter : 143