శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

గిరిజనుల విజ్ఞానాన్ని, సమస్యలను విశ్లేషించిన ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’

Posted On: 04 JAN 2023 8:27PM by PIB Hyderabad

జిగురు మొక్కలు, నూనె గింజలు, పూలు, ఔషధ మొక్కల వంటి కలప కాని అటవీ ఉత్పత్తులు, ఇప్ప, నేరేడు, మామిడి చింత, ఉసిరి లాంటి ఆహార ఉత్పత్తులు గిరిజన కుటుంబాలకు అత్యధిక ఆదాయవనరులుగా కనిపిస్తున్నాయి.   మహారాష్ట్రలో మావోయిస్టుల ప్రాబల్యమున్న  వెనుకబడ్డ జిల్లా గడ్చిరోలి లో గిరిజన మహిళల ఆర్థిక స్వావలంబనకు కారణం ఈ వనరులు అందుబాటులో ఉండటమే. ఇప్పుడు వారు తమ జీవిత నిర్ణయాలు తీసుకోగలిగేలా సాధికారత సాధించటమే ముఖ్యం. పౌష్టికాహార లోపం, మాతాశిశు మరణాల తగ్గింపు, పేదరిక నిర్మూలన లాంటి సమస్యల పరిష్కార దిశలో వారిని ప్రోత్సహించాల్సి ఉందని గడ్చిరోలి లోని గవర్నమెంట్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలతా జె. వాంఖేడే చౌధురి అన్నారు. ‘గడ్చిరోలి జిల్లాలో గిరిజన మహిళల  అభ్యున్నతి’ అనే అంశం మీద ఆమె ప్రసంగించారు. 

108 వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో భాగంగా జరిగిన ‘గిరిజన సైన్స్ కాంగ్రెస్’ లో ఆమె ప్రసంగించారు.  భారతదేశ పట్టణ ప్రాంతాల్లో దాదాపుగా కనుమరుగైన మలేరియా, బోదకాలు లాంటి సమస్యలు అడవులలో తిరిగే గిరిజనులకు ఇంకా ప్రధాన ఆరోగ్య సమస్యలుగానే మిగిలిపోవటాన్ని ప్రస్తావించారు. రెండు రకాల ప్రపంచాల మధ్య స్పష్టమైన తేడా చెప్పటానికి అది ఒక ఉదాహరణ మాత్రమేనన్నారు.  గిరిజనులలో విద్య ప్రాధాన్యాన్ని, గిరిజన మహిళల సాధికారతను ఆమె ప్రధానంగా ప్రస్తావించారు.

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షురాలు డాక్టర్ విజయ లక్ష్మీ సక్సేనా ఈ ట్రైబల్ మీట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవా జోహార్.. అంటే ప్రకృతి మాతకు సేవ చేయటమే గిరిజన జీవిత సారాంశమన్నారు. ఇండియన్ కాంగ్రెస్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ట్రైబల్ మీట్ ఏర్పాటు చేసిన ఆర్టీఎమ్ నాగపూర్ యూనివర్సిటీని అభినందించారు.  జీవవైవిధ్యాన్ని పరిరక్షించటంలో గిరిజనులదే అత్యుత్తమ స్థానమన్నారు. వారి సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక జ్ఞానం తో సమ్మిళితం చేస్తే సుస్థిరత సాధించటం సులువవుతుందన్నారు.

ట్రైబల్ మీట్ మొదటి టెక్నికల్ సెషన్ కు నాగాలాండ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పరదేశి లాల్ అధ్యక్షత వహించారు. ప్రకృతివనరుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ ద్వారానే గిరిజనుల పురోగతికి, పర్యావరణ పరిరక్షణకు కృషిచేయగలమన్నారు. నాగాలాండ్ లో గిరిజనుల, మహిళల అభ్యున్నతిలో  శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పోషించిన పాత్రను ఆయన వివరించారు. .

గిరిజనుల ఆహారంలో అద్భుతమైన ప్రయోజనాలను సి ఎస్ ఐ ఆర్ – సిఎఫ్ టిఆర్ఐ చీఫ్ సైంటిస్ట్ ప్రొఫెసర్ ప్రకాశ్ హలామి వివరించారు. ప్రొఫెసర్ వినోద్ బాలా తక్సక్, డాక్టర్ ఆర్తి ప్రసాద్, ప్రొఫెసర్ గీతాంజలి డాష్  సాంకేతిక ప్రసంగాలు చేశారు.

గిరిజన యువకులకు అంకుర సంస్థల మీద, కెరీర్ మీద అవగాహన 

ట్రైబల్ మీట్ లో భాగంగా గిరిజన యువతకు అంకుర సంస్థల మీద, కెరీర్ గైడెన్స్ మీద ఒక ప్రత్యేక సెషన్ నిర్వహించారు.  దీనికి అనూహ్యమైన సందన కనిపించింది.  ఐఎఎస్ అధికారి శ్రీ రవీంద్ర ఠాక్రే, గోండ్వానా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రశాంత బోకరే, ‘రోజ్ గార్  నౌకరీ సందర్భ’ కు చెందిన శ్రీ సంజయ్ నాథే, కొంతమంది కెరీర్ గైడెన్స్ నిపుణులు అక్కడ హాజరైన విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.

వివిధ సంస్థల ద్వారా గిరిజనుల అభ్యున్నతికి, గిరిజనుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న సామాజిక నాయకులు  మరో సెషన్ లో మాట్లాడారు. గిరిజనుల సాధికారత కోసం చేయాల్సిన కృషి మీద వారి ఆలోచనలు పంచుకున్నారు.  

అంతకు ముందు ఆర్టీఎమ్ నాగపూర్ విశ్వ విద్యాలయం  వైస్ ఛాన్సలర్ డాక్టర్ సంజయ్ దూధే ఈ సదస్సును ప్రారంభిస్తూ, సుస్థిర అభివృద్ధే మానవాళి భవిష్యత్తు అన్నారు. ఇప్పటిదాకా గిరిజనులు తమ సంస్కృతిని, అలవాట్లను కాపాడుకోగలిగారని చెబుతూ,  “గిరిజన జీవిత విధానం ఎప్పుడూ సుస్థిరమే. మనం మన మూలాలను గౌరవించుకోవాలి” అన్నారు.  ఇప్పటిదాకా గిరిజనులు తమ సంస్కృతిని, అలవాట్లను కాపాడుకోగలిగారు” అన్నారు. గిరిజనులు భారం కాదని, వారొక ఆస్తి అని కన్వీనర్ డాక్టర్ శామ్ రావు కోరేటి అన్నారు. గిరిజన విద్యార్థులు పెద్ద సంఖ్యలో  హాజరుకావటాన్ని అభినందించారు.

గోడు రాజు భక్త బులంద్ షా 14 వ వారసుడు, నాగపూర్ నగర వ్యవస్థాపకుడు అయిన న శ్రీ ఆదిత్య షా ఈ సదస్సును అభినందించారు.   ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సభ్యత్వ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. రామకృష్ణ, ఆర్టీఎమ్ నాగపూర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాజు హివాసే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుమారి మాయా కోరేటి స్వాగర గీతంతో మొదలైన ఈ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ హీనా నాగభైరి, డాక్టర్ సంతోష్ గీరే నిర్వహించారు.   

 

.****



(Release ID: 1888776) Visitor Counter : 231


Read this release in: Urdu , English , Marathi