ఆర్థిక మంత్రిత్వ శాఖ
అసోంలో రహదారి అనుసంధానతను మెరుగుపరచడానికి $300 మిలియన్ల రుణం కోసం భారత్-ఏడీబీ మధ్య ఒప్పందం
Posted On:
03 JAN 2023 7:55PM by PIB Hyderabad
అసోంలోని 300 కిలోమీటర్లకు పైగా పొడవుతో ఉన్న రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారులను (ఎండీఆర్) ఆధునీకరించడానికి $300 మిలియన్ల రుణ ఒప్పందంపై భారత ప్రభుత్వం-ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ఇవాళ సంతకాలు చేశాయి.
"అసోం సౌత్ ఆసియా సబ్‌రీజినల్ ఎకనామిక్ కోఆపరేషన్' (సాసెక్) కారిడార్ కనెక్టివిటీ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్" కోసం కుదిరిన ఒప్పందం మీద, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి శ్రీ రజత్ కుమార్ మిశ్రా భారత ప్రభుత్వం తరపున సంతకం చేశారు. ఏడీబీ తరపున, ఏడీబీ ఇండియా రెసిడెంట్ మిషన్ ఆఫీసర్-ఇన్-ఛార్జ్ శ్రీ నిలయ మితాష్ సంతకం చేశారు.
రాష్ట్ర రహదారులు, ఎండీఆర్ నెట్‌వర్క్‌లో నాణ్యతను, సేవలను మెరుగుపరచడానికి, క్లిష్టమైన మౌలిక సదుపాయాల్లో అంతరాలు తొలగించడానికి అసోం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రహదారుల అభివృద్ధి కార్యక్రమం 'అసోం మాల'కు ఈ ప్రాజెక్ట్ మద్దతుగా నిలుస్తుందని శ్రీ మిశ్రా చెప్పారు.
"ఈ ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చేసిన మెరుగైన, సురక్షితమైన రహదారులు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు రవాణా సదుపాయాలను అందుబాటులోకి తెస్తాయని, తద్వారా మార్కెట్లను చేరుకోవడానికి, సేవలను అందుకోవడానికి వారికి వీలు కల్పిస్తాయని, సాసెక్ ప్రాంతంలో వృద్ధి ఉత్ప్రేరకంగా పని చేస్తాయని" అని మితాష్ వెల్లడించారు.
రాష్ట్రంలోని పశ్చిమ, మధ్య, దక్షిణ ప్రాంతాల్లోని ఆరు రహదారి విభాగాలు సహా, ఈ ప్రాజెక్టు కింద ఆధునీకరించబోయే రహదారులు భారతదేశాన్ని భూటాన్, బంగ్లాదేశ్‌లతో కలిపే సాసెక్ కారిడార్లకు అనుసంధానమై, సరిహద్దు ప్రాంతాల్లో వాణిజ్యం, రవాణాను పెంచుతాయని భావిస్తున్నారు. జోగిఘోపాలో నిర్మిస్తున్న మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కుకు; రోడ్డు, రైలు, అంతర్గత జలమార్గం, వాయు రవాణా సౌకర్యాలను అందించడానికి సిల్చార్‌లో ప్రతిపాదించిన మరో లాజిస్టిక్ పార్కుకు ఈ ప్రాజెక్టు ఉత్ప్రేరకంగా పని చేస్తుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా, రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారులను ఏక మార్గం నుంచి రెండు లైన్లకు విస్తరిస్తారు. వాతావరణ మార్పులు, విపత్తులను తట్టుకునే రీతిలో నిర్మిస్తారు. పాదచారులకు & ప్రజా రవాణాకు సౌకర్యాలు, వరదలు సంభవించే ప్రాంతాలలో ఎత్తైన హైవేలు, కొండలు & పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడకుండా నివారించే నిర్మాణాలు ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంటాయి.
ప్రాజెక్టు ప్రభావిత స్థానిక గ్రామాల్లో పాఠశాలలు, నీరు, ఆరోగ్యం, పారిశుద్ధ్య సౌకర్యాలు, వారసత్వ & పర్యాటక ప్రదేశాలను పునరుద్ధరిస్తారు. ప్రాజెక్టు ప్రాంతాల్లోని వన్యప్రాణులకు, వాటి ఆవాస ప్రాంతాలకు ఇబ్బంది రాకుండా, ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో మనుషులు-ఏనుగుల మధ్య సంఘర్షణ తలెత్తకుండా వయాడక్ట్ నిర్మాణాలు చేపడతారు. వీటికి అదనంగా, రహదారి వినియోగదారులు, డ్రైవర్లు, మోటార్ సైకిల్ రైడర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన, శిక్షణ ఇస్తారు. రహదారి ఆస్తుల నిర్వహణలో అసోం ప్రజా పనుల (రహదారులు) విభాగం సామర్థ్యాన్ని ఈ ప్రాజెక్టు బలోపేతం చేస్తుంది. వాతావరణాన్ని, విపత్తును తట్టుకునే సామర్థ్యాన్ని రహదారి ప్రాజెక్టుల్లో పెంచుతుంది. పర్యావరణ పరిరక్షణ, పునరావాసం, స్థానిక ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, తగిన చర్యలు తీసుకునేలా ఈ ప్రాజెక్టు నిర్ధరిస్తుంది.
****
(Release ID: 1888688)
Visitor Counter : 137