జౌళి మంత్రిత్వ శాఖ
చేనేత చీరల పండుగ “విరాసత్”రెండవ దశ రేపే ప్రారంభం!
న్యూఢిల్లీ జనపథ్‌లోని హ్యాండ్‌లూమ్ హాట్‌లో
చేనేత చీరల భారీ ప్రదర్శన, విక్రయం
Posted On:
02 JAN 2023 5:29PM by PIB Hyderabad
"విరాసత్" పేరిట భారతదేశానికి చెందిన 75 రకాల విభిన్నమైన చేనేత చీరల పండుగ రెండవ దశను 2023 జనవరి 3 నుంచి జనవరి 17 వరకు నిర్వహించనున్నారు. న్యూఢిల్లీలోని జనపథ్ రోడ్డులో ఉన్న హ్యాండ్లూమ్ హాట్‌లో ఇది జరుగుతుంది. కేంద్ర జవుళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ చీరల పండుగను ప్రతి రోజూ ఉదయం 11 గంటలనుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహిస్తారు.
ఈ రెండవ దశలో, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 90 మంది పాల్గొంటున్నారు. టై అండ్ డై చీరలు, చికాన్ ఎంబ్రాయిడరీ, హ్యాండ్ బ్లాక్ చీరలు, కలంకారీ ప్రింటెడ్ చీరలు, అజ్రఖ్, కాంత- ఫుల్కారీ వంటి ప్రసిద్ధ చేనేత రకాల ప్రదర్శనతో ఈ పండగ సందర్శకులను విశేషంగా ఆకట్టుకోనున్నది. ఇవి జాందానీ, ఇకత్, పోచంపల్లి, బనారస్ బ్రోకేడ్, టస్సార్ సిల్క్ (చంపా), బలూచారి, భాగల్‌పురీ సిక్, తంగైల్, చందేరీ, లలిత్‌పురి, పటోలా, పైథానీ మొదలైన ప్రత్యేక చేనేత చీరలను కూడా ఈ ప్రదర్శనలో ఉంచుతారు. అలాగే తాంచోయ్ వంటి చేనేత చీరలు కూడా అందుబాటులో ఉంటాయి. జంగ్లా, కోటా డోరియా, కట్‌వర్క్, మహేశ్వరీ, భుజోడీ, శాంతిపురీ, బొమ్‌కై, గరద్ కొరియాల్, ఖండూవా, ఆరణి పట్టు చీరలు, అనేక ఇతర రకాలు కూడా ఈ ప్రదర్శనలో ఉంటాయి.
"విరాసత్" పేరిట మొదటి దశ చేనేత చీరల పండుగ 2022 డిసెంబరు 16న ప్రారంభమై 2022 డిసెంబరు 30వ తేదీన ముగిసింది. కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ డిసెంబరు 16న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర సహాయమంత్రి దర్శనా జర్దోష్, ఇతర మహిళా పార్లమెంటేరియన్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిసెంబరు16 నుంచి 30 వరకు జరిగిన -విరాసత్- తొలిదశలో 70 మంది భాగస్వాములు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గురించి వార్తాపత్రికలు, పోస్టర్లు, ఆహ్వాన పత్రికలు, సోషల్ మీడియా ద్వారా, సాంస్కృతిక కార్యక్రమాలు, డిజైనర్ల వర్క్‌షాప్ మొదలైన పద్ధతులు, పత్రికల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమం భారీస్థాయిలో విజయాన్ని సాధించింది. వివిధ వయస్సుల వారు విశేష సంఖ్యలో హాజరయ్యారు. చేనేత రంగంపైన, చేనేత ఉత్పాదనలపైన దృష్టిని కేంద్రీకరించేలా ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడింది.
మన చేనేత కార్మికులకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో మైశారీమై ప్రైడ్ (#MySariMyPride) అనే ఉమ్మడి హ్యాష్‌ట్యాగ్‌తో ఈ కార్యక్రమంపై సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం కూడా ప్రారంభించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ''ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'' పేరిట 75 మంది చేనేత కార్మికుల చేత, చేనేత చీరల ప్రదర్శన-విక్రయం ఉంటుంది. సందర్శకులకోసం ఈ దిగువన సూచించిన అనేక కార్యకలాపాలను చేర్చారు.:
• విరాసత్-వారసత్వ ఉత్సవం: చేనేత చీరల ప్రదర్శన.
• విరాసత్-ఏక్ ధారోహర్: నేత కార్మికులచేత నేరుగా చీరల రిటైల్ విక్రయం
• విరాసత్ కే ధాగే: ప్రత్యక్షంగా మగ్గం ప్రదర్శన
• విరాసత్–కల్ సే కల్ తక్: చీర-సుస్థిరతపై చర్చోగోష్టులు, సమావేశాలు, సదస్సులు.
• విరాసత్–నృత్య సంస్కృతి: భారతీయ సంస్కృతికి చెందిన ప్రసిద్ధ జానపద నృత్యాలు
ఎగ్జిబిషన్ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజల సందర్శనకు అందుబాటులో ఉంటుంది. భారతదేశంలోని కొన్ని విలక్షణ ప్రాంతాల నుంచి సేకరించిన చేనేత చీరలను ప్రదర్శనకు, విక్రయానికి వీలుగా ఇక్కడ అందుబాటులో ఉంచారు. సంక్షిప్తంగా చీరల జాబితా ఈ కింది విధంగా ఉంటుంది.: -
రాష్ట్రాలు
|
ప్రధానమైన చీరల రకాలు
|
ఆంధ్రప్రదేశ్
|
ఉప్పాడ జందానీ చీర, వెంకటగిరి జందానీ కాటన్ చీర, కుప్పడం చీర, చీరాల పట్టు చీర, మాధవరం చీర, పోలవరం చీర.
|
కేరళ
|
బలరామపురం చీర, కసావు చీర.
|
తెలంగాణ
|
పోచంపల్లి చీర, సిద్దిపేట గొల్లబామ చీర, నారాయణ పేట చీర.
|
తమిళనాడు
|
కాంచీపురం పట్టు చీర, ఆరణి పట్టు చీర, తిరుబువనం పట్టు చీర, విలాండై కాటన్ చీర, మదురై చీర, పరంకూడి కాటన్ చీర, అరుప్పుకొట్టే కాటన్ చీర, దిండిగల్ కాటన్ చీర, కోయంబత్తూరు కాటన్ చీర, సేలం పట్టు చీర, కోయంబత్తూరు (సాఫ్ట్) పట్టు చీరలు, కోవై కోరా కాటన్ చీరలు.
|
మహారాష్ట్ర
|
పైథానీ చీర, కర్వత్ కఠీ చీర, నాగపూర్ కాటన్ చీర.
|
చత్తీస్‌గఢ్
|
చంపా ప్రాంతపు టస్సర్ పట్టు చీర.
|
మధ్యప్రదేశ్
|
మహేశ్వరీ చీర, చందేరీ చీర.
|
గుజరాత్
|
పటోలా చీర, తంగలీయ చీర, అశ్వాళీ చీర, కుచ్చీ చీర/భూజోడీ చీర
|
రాజస్థాన్
|
కోటా డోరియా చీర
|
ఉత్తరప్రదేశ్
|
లలిత్‌పురి చీర, బనారస్ బ్రాకేడ్, జంగ్లా, తాంచోయ్, కట్‌వర్క్- జందానీ.
|
జమ్ము-కాశ్మీర్
|
పసిమినా చీర
|
బీహార్
|
భాగల్పూరీ పట్టు చీర, బవన్ బుటీ చీర.
|
ఒడిశా
|
కోటపాడు చీర, గోపాల్‌పూర్ టస్సర్ చీర.
|
పశ్చిమ బెంగాల్
|
జంమ్దారీ, శాంతిపురి, తంగెయిల్
|
జార్ఖండ్
|
టస్సర్, గిచ్చా పట్టు చీరలు
|
కర్ణాటక
|
ఇల్కాల్ చీర
|
అస్సాం
|
ముగా పట్టుచీర, మేఖ్లా చదర్ (చీర)
|
పంజాబ్
|
ఎంబ్రాయిడరీ ఫుల్కారీ
|
మనకు అనాదిగా వస్తున్న చేనేత చీరల సంప్రదాయంపై మళ్లీ దృష్టిని కేంద్రీకరించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది. తద్వారా చేనేత వర్గాల ప్రజల ఆదాయాన్ని మెరుగుపడేందుకు అవకాశం ఏర్పడుతుంది.
ఎంతో గొప్పదైన, వైవిధ్యభరితమైన మనదేశ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా చేనేత రంగం కొనసాగుతూ వస్తోంది. అంతేకాకుండా పెద్ద సంఖ్యలో ప్రజలకు, ప్రత్యేకించి మహిళలకు పటిష్టమైన ఉపాధిని అందించే కీలక రంగాలలో చేనేత రంగం కూడా ఉంది. చేనేత రంగం సాంప్రదాయాన్ని, సామర్థ్యాన్ని గురించి గొప్పగా చెప్పుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది.
*****
(Release ID: 1888192)
Visitor Counter : 368