ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

10 సంవత్సరాల క్రితం ఆధార్‌ పొందినవాళ్లు అన్ని వివరాలను నవీకరించుకోవాలని ప్రజలకు ఉడాయ్‌ విజ్ఞప్తి

Posted On: 24 DEC 2022 4:48PM by PIB Hyderabad

10 సంవత్సరాల క్రితం ఆధార్‌ పొందిన ప్రజలు, గత 10 సంవత్సరాల్లో వివరాలను నవీకరించని వాళ్లు, ఆధార్ కోసం సమర్పించిన వివరాలను నవీకరించుకోవాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్‌) విజ్ఞప్తి చేసింది.

దేశ ప్రజలు సంబంధిత పత్రాలను (గుర్తింపు రుజువు, చిరునామా రుజువు) ఆన్‌లైన్‌ ద్వారా myAadhaar పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా, లేదా సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా ఆధార్‌ను నవీకరించుకోవచ్చు.

గత దశాబ్ద కాలంగా, భారతదేశంలో నివాసితుల గుర్తింపు రుజువుగా ఆధార్ సంఖ్యను సార్వత్రికంగా ఆమోదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 319 పథకాలు సహా మొత్తం 1100కు పైగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాలు ప్రజలకు అందించడానికి ఆధార్ ఆధారిత గుర్తింపును ఉపయోగిస్తున్నారు.

బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు మొదలైన అనేక ఆర్థిక సంస్థలు కూడా ఖాతాదారులను చేర్చుకోవడానికి, నిరాటంక సేవలు అందించడానికి ఆధార్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి.

దేశ ప్రజలు తమ ఆధార్‌లను ప్రస్తుత గుర్తింపు రుజువు, చిరునామా రుజువుతో నవీకరించుకోవడం మంచిది.

ఆధార్‌ వివరాలను నవీకరించడం వల్ల జీవన సౌలభ్యం, మెరుగైన సేవల పంపణీ, ఖచ్చితమైన గుర్తింపు లభిస్తుంది. నివాసితులు తమ వివరాలను నవీకరించకోవాలని ఉడాయ్‌ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంది. నవంబర్ 09, 2022న ప్రకటించిన ఆధార్ (నమోదు, నవీకరణ) (పదో సవరణ) నిబంధనలు-2022 ఆ దిశగా వేసిన మరో అడుగు.

ఆధార్ సమాచార నిధిలో నిరంతర ఖచ్చితత్వం కోసం సంబంధిత పత్రాలను నవీకరించమని ఉడాయ్‌ మరోసారి దేశ ప్రజలను కోరింది, ఆ దిశగా ప్రోత్సహిస్తోంది.

 

***



(Release ID: 1886441) Visitor Counter : 177