భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

ఎన్నికల ప్రక్రియలో సాంకేతికతను ప్రవేశపెట్టడానికి ఓటర్ల విశ్వాసం, అన్ని వర్గాల నమ్మకం అవసరం: ఈసీ శ్రీ అనుప్ చంద్ర పాండే


సైబర్ దాడులు, సమాచార ప్రభావ కార్యకలాపాల వల్ల ఎన్నికల సమగ్రతకు ముప్పు: శ్రీ పాండే

సమగ్ర ఎన్నికల నిర్వహణ కోసం 'సాంకేతిక వినియోగం, ఎన్నికల సమగ్రత' అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించిన ఎన్నికల సంఘం

Posted On: 24 JAN 2023 6:14PM by PIB Hyderabad

 ‘టెక్నాలజీ వినియోగం’  ‘ఎన్నికల సమగ్రత’ అనే అంశంపై భారత ఎన్నికల సంఘం నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ఈ రోజు ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ఎన్నికల కమిషనర్ శ్రీ అనుప్ చంద్ర పాండే  అధ్యక్షత వహించారు. ప్రజాస్వామ్య వేదిక . . వార్షిక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ‘ఎన్నికల సమగ్రత’పై  భారత ఎన్నికల సంఘం సదస్సు నిర్వహించింది. కార్యక్రమం కింద నిర్వహించిన  రెండో సదస్సుకు భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది.  

సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన ఎన్నికల కమీషనర్  శ్రీ అనుప్ చంద్ర పాండే ఎన్నికల ప్రక్రియలో సాంకేతిక అంశాలను ప్రవేశపెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.  “సాంకేతికత వినియోగంతో  సంక్లిష్టమైన ఎన్నికల నిర్వహణ ప్రక్రియలను సులభంగా,సులువుగా  నిర్వహించవచ్చు. సాంకేతికత అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేస్తుంది.  ఎన్నికల నిర్వహణలో పనిభారాన్ని తగ్గిస్తుంది. నేడు అనేక  దేశాల్లో ఎన్నికల నిర్వహణ సంస్థలు (ఈఎంబి)  సాంకేతిక అంశాలు  పొరపాట్లు, లోపాలు లేకుండా ఎన్నికలు నిర్వహించడానికి  సాధనంగా ఉపయోగపడతాయని గుర్తించాయి. అయితే, మొత్తం సమస్య పరిష్కారానికి సాంకేతిక ఒక సాధనంగా ఉపయోగపడదు” అని  శ్రీ అనుప్ చంద్ర పాండే అన్నారు.

ప్రజాస్వామ్య సంస్థల పరిరక్షణ, లోపాలు లేకుండా ఎన్నికల ప్రక్రియను నిర్వహించడానికి జరుగుతున్న ప్రయత్నాలకు నూతన సాంకేతికత ఉపయోగపడుతుందని  శ్రీ పాండే స్పష్టం చేశారు.  అయితే సైబర్ దాడులు, సమాచార ప్రభావ కార్యకలాపాలు ఎన్నికల నిర్వహణ సౌకర్యాలపై ప్రభావం చూపుతూ సమగ్ర ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నాయని అన్నారు. సాంకేతికతను ఎక్కువగా వినియోగించి ప్రజలు పెద్ద సంఖ్యలో సులువుగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా చూసేందుకు ఎన్నికల నిర్వహణ సంస్థలు (ఈఎంబి  లు) చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. దీనివల్ల ప్రజల విశ్వాసాన్ని దెబ్బ తీసి ప్రజాస్వామ్య వ్యవస్థకు భంగం కలిగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అరికట్టవచ్చునని శ్రీ అనుప్ చంద్ర పాండే అన్నారు. 

ఎన్నికల ప్రక్రియలో సాంకేతికత వినియోగానికి  ఓటర్ల విశ్వాసం అన్ని వర్గాల నమ్మకం అవసరమని శ్రీ పాండే అన్నారు. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడానికి జ్ఞానం, అనుభవం మరియు సాంకేతిక బదిలీ  ద్వారా అన్ని దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థలు కలిసి పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.  విజ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా సవాళ్లను  నిర్మాణాత్మక పద్ధతిలో క్రమం తప్పకుండా పరిష్కరించడానికి వీలవుతుందని శ్రీ పాండే అన్నారు. 

రెండు రోజుల సదస్సులో అనేక అంశాలపై  విస్తృత చర్చలు జరిగాయి. 'ఎన్నికల నిర్వహణ కోసం సాంకేతికత' అనే అంశంపై నిన్న జరిగిన మొదటి సదస్సులో  పాల్గొన్న ప్రతినిధులు  ఎన్నికల నిర్వహణకు సాంకేతికతను ఉపయోగించడం వల్ల కలిగే  ప్రయోజనాలు, ఎదురయ్యే  సవాళ్లను ప్రస్తావించారు. సాంకేతికతను ఉపయోగించడంలో వనరుల కొరత ప్రధాన సమస్యగా ఉందని అన్నారు. సామాజిక మాధ్యమాల అంశం కూడా చర్చకు వచ్చింది. సామాజిక మాధ్యమాల వల్ల  లాభాలు,నష్టాలు ఉంటాయని పేర్కొన్నారు. తప్పుడు సమాచారం, నకిలీ అంశాలు  విశ్వసనీయ వనరుల ధృవీకరణ అంశాలను అర్మేనియా, ఆస్ట్రేలియా, క్రొయేషియా, జార్జియా దేశాల  ఎన్నికల నిర్వహణ సంస్థలు   ప్రస్తావించాయి. 

‘ఇంక్లూజివ్ ఎలక్షన్స్ ఫర్ టెక్నాలజీ సొల్యూషన్స్’ అనే అంశంపై నిన్న జరిగిన రెండవ సదస్సులో  అంగోలా, ఫిలిప్పీన్స్‌ దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థలు, అంతర్జాతీయ సంస్థ ఐడియా  సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.  పక్షపాతం లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు సమగ్ర పద్ధతిలో సాంకేతికతను వినియోగించుకుని  ఎన్నికల నిర్వహణ సంస్థలు కృషి చేయాలని  ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే చూసేందుకు మైనారిటీ, స్వదేశీ భాషలలో సాంకేతిక అంశాలకు సంబంధించిన  సమాచార మార్గదర్శకాలను అందుబాటులో ఉంచవలసిన అవసరాన్ని కూడా ప్రతినిధులు పేర్కొన్నారు.

'నిర్వహణ పరికరంగా సాంకేతికత- డిజిటల్ యుగంలో ఎదురవుతున్న సవాళ్లు' అనే అంశంపై ఈరోజు జరిగిన మూడో సదస్సుకు  జార్జియా  Dy చైర్‌పర్సన్, సీఈసీ, పరాగ్వే ట్రిబ్యునల్ సుపీరియర్ డి జస్టిసియా ఎలక్టోరల్ ఉపాధ్యక్షుడు/మంత్రి సహ అధ్యక్షత వహించారు.సదస్సులో  ఇండోనేషియా, ఐఎఫ్ఎఫ్ఎస్  ప్రదర్శనలు ఏర్పాటు చేశాయి. ఐఎఫ్ఎఫ్ఎస్ ప్రతినిధి  మాట్ బెయిలీ ఎన్నికలకు సంబంధించిన హైబ్రిడ్ తప్పుడు సమాచారం/ నిఘా/సైబర్‌ సెక్యూరిటీ బెదిరింపులు, సమీప భవిష్యత్తులో వీటి వల్ల ఎదురయ్యే సవాళ్లు, వీటిని ఎదుర్కోవడానికి ఎన్నికల సంస్థలు తీసుకోవాల్సిన చర్యలను ప్రస్తావించారు.  ఇండోనేషియా కేపీయూ  కమీషనర్  బెట్టి ఎప్సిలాన్ ఇడ్రూస్ రాబోయే 2024 ఎన్నికల కోసం తమ దేశంలో అభివృద్ధి చేస్తున్న డిజిటల్ వ్యవస్థ,  ఎన్నికల డిజిటలైజేషన్ కార్యాచరణ ప్రణాళిక వివరాలు వివరించారు. 

అంగోలా, అర్మేనియా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చిలీ, క్రొయేషియా, ఫిజి, జార్జియా, ఇండోనేషియా, కిరిబాటి, మారిషస్, నేపాల్, పరాగ్వే, పెరూ, ఫిలిప్పీన్స్ , సురినామ్‌లతో సహా 16 దేశాలు/ ఎన్నికల సంస్థలు,  ఐఎఫ్ఎఫ్ఎస్, ఐడియా లాంటి అంతర్జాతీయ సంస్థలకు చెందిన 40 మందికి పైగా ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు.న్యూఢిల్లీలో ఉన్న ఎనిమిది విదేశీ మిషన్‌ల నుండి ప్రతినిధులు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

'సమిష్టి ఎన్నికలు, ఎన్నికల సమగ్రత'పై 3వ కాన్ఫరెన్స్ 2023 మార్చి నెలలో జరుగుతుంది. 29-30 తేదీల్లో జరగనున్న ప్రజాస్వామ్య రెండవ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈ సదస్సును నిర్వహిస్తారు. కోస్టారికా, కొరియా, నెదర్లాండ్స్, జాంబియా, అమెరికా ప్రభుత్వాలు సదస్సుకు సహకరిస్తాయి.

***


(Release ID: 1893475) Visitor Counter : 245


Read this release in: English , Urdu , Hindi , Punjabi