ఆయుష్
ఢిల్లీ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ని సందర్శించిన కెనడాలోని అంటారియో రాష్ట్ర మానసిక ఆరోగ్య శాఖ మంత్రి
సంస్థ సాగిస్తున్న పరిశోధనలు, అందిస్తున్న ఆరోగ్య సేవల పట్ల ఆసక్తి చూపించిన మంత్రి
Posted On:
18 JAN 2023 8:14PM by PIB Hyderabad
ఆయర్వేద వైద్య విధానాల ద్వారా ఆసుపత్రులపై భారాన్ని తగ్గించడానికి అవకాశం ఉందని కెనడా అంటారియో రాష్ట్ర మానసిక ఆరోగ్య శాఖ మంత్రి మైఖేల్ టిబోల్లో అన్నారు. ఇటీవల ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ను మైఖేల్ టిబోల్లో సందర్శించారు. ఆయుర్వేద వైద్య విధానాలు అనుసరించడం ద్వారా కెనడా లో ఆసుపత్రులపై భారాన్ని తగ్గించవచ్చునన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయుర్వేద చికిత్సలు, సూత్రాలు మరియు జీవనశైలి అనేక వ్యాధులను దూరంగా ఉంచుతామని మైఖేల్ టిబోల్లో అన్నారు. కెనడా ఇండియా ఫౌండేషన్, టిబోల్లో నేతృత్వంలో కెనడా ప్రతినిధి బృందం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ని సందర్శించింది.
సంస్థలో లభిస్తున్న సౌకర్యాల పట్ల మైఖేల్ టిబోల్లో హర్షం వ్యక్తం చేశారు. "తూర్పు, పశ్చిమ దేశాల్లో అందుబాటులో ఉన్న ఔషధాల ప్రాముఖ్యతపై నాకు ఉన్న పరిజ్ఞానం, అవగాహన సంస్థను సందర్శించిన తర్వాత మరింత పెరిగింది. తూర్పు, పశ్చిమ దేశాల వైద్య విధానాలను కలిపి అమలు చేయడం ద్వారా మానవజాతి అభివృద్ధికి మరింత కృషి చేయవచ్చు. తక్షణ ఫలితాలు సాధించే అంశానికి కెనడాలో ప్రాధాన్యత లభిస్తోంది. దీనివల్ల నివారణ, విద్య , మెరుగైన జీవన శైలికి దోహదపడే అంశాలకు తగినంత ప్రాధాన్యత లభించడం లేదు. సంస్థలో పనిచేస్తున్నవైద్యులు ఈ రోజు వారి అనుభవాలను నాతో పంచుకున్నారు. పురాతన పద్ధతులు ఉపయోగించి ఆరోగ్య సంరక్షణ అందిస్తున్న విధానాలు వివరించారు. అనేక వేల సంవత్సరాల చరిత్ర కలిగిన వైద్య విధానాలను ఉపయోగించి సాధించిన ఫలితాలు, విజయాలను వైద్యులు వివరించారు. దీనివల్ల , ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం తగ్గుతుంది." అని టిబోల్లో అన్నారు.
“కెనడా ఇండియా ఫౌండేషన్ సహాయంతో ఆయుర్వేద వైద్య విధాన సంస్థ త్వరలో ఏర్పడే అవకాశం ఉంది. సమాచార ఆధారిత సాక్ష్యాలను టిబోల్లో నాయకత్వంలో వచ్చిన కెనడా బృందానికి అందించాము. సమాచారాన్ని కెనడా ప్రభుత్వానికి అందించి తదుపరి చర్య కోసం బృందం పనిచేస్తుంది" అని ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద డైరెక్టర్ ప్రొఫెసర్ (డా) తనూజా మనోజ్ నేసరి అన్నారు.
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అమలు చేస్తున్న సమగ్ర నమూనాపై అవగాహన కోసం ప్రతినిధి బృందం ఇన్‌స్టిట్యూట్ , హాస్పిటల్‌తో పాటు ప్రయోగశాలలు మరియు ఇతర సౌకర్యాలను పరిశీలించింది. కెనడా నుండి వచ్చిన ప్రతినిధి బృందానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారం అందించింది. తృతీయ సంరక్షణ యూనిట్, అకడమిక్ బ్లాక్ మరియు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద పరిశోధనా కేంద్రం తో సహా వివిధ విభాగాల పనితీరును ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద డైరెక్టర్ వివరించారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద లో లభిస్తున్న సౌకర్యాలు,అమలు చేస్తున్న కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను కెనడా బృందం సందర్శించింది.
***
(Release ID: 1892078)
Visitor Counter : 196