వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

2021-22 చక్కెర సీజన్ లో 5,000 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ చెరకు ఉత్పత్తి అయింది


చక్కెర రంగం ఇప్పుడు సబ్సిడీ లేకుండా స్వయం సమృద్ధి సాధించింది


2021-22 లో చక్కెర మిల్లులు / డిస్టిలరీలకు ఇథనాల్ అమ్మకం ద్వారా 20,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం వచ్చింది

Posted On: 19 JAN 2023 5:36PM by PIB Hyderabad

2021-22 సంవత్సరం భారత చక్కెర రంగానికి ఒక స్వర్ణ యుగం గా నిరూపించబడింది. సీజన్ లో చెరకు ఉత్పత్తి, చక్కెర ఉత్పత్తి, చక్కెర ఎగుమతులు, సేకరించిన చెరకు, చెల్లించిన చెరకు బకాయిలు, ఇథనాల్ ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరిగాయి. సీజన్లో దేశంలో రికార్డు స్థాయిలో 5,000 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్.ఎం.టి) చెరకు ఉత్పత్తి జరిగింది. అందులో 3,574 ఎల్.ఎం.టి. చెరకు నుంచి చక్కెర మిల్లులు 394 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెర (సుక్రోజ్) ను ఉత్పత్తి చేశాయి. అందులో 36 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెరను ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించారు. చక్కెర మిల్లుల ద్వారా 359 ఎల్.ఎం.టి. చక్కెర ఉత్పత్తి అయింది.

చక్కెర సీజన్ 2021 - 22 (అక్టోబర్-సెప్టెంబర్) లో భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద చక్కెర ఉత్పత్తిదారుగా, వినియోగదారుగా, అలాగే బ్రెజిల్ తర్వాత ప్రపంచంలో 2 అతిపెద్ద చక్కెర ఎగుమతిదారుగా నిలిచింది.

ప్రతి చక్కెర సీజన్లో, చక్కెర ఉత్పత్తి దాదాపు 320-360 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్.ఎం.టి) వరకు ఉంటుంది. అందులో దేశీయ వినియోగం 260 నుంచి 280 ఎల్.ఎం.టి. వరకు ఉంటుంది. దీని ఫలితంగా మిల్లుల వద్ద చక్కెర నిల్వలు భారీగా పెరిగాయి. దేశంలో చక్కెర నిల్వలు గణనీయంగా పెరగడంతో, ధరలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా, చక్కెర మిల్లులకు నగదు నష్టం వాటిల్లింది. దాదాపు 60 నుంచి 80 ఎల్.ఎం.టి. మేర చక్కెర నిల్వలు పెరగడంతో, చక్కెర మిల్లులకు రాబడి తగ్గి, నిధుల కొరత ఏర్పడింది. ఫలితంగా చెరకు రైతులకు చెల్లించవలసిన బకాయిలు పేరుకుపోయాయి.

తగ్గిన చక్కెర ధరల కారణంగా చక్కెర మిల్లులకు నగదు నష్టాన్ని నివారించాలనే ఉద్దేశ్యంతో, భారత ప్రభుత్వం 2018 జూన్ లో చక్కెర కనీస అమ్మకపు ధర (ఎం.ఎస్.పి) విధానాన్ని ప్రారంభించి, కిలో చక్కెర ఎం.ఎస్.పి. 29 రూపాయలుగా నిర్ణయించింది. తర్వాత 2019 ఫిబ్రవరి 14 తేదీన కిలో చక్కెర ఎం.ఎస్.పి. 31 రూపాయలుగా సవరించింది.

2018-19 లో నెలకొన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి 2021-22 లో స్వయం సమృద్ధి సాధించే దశకు చక్కెర రంగాన్ని దశలవారీగా మెరుగుపరచడంలో గత 5 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం సకాలంలో తీసుకున్న చర్యలు చాలా కీలకమైనవి. 2021-22 చక్కెర సీజన్ లో, చక్కెర మిల్లులు ₹ 1.18 లక్షల కోట్ల కంటే ఎక్కువ విలువైన చెరకును సేకరించాయి. భారత ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థిక సహాయం (సబ్సిడీ) లేకుండా సీజన్కు 1.15 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో చక్కెర మిల్లులు చెల్లింపులు చేయడం ఒక గొప్ప విజయం. విధంగా, 2021-22 చక్కెర సీజన్ లో చెరకు బకాయిలు 2,300 కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉన్నాయి. అంటే 98 శాతం మేర చెరకు బకాయిలు ఇప్పటికే చెల్లించినట్లు అయ్యింది. అదేవిధంగా, 2020-21 చక్కెర సీజన్ కి సంబంధించి, దాదాపు 99.98 శాతం చెరకు బకాయిలు చెల్లించిన విషయాన్ని కూడా మనం గుర్తించాలి.

చక్కెర పరిశ్రమ రంగం స్వయం సమృద్ధిగా వృద్ధి చెందడం కోసం ఒక దీర్ఘకాలిక చర్యగా, చక్కెరను ఇథనాల్తయారీకి మళ్లించడంతోపాటు, మిగులు చక్కెరను ఎగుమతి చేసేందుకు, కేంద్ర ప్రభుత్వం చక్కెర కర్మాగారాలను ప్రోత్సహిస్తోంది. తద్వారా, చక్కెర మిల్లులు రైతుల చెరకు బకాయిలను సకాలంలో చెల్లించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా, మిల్లులు తమ కార్యకలాపాలను కొనసాగించడానికి మెరుగైన ఆర్థిక పరిస్థితి కల్పించుకోవచ్చు. రెండు చర్యలలో విజయం సాధించడంతో, 2021-22 చక్కెర సీజన్ నుంచి ఎటువంటి సబ్సిడీ లేకుండా చక్కెర రంగం ఇప్పుడు స్వయం సమృద్ధి సాధించింది.

గత 5 సంవత్సరాలలో జీవ ఇంధన రంగంగా ఇథనాల్ వృద్ధి చెందడం వల్ల, చక్కెర రంగానికి పుష్కలంగా మద్దతు లభించింది. ఎందుకంటే చక్కెరను ఇథనాల్గా మార్చడంతో పాటు, వేగవంతమైన చెల్లింపులు, తగ్గిన వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, మిల్లుల్లో తక్కువ చక్కెర నిల్వల వంటి కారణాలవల్ల చక్కెర మిల్లులు మెరుగైన ఆర్థిక స్థితికి చేరుకున్నాయి. 2021-22 లో, ఇథనాల్ అమ్మకాల ద్వారా చక్కెర మిల్లులు / డిస్టిలరీలు 20,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించాయి. దీంతో, రైతుల చెరకు బకాయిలను సాధ్యమైనంత ముందుగా చెల్లించడానికి వీలు కలిగింది.

మొలాసిస్ / చక్కెర ఆధారిత డిస్టిలరీల ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 683 కోట్ల లీటర్లకు పెరిగింది. పెట్రోల్ తో ఇథనాల్ కలిపే (.బి.పి) కార్యక్రమం కింద 2025 నాటికి 20 శాతం బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకోవడానికి చేపట్టిన ప్రక్రియ పురోగతిలో కొనసాగుతోంది. కొత్త సీజన్లో, చక్కెరను ఇథనాల్గా మార్చే సామర్ధ్యం 36 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 50 లక్షల మెట్రిక్ టన్నుల కు పెరిగే అవకాశం ఉందని అంచనా వేయడం జరిగింది. దీని వలన చక్కెర మిల్లులకు దాదాపు 25,000 కోట్ల రూపాయల మేర ఆదాయం వస్తుంది. ఇథనాల్ కలిపే కార్యక్రమం విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడంతో పాటు దేశ ఇంధన భద్రతను బలోపేతం చేసింది. 2025 నాటికి, 60 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ చక్కెరను ఇథనాల్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. చక్కెర అధిక నిల్వల సమస్యను పరిష్కరించడం తో పాటు, మిల్లుల ఆర్థిక స్థితిని ఇది మెరుగుపరుస్తుంది. తద్వారా రైతుల చెరకు బకాయిలను సకాలంలో చెల్లించడానికి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కూడా ఇది పెంపొందిస్తుంది.

లక్ష్యాలను సాధించడానికి, ప్రభుత్వం చక్కెర మిల్లులు, డిస్టిలరీల ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవడానికి ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా, బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు వీలుగా ప్రభుత్వం వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం తో పాటు, రుణాలపై 6 శాతం వరకు వడ్డీ రాయితీ లేదా బ్యాంకులు వసూలు చేసిన మొత్తం వడ్డీ లో 50 శాతం ఏది తక్కువైతే అది ప్రభుత్వం భరిస్తుంది. ఇది దాదాపు 41,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడిని తెస్తుంది. ప్రస్తుత ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం, లేదా తృణధాన్యాలు (బియ్యం, గోధుమలు, బార్లీ, మొక్కజొన్న, జొన్నలు), చెరకు (చక్కెర, చక్కెర పాకం, చెరకు రసం, బి-హెవీ మొలాసిస్, సి-హెవీ మొలాసిస్) షుగర్ బీట్ వంటి ఫీడ్ స్టాక్ నుండి 1 తరం (1జి) ఇథనాల్ను ఉత్పత్తి చేయడానికి కొత్త డిస్టిలరీని ఏర్పాటు చేయడం కోసం ప్రాజెక్టు ప్రతిపాదకుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ, 12 నెలల కాల పరిమితితో 22.04.2022 తేదీన డి.ఎఫ్.పి.డి. ఒక కౌంటర్ ను ప్రారంభించింది. గత 4 సంవత్సరాలలో, 233 మందికి సుమారు 19,495 కోట్ల రూపాయల మేర రుణాలు మంజూరు చేయగా, వీటిలో 203 మందికి సుమారు 9,970 కోట్ల రూపాయల మేర రుణాలు పంపిణీ చేయడం జరిగింది.

సీజన్లో మరో గొప్ప విషయం ఏమిటంటే, ఎటువంటి ఆర్థిక సహాయం లేకుండా, అత్యధికంగా 110 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతులు చేయడం. ఇది 2020-21 వరకు కొనసాగింది. భారతీయ చక్కెర పరిశ్రమ ఘనత సాధించడానికి అంతర్జాతీయ మద్దతు ధరలతో పాటు, భారత ప్రభుత్వ విధానం దోహదపడింది. ఎగుమతుల వల్ల దేశానికి దాదాపు 40,000 కోట్ల రూపాయల మేర విదేశీ మారకద్రవ్యం లభించింది. ప్రస్తుత 2022-23 చక్కెర సీజన్ లో, అన్ని చక్కెర కర్మాగారాలకు దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతి కోటా కేటాయించడం జరిగింది. వీటిలో 18.01.2023 తేదీ వరకు చక్కెర మిల్లుల నుండి దాదాపు 30 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెర ఎగుమతి కోసం సేకరించడం జరిగింది.

అంతిమంగా, 2021-22 చక్కెర సీజన్ ముగింపులో, రెండున్నర నెలల పాటు దేశీయ అవసరాలు తీర్చడానికి అవసరమైన 60 లక్షల మెట్రిక్ టన్నుల వాంఛనీయ ముగింపు నిల్వలు సాధించడం జరిగింది. చక్కెర నిల్వలను ఇథనాల్ తయారీ తో పాటు, ఎగుమతులకు మళ్లించడం ద్వారా మొత్తం పరిశ్రమ విలువను పెంచడానికి దారితీసింది. అదేవిధంగా, చక్కెర మిల్లుల మెరుగైన ఆర్థిక పరిస్థితులు, వచ్చే సీజన్లో మరిన్ని మిల్లులు ముందుకు రావడానికి అవకాశమిచ్చాయి.

దేశీయ చక్కెర ధరలు స్థిరంగా ఉండటం మరో విశేషం. అంతర్జాతీయ చక్కెర ధరలు రికార్డు స్థాయిలో ఉన్నప్పటికి, దేశీయంగా చక్కెర ధరలు కిలో కి 32 రూపాయల నుంచి 35 రూపాయల మధ్య స్థిరంగా ఉన్నాయి. దేశంలో చక్కెర సగటు చిల్లర ధర ప్రస్తుతం కిలో కు ₹ 41.50 ఉండగా, రాబోయే నెలల్లో కిలోకి 37 రూపాయల నుంచి 43 రూపాయల మధ్య ఉండే అవకాశం ఉంది. అందువలన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దేశంలో చక్కెర చేదుకాదు, ఎప్పటికీ తీపి గా ఉండడం ప్రభుత్వ విధానాల ఫలితం.

 

*****

 



(Release ID: 1892671) Visitor Counter : 129


Read this release in: English , Urdu , Hindi , Marathi