సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
దూరదర్శన్ & ఆకాశవాణి కార్యక్రమాలను మార్పిడి చేసుకోనున్న ప్రసార భారతి - ఈజిప్టు నేషనల్ మీడియా అథారిటీ (ఎన్‌ఎంఏ)
సమాచార మార్పిడి, సామర్థ్యం పెంపు, సహ ప్రసారాల అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన భారత సమాచార &ప్రసారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్ విదేశాంగ మంత్రి సమేహ్ హసన్ షౌక్రి
Posted On:
25 JAN 2023 2:13PM by PIB Hyderabad
ప్రసార భారతి - నేషనల్ మీడియా అథారిటీ ఆఫ్ ఈజిప్ట్ మధ్య సమాచార మార్పిడి, సామర్థ్యం పెంపుదల, సహ ప్రసారాలను సులభతరం చేసేలా భారతదేశం-ఈజిప్ట్ ఇవాళ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత సమాచార &ప్రసారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్ విదేశాంగ మంత్రి సమేహ్ హసన్ షౌక్రి ఈ ఎంవోయూ మీద సంతకాలు చేశారు. న్యూదిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఇరుపక్షాల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. అనంతరం, భారత ప్రధాని, ఈజిప్ట్ అధ్యక్షుడి సమక్షంలో రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందాలను మార్చుకున్నాయి.
ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, సామాజిక అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వంపై కార్యక్రమాల ప్రసారం ద్వారా దేశ పురోగతిని ప్రదర్శించడానికి డీడీ ఇండియా ఛానల్ పరిధిని పెంచేందుకు ప్రసార భారతి చేస్తున్న ప్రయత్నాలలో భాగమే ఈ ఎంవోయూ. అవగాహన ఒప్పందం ప్రకారం, ప్రసార సంస్థలు రెండూ తమ క్రీడలు, వార్తలు, సంస్కృతి, వినోదం వంటి వివిధ రకాల కార్యక్రమాలను ద్వైపాక్షిక ప్రాతిపదికన మార్చుకుంటాయి. ఈ కార్యక్రమాలు ఆయా దేశాల ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా ప్రసారం అవుతాయి. మూడు సంవత్సరాల కాల గడువు ఉన్న ఈ ఎంవోయూ ద్వారా, రెండు సంస్థల మధ్య సహ ప్రసారాలు, కొత్త సాంకేతికతల్లో అధికారులకు శిక్షణ కూడా ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన ప్రసారాల సంస్థ అయిన ప్రసార భారతి, ప్రసార రంగంలో సహకారం కోసం విదేశీ ప్రసార సంస్థలతో ఇప్పటివరకు 39 అవగాహన ఒప్పందాలు చేసుకుంది. సంస్కృతి, విద్య, విజ్ఞానం, వినోదం, క్రీడలు, వార్తలు మొదలైన రంగాల్లో విదేశీ ప్రసార సంస్థలతో కార్యక్రమాల మార్పిడికి ఈ ఒప్పందాలు వీలు కల్పిస్తాయి. పరస్పర ఆసక్తి, శిక్షణ ద్వారా జ్ఞానాన్ని పంచుకునేలా సహ ప్రసారాల అవకాశాలను కూడా ఈ అవగాహన ఒప్పందాలు అందిస్తాయి.
****
(Release ID: 1893801)
Visitor Counter : 144