ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

ఆన్‌లైన్ గేమింగ్‌లో దేశంలోనే మొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ షిల్లాంగ్‌లో ఏర్పాటు చేస్తాం: మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్


డిజిటల్ సాంకేతికత అంకుర సంస్థల తదుపరి దశ మేఘాలయ, ఈశాన్య ప్రాంతం నుంచి ఉంటుంది: శ్రీ రాజీవ్ చంద్రశేఖర్

అత్యాధునిక డిజిటల్ నైపుణ్యాలను అందించడానికి షిల్లాంగ్‌లో 10 ఎకరాల క్యాంపస్‌ ఏర్పాటు కోసం 'నెలిట్‌' యోచిస్తోంది: శ్రీ రాజీవ్ చంద్రశేఖర్

పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేలా మేఘాలయలో 50,000 మంది యువతకు భవిష్యత్‌ సంసిద్ధత నైపుణ్యాలపై శిక్షణ ఇస్తాం: శ్రీ రాజీవ్ చంద్రశేఖర్

Posted On: 13 JAN 2023 5:04PM by PIB Hyderabad

ఆన్‌లైన్ గేమింగ్‌లో భారతదేశపు మొట్టమొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను 'సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా' ద్వారా 'డిజిటల్ ఇండియా స్టార్టప్ హబ్' షిల్లాంగ్‌లో ఏర్పాటు చేస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతికత శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. మార్చి 2023 నాటికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ ఏర్పాటు పూర్తవుతుందని వెల్లడించారు. భవిష్యత్‌ తరం ఆన్‌లైన్ గేమింగ్ వ్యవస్థను రూపొందించడానికి మొత్తం ఈశాన్య ప్రాంతంలోని అంకుర సంస్థలను, యువ పారిశ్రామికవేత్తలను ఆ కేంద్రం ఉత్తేజపరుస్తుందని భావిస్తున్నారు. "తదుపరి అంకుర సంస్థలు, యువ పారిశ్రామికవేత్తలు షిల్లాంగ్, కోహిమా సహా ఈశాన్య భారతదేశం నుంచి రావాలన్నది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజన్‌" అని షిల్లాంగ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించిన ఐటీ నిబంధనలు 2021కు ముసాయిదా సవరణల మీద ఇటీవల ప్రజాభిప్రాయలను ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ కోరింది.

షిల్లాంగ్‌లోని సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్‌లో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్

ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తులు, సేవలు, పరికరాల డిజిటలైజేషన్ వేగం పెరుగుతున్న నేపథ్యంలో, కొవిడ్ తర్వాత ఏర్పడిన డిజిటల్ నైపుణ్యాల ప్రాముఖ్యతను మంత్రి నొక్కివక్కాణించారు. "వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగాలు, వ్యవస్థాపకత అవకాశాలను దక్కించుకునేందుకు ఈశాన్య ప్రాంత యువతకు డిజిటల్ నైపుణ్యాలను అందించడం శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వ నిబద్ధతకు చిహ్నం." అని మంత్రి చెప్పారు. అత్యాధునిక డిజిటల్ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేందుకు 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ (నెలిట్‌) ఆధ్వర్యంలో షిల్లాంగ్‌లో ఆధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాల గురించి మంత్రి వివరించారు. ఈ కేంద్రం ఏర్పాటు కోసం 10 ఎకరాల ప్రాంగణం క్యాంపస్ త్వరలో సిద్ధం అవుతుంది, ఈశాన్య ప్రాంతంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అవసరాలను అది తీరుస్తుంది.

పీఎంకేవీవై 4.0 ద్వారా నైపుణ్య భారత్‌ను కేంద్ర ప్రభుత్వం పునఃప్రారంభిస్తోందని, పరిశ్రమల్లో ఉద్యోగాలు సంపాదించేలా మేఘాలయలో దాదాపు 50,000 మంది యువతకు భవిష్యత్ సంసిద్ధత నైపుణ్యాలలో ఇది శిక్షణ ఇస్తుందని మంత్రి వివరించారు. “యువ భారతీయుల కోసం భవిష్యత్‌ ఆశయాలు, ఆకాంక్షలతో ప్రధాని నరేంద్ర మోదీ కొత్త భారతదేశాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి నైపుణ్యాలు అతి ముఖ్యం. శ్రేయస్సును అందించే కొత్త పాస్‌పోర్ట్ నైపుణ్యాలు శ్రీ రాజీవ్ చంద్రశేఖర్‌ చెప్పారు. పీఎంకేవీవై 4.0 కింద, నైపుణ్యాభివృద్ధి & యువపారిశ్రామికత్వం మంత్రిత్వ శాఖ ఆమోదించిన కోర్సుల్లో త్రిపురలో 60,000 మంది, నాగాలాండ్‌లో 35,000 మంది యువతకు నైపుణ్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మేఘాలయలో 2 రోజులుగా అధికారిక పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ఈ రాత్రి దిల్లీకి తిరిగి రానున్నారు.

 

***(Release ID: 1891178) Visitor Counter : 161


Read this release in: English , Urdu , Hindi , Tamil