బొగ్గు మంత్రిత్వ శాఖ
ఉద్యోగులకు కనీస ప్రయోజన హామీకి సిఫారసు చేస్తూ కోల్ ఇండియా లిమిటెడ్-ఉద్యోగ సంఘాల మధ్య అవగాహన ఒప్పందం
2.38 లక్షలమంది నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు
19 శాతం కనీస ప్రయోజన హామీ (ఎంజీబీ)
Posted On:
04 JAN 2023 5:31PM by PIB Hyderabad
కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)లో వేతన చర్చలలో ప్రతిష్టంభనకు స్వస్తి పలుకుతూ నాలుగు కేంద్ర కార్మిక సంఘాలు- బీఎంఎస్, హెచ్‌ఎంఎస్, ఏఐటీయూసీ, సీఐటీయూలతో ‘సీఐఎల్’ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ మేరకు 19 శాతం కనీస ప్రయోజన హామీ (ఎంజీబీ)కి సిఫారసు చేసే ఈ ఒప్పందంపై 2023 జనవరి 3న సంతకాలు పూర్తయ్యాయి. తద్వారా ప్రస్తుత జాతీయ బొగ్గు వేతన ఒప్పందం-XI (ఎన్‌సీడబ్ల్యూఏ-XI) భాగంగా 2.38 లక్షల మంది నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు తాజా ఒప్పందంతో ప్రయోజనం చేకూరుతుంది. కాగా, ఈ 19 శాతం ‘ఎంజీబీ’లో 2021 జూన్ 30 నాటికి మూల వేతనం, వేరియబుల్ డి.ఎ., స్పెషల్ డి.ఎ., అటెండెన్స్ బోనస్ అంతర్భాగంగా ఉన్నాయి. సంబంధిత ఒప్పందంపై సంతకం చేసిన భాగస్వాములలో తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) కూడా ఒకటిగా ఉంది. ప్రభుత్వాల ఆధ్వర్యంలోగల ‘సీఐఎల్, ఎస్‌సీసీఎల్’ బొగ్గు సంస్థల సిబ్బంది సంఖ్య 2021 జూలై 1 నాటికి మొత్తం 2.82 లక్షలు కాగా, వీరిలో ఎస్‌సీసీఎల్ ఉద్యోగులు దాదాపు 44,000 మందిదాకా ఉన్నారు.
జనవరి 3న కోల్‌కతాలోని సీఐఎల్ కార్పొరేట్ ప్రధాన కార్యాలయంలో బొగ్గు పరిశ్రమ-XIకు సంబంధించిన ద్వైపాక్షిక సంయుక్త కమిటీ ఎనిమిదో సమావేశంలో ఈ సిఫారసుపై అంగీకారం కుదిరింది. ఎంజీబీ కాకుండా ఇతరత్రా అంశాలపైనా చర్చలు కొలిక్కి వచ్చిన తర్వాత ఐదేళ్ల కాలానికిగాను 2021 జూలై 1 నుంచి అమలులోకి వచ్చేవిధంగా ఎన్‌సీడబ్ల్యూఏ-XI సంబంధిత ఒప్పందం ఖరారు చేస్తారు. ‘ఎంజీబీ’పై స్నేహపూర్వక అంగీకారానికి రావడంలో నాలుగు కేంద్ర కార్మిక సంఘాలు చొరవ చూపాయి. మరోవైపు ‘సీఐఎల్’ కూడా సామరస్యపూర్వక పారిశ్రామిక సంబంధాలు కలిగి ఉంది. దీంతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఉత్పత్తి లక్ష్య సాధన ప్రాముఖ్యాన్ని కార్మిక సంఘాలు కూడా గుర్తించడంతో చర్చలు ఫలించాయి.
******
(Release ID: 1888731)
Visitor Counter : 194