రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav g20-india-2023

సాయుధ బలగాల్లో మార్పులకు నాంది!


అగ్నిపథ్ పథకంపై రక్షణమంత్రి రాజనాథ్ సింగ్ వ్యాఖ్య...
న్యూఢిల్లీలో జరిగిన ఎం.ఒ.యు. కార్యక్రమంలో ప్రసంగం

'అగ్నివీరులు' జాతి 'సురక్షా వీరులు'మాత్రమే కాదు
దేశసౌభాగ్యపు 'సమృద్ధి వీరులు' కూడా: రాజనాథ్

అగ్నివీరులకు కొత్త అవకాశాలు అందించాలని ఇతర మంత్రిత్వ శాఖలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రైవేటు రంగానికి వినతి

Posted On: 03 JAN 2023 4:22PM by PIB Hyderabad

    అగ్నిపథ్  అనేది సాయుధ దళాల్లో పెనుమార్పులకోసం చేపట్టిన వినూత్న పథకం. భారతీయ సైనికదళాన్ని యువశక్తితో, అధునాతన రూపంతో ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దడంలో అగ్నిపథ్ ఎంతో బలోపేతంగా పనిచేస్తుంది. కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ వ్యక్తం చేసిన అభిప్రాయమిది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ (ఎం.ఒ.ఇ.)-కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ (ఎం.ఒ.ఎస్.డి.ఇ.) మంత్రిత్వ శాఖ మధ్య 2023 జనవరి 3న న్యూఢిల్లీలో ఒక అవగాహనా ఒప్పందం (ఎం.ఒ.యు.) కుదిరిన సందర్భంగా రాజనాథ్ సింగ్ వర్చువల్ ప్రసంగం చేస్తూ ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు.  భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా సాయుధ బలగాలను సాంకేతిక పరిజ్ఞానంతో సుసంపన్నంగా,  పోరాటానికి సన్నద్ధంగా తీర్చిదిద్దడంలో అగ్నిపథ్ పథకం కలిగించబోయే పెనుమార్పుల గురించి ఆయన ఈ సందర్భంగా వివరించారు.

   ఈ సందర్భంగా, రక్షణ మంత్రిత్వ శాఖ (ఎం.ఒ.డి.), కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ (ఎం.ఒ.ఇ.), కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ (ఎం.ఒ.ఎస్.డి.ఇ.), త్రివిధ సైనిక దళాలకు వివిధ భాగస్వామ్య వర్గాల సంస్థలతో ఎం.ఒ.యు.లు కుదిరాయి. అగ్నిపథ్ పథకంలో భాగంగా నియమితులయ్యే అగ్నివీరులకు సేవలందించడానికి సంబంధించి ఈ సందర్భంగా ఎం.ఒ.యు.లపై సంతకాలు జరిగాయి. అగ్నివీరులుగాసేవలందిస్తున్న సమయంలో వారు తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు, వారి నైపుణ్యం/అనుభవానికి అనుగుణంగా తగిన నైపుణ్య ధ్రువీకరణ యోగ్యతా పత్రాలను ప్రధానం చేసేందుకు వీలుగా ఈ ఎం.ఒ.యు.లను రూపొందించారు. ఈ ఎం.ఒ.యు.ల కింద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (ఎన్.ఐ.ఒ.ఎస్.), ఇందిరా గాంధీ  జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నూ) ఆధ్వర్యంలో అగ్నివీరులకు వారి అర్హతను బట్టి 12వ తరగతి సర్టిఫికేట్లు, డిగ్రీ సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారు.

   సాయుధ బలగాల్లో శిక్షణ పొందే సమయంలో అగ్నివీరుల ఉద్యోగ నిర్వహణ/నైపుణ్యాలకు సంబంధించిన వ్యవస్థలను జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్.ఎస్.డి.సి.), సెక్టార్ స్కిల్ కౌన్సిల్‌ల (ఎస్.ఎస్.సి.ల) సమన్వయంతో జాతీయ వృత్తి ప్రమాణాలకు (ఎన్.ఒ.ఎస్.)కు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా రూపొందించారు. ఇవే అర్హతల ఆధారంగా, సాయుధ దళాల నుంచి అగ్నివీరులు నిష్క్రమించే సమయంలో వారికి సమకాలీన మార్కెట్‌కు అవసరమైన రీతిలో  పారిశ్రామిక వర్గం ఆమోదించిన 'కౌశల్ ప్రమాణ్ పత్ర'లను జారీ చేస్తారు. ఈ ప్రక్రియను  సులభతరం చేయడంలో, సాయుధ బలగాలకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ విభాగాలు విస్తృతంగా సహకరించాయి.

   ఈ అవగాహన ఒప్పందాలపై సంతకాలు పూర్తి కావడంతో, అగ్నివీరులు తమ విద్యాబ్యాసాన్ని కూడా గడువులోగా పూర్తి చేయగలరని, అదనపు అర్హతలను, నైపుణ్యాలను  పెంపొందించుకోగలుగుతారని రక్షణమంత్రి రాజనాథ్ సింగ్ తన ప్రంసంగంలో పేర్కొన్నారు. ఇన్ని అర్హతలను, ప్రత్యేకతలను అలవర్చుకున్న తర్వాత అగ్నివీరులు తిరిగి సమాజంలోకి వచ్చినప్పుడు, వారు దేశ నిర్మాణానికి దోహదపడతారని అన్నారు. సాయుధ దళాలలో తమ సేవలను అందించడం ద్వారా దేశానికి 'సురక్షవీరులు'గా మారడమే కాకుండా, దేశానికి సహకారం అందించడం ద్వారా 'సమృద్ధివీరులు'గా తయారవుతారని ఆయన అన్నారు.

వారు తమ విద్యార్హతలు, నైపుణ్యాలు, క్రమశిక్షణ, తదితర ప్రత్యేకతలతో దేశనిర్మాణానికి దోహదపడతారని, తద్వారా సమాజానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. దానికి తోడు ఇతర యువజనులను అగ్నివీరులుగా తీర్చిదిద్దేందుకు వారు స్ఫూర్తిదాయకంగా ఉంటారని అన్నారు.

 

   వివిధ సేవల్లో అగ్నివీరులకు తోడ్పాటును అందించినందుకు రక్షణ మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖలను, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను,  ప్రైవేట్ రంగాన్ని ఆయన అభినందించారు. మిగిలిన మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్ రంగం కూడా ఇందుకోసం ముందుకు రావాలని రాజనాథ్ సింగ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మరింత ఉత్సాహంతో పనిచేస్తూ, సాధ్యమైనంత వరకు అగ్నివీరులకు కొత్త అవకాశాలను అందించాలని. దేశ సేవలో తమ జీవితాన్ని అంకితం చేసే అగ్నివీరులకు కొత్త అవకాశాలను అందించడం మన వ్యవస్థ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

  ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక వీడియో సందేశమిచ్చారు. సేవ చేస్తున్న అగ్నివీరులు తమ విద్య,  నైపుణ్యాభివృద్ధి నుంచి గరిష్ట ప్రయోజనాలను పొందేందుకు ఈ అవగాహన ఒప్పందాలు/ఒప్పందాల  తగిన శక్తిని అందిస్తాయని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. అగ్నివీరులు 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించేందుకు ఈ వ్యవస్థ సహాయపడుతుందని, యూనివర్సిటీలో చేరిన అగ్నివీరులు సాధారణ ఉన్నత విద్యలో  50శాతం సిలబస్‌ను పూర్తి చేయగలరని, ఇక రక్షణ సంస్థలు అందించే నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా వారు మిగిలిన ప్రయోజనాలు పొందవచ్చని ఆయన తెలిపారు.

  ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నూ) ద్వారా  బ్యాచిలర్ డిగ్రీని  పొందవచ్చని, దీనికి అదనంగా, రెండేళ్ల శిక్షణ పూర్తయిన తర్వాత అగ్నివీర్ డిప్లొమా అర్హత పొందవచ్చుని అన్నారు.  అగ్నివీరులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉపాధిని, ఉన్నత విద్యను పొందేందుకు ఈ డిగ్రీలు, డిప్లమోలు సహాయపడతాయన్నారు.

   నాలుగు సంవత్సరాల పాటు త్రివిధ దళాల్లో 'అధికారి స్థాయి కంటే దిగువ' కేడర్‌లో పురుషులను, మహిళలను అగ్నివీరులుగా నియమించడానికి, 2022, జూన్ 15న అగ్నిపథ్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు అర్హులు. ఈ అగ్నివీరులకు ప్రాథమిక సైనిక శిక్షణ, ప్రత్యేక వాణిజ్య శిక్షణను అందిస్తారు. అవసరమైన విధంగా మెరుగైన నైపుణ్యాభివృద్ధి కోర్సులను వారు పొందుతారు.

   యువశక్తిని అగ్నివీరులుగా మార్చడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని ఈ పథకం అందిస్తుంది సాయుధ బలగాల ద్వారా దేశానికి సేవ చేయాలనే వారి కలను సాకారం చేసుకునేందుకు యువతకు ఇది దోహదపడుతుంది.  అగ్నిపథ్ పథకం ద్వారా నియమితులయ్యే వారు, జాతి నిర్మాతలుగా రూపొందేందుకు ఈ పథకం వీలు కల్పిస్తుంది.

   ఇతర ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, స్టార్టప్‌లతో పాటు, బయట అదనపు ఉద్యోగ మార్గాలకు ఎంపిక కావాలనుకునే వారికి సహాయం అందించేందుకు, సాయుధ దళాలలో పనిచేస్తుండగానే అగ్నివీర్లకు తగిన విద్యార్హతలు, నైపుణ్యాలతో తగిన సాధికారత కల్పించడానికి ఈ వ్యవస్థకు సంబంధించి దేశం యావత్తుకూ ఒక విధానాన్ని రూపొందించారు.

   ఈరోజు జరిగిన అవగాహనా ఒప్పందాల కార్యక్రమానికి పారిశ్రామికవేత్తలు, రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, వివిధ మంత్రిత్వ శాఖల సిబ్బంది, రక్షణ సిబ్బంది అధిపతి, త్రివిధ సైనిక దళాల అధిపతులు కూడా హాజరయ్యారు. https://sendgb.com/ZfBxyd1bIYQ

 

***************(Release ID: 1888680) Visitor Counter : 117


Read this release in: English , Urdu , Marathi , Hindi