రాష్ట్రప‌తి స‌చివాల‌యం

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2023 అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి

Posted On: 23 JAN 2023 7:41PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో ఈ రోజు (2023 జనవరి 23) జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము 11 మంది పిల్లలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2023 అవార్డులను ప్రదానం చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్రపతి పిల్లలు దేశానికి అత్యంత విలువైన ఆస్తులని అన్నారు. పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేలా చూసేందుకు చర్యలు అమలు జరగాలని అన్నారు.పిల్లల భవిష్యత్తును నిర్మించడానికి జరిగే ప్రతి ప్రయత్నం సమాజం, దేశ అభివృద్ధిపై ప్రభావం చూపించి అభివృద్ధికి సహకరిస్తుందని రాష్ట్రపతి అన్నారు. పిల్లలు సంతోషంగా, సురక్షితంగా బాల్యం అనుభవించేలా చూసి, భవిష్యత్తు కు ప్రణాళిక అమలు చేయాల్సి ఉంటుందని రాష్ట్రపతి అన్నారు. ప్రభ చూపించిన పిల్లలను గుర్తించి గౌరవించడం ద్వారా దేశ నిర్మాణంలో పాలు  పంచుకునేలా ప్రోత్సహిస్తున్నామని అన్నారు.

అవార్డులు పొందిన వారిలో కొందరు చిన్న వయసులో  అచంచలమైన ధైర్యాన్ని, పరాక్రమాన్ని ప్రదర్శించారని రాష్ట్రపతి ప్రశంసించారు. వారు సాధించిన విజయం, ప్రదర్శించిన ధైర్య సాహసాలు   తెలుసుకుని ఆశ్చర్య పోవడమే కాకుండా పొంగిపోయాను అని రాష్ట్రపతి అన్నారు. ఇటువంటి వారి నుంచి పిల్లలు స్ఫూర్తి పొంది పని చేయాలని సలహా ఇచ్చారు. 

 దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటున్నామని రాష్ట్రపతి తెలిపారు. కఠినమైన పోరాటం,త్యాగాలు చేయడం ద్వారా దేశానికి స్వాతంత్రం సిద్ధించి  ప్రజలకు  స్వేచ్ఛ లభించింది. త్యాగాలు, పోరాటాల ద్వారా సిద్ధించిన స్వాతంత్ర్యం విలువను యువతరం గుర్తించి, రక్షించాలని  రాష్ట్రపతి హితవు పలికారు.  వచ్చిన అవకాశాన్ని పిల్లలు ఉపయోగించుకుంటూ  దేశ ప్రయోజనాల గురించి ఆలోచించాలని, దేశం కోసం పని చేయాలని ఆమె సూచించారు.

భారతీయ జీవన విలువలు దాతృత్వానికి అత్యున్నత స్థానం ఇస్తాయని  రాష్ట్రపతి అన్నారు. ఇతరుల కోసం జీవించే వారి జీవితం అర్థవంతంగా ఉంటుంది. మొత్తం మానవాళి పట్ల ప్రేమ భావన, జంతువులు, పక్షులు మరియు మొక్కలను సంరక్షించే సంస్కృతి భారతీయ జీవిత విలువల్లో  ఒక భాగంగా ఉంది అని రాష్ట్రపతి పేర్కొన్నారు.  నేటితరం చిన్నారులు పర్యావరణం పట్ల మరింత స్పృహతో ఉన్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. చేసే ప్రతి పని పర్యావరణానికి హాని కలిగించదు అన్న అంశాన్ని పిల్లలు గుర్తించాలని  ఆమె సూచించారు. చెట్లను నాటి వాటిని సంరక్షించాలి అని పిల్లలకు రాష్ట్రపతి సలహా ఇచ్చారు. . శక్తిని ఆదా చేయాలని పిల్లలకు సూచించిన రాష్ట్రపతి ఈ విషయం పెద్దలకు పిల్లలు స్ఫూర్తి కలిగించాలని సూచించారు. 

కళ, సంస్కృతి, శౌర్యం, నూతన ఆవిష్కరణ, పాండిత్యం, సామాజిక సేవ, క్రీడలు వంటి 11 విభాగాల్లో అత్యుత్తమ కనబరిచిన 5 - 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఈ ఏడాది  కళ, సంస్కృతి, శౌర్యం, నూతన ఆవిష్కరణ, సామాజిక సేవ, క్రీడల విభాగాల్లో అవార్డులు అందజేశారు. 

 

***



(Release ID: 1893573) Visitor Counter : 206


Read this release in: English , Urdu , Hindi , Marathi