కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
జమ్ము&కశ్మీర్‌లోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు
Posted On:
19 DEC 2022 1:25PM by PIB Hyderabad
కేంద్ర గణాంకాలు & కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంవోఎస్‌పీఐ) నిర్వహించే కాలానుగత సిబ్బంది సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్) ద్వారా ఉద్యోగిత, నిరుద్యోగితకు సంబంధించిన సమాచారాన్ని 2017-18 నుంచి సేకరించడం జరుగుతోంది. సర్వే కాలం జులై నుంచి తర్వాతి ఏడాది జూన్ వరకు ఉంటుంది. తాజాగా అందుబాటులో ఉన్న వార్షిక పీఎల్‌ఎఫ్‌ఎస్ నివేదికల ప్రకారం, జమ్ము&కశ్మీర్‌లో అంచనా వేసిన నిరుద్యోగిత శాతం (యూఆర్) 2019-20, 2020-21 మధ్య వరుసగా 6.7%, 5.9%గా ఉంది. జమ్ము&కశ్మీర్‌లో నిరుద్యోగ శాతం తగ్గుతోందని ఇది తెలియజేస్తోంది.
ఉద్యోగ కల్పనతో పాటు ఉపాధిని మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యత. దీని ప్రకారం, దేశంలో ఉపాధి కల్పన కోసం భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. వ్యాపారాలకు ప్రోత్సాహం అందించడానికి, కొవిడ్-19 ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ కింద, రూ.27 లక్షల కోట్లకు పైగా ఎక్కువ ఆర్థిక ఉద్దీపనలను ప్రభుత్వం అందిస్తోంది. దేశాన్ని స్వావలంబనగా మార్చడానికి, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి వివిధ దీర్ఘకాలిక పథకాలు/కార్యక్రమాలు/విధానాలు ఈ ప్యాకేజీలో ఉంటాయి.
కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఏర్పడిన వ్యాపార నష్టాలను పూడ్చుకోవడానికి, కొత్త ఉపాధిని కల్పించేలా యజమానులను ప్రోత్సహించడానికి ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన (ఏబీఆర్‌వై) 2022 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. లబ్ధిదారుల నమోదుకు గడువు తేదీ 31-03-2022. ఈ పథకం ప్రారంభం నుంచి 28-11-2022 వరకు, పథకం కింద 60.13 లక్షల మంది లబ్ధిదారులకు రూ.7,855.07 కోట్ల ప్రయోజనం అందించారు. 28-11-2022 వరకు ఈ పథకం కింద జమ్ము&కశ్మీర్‌లో 19.34 వేల మంది లబ్ధిదారులకు రూ.35.39 కోట్ల ప్రయోజనాలు అందాయి.
కొవిడ్-19 మహమ్మారి సమయంలో దెబ్బతిన్న వీధి వ్యాపారులు తమ వ్యాపారాలను పునఃప్రారంభించేలా వడ్డీ రహిత రుణాలు అందించేందుకు 2022 జూన్ 01 నుంచి 'ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండార్స్ ఆత్మనిర్భర్ నిధి'ని (పీఎం స్వనిధి పథకం) కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 02-12-2022 నాటికి ఈ పథకం కింద రూ.4,378 కోట్ల విలువైన 37.68 లక్షల రుణాలను ఇచ్చారు. 02.12.2022 నాటికి ఈ పథకం కింద జమ్ము&కశ్మీర్‌లో 17.95 వేల రుణాలు పంపిణీ చేయబడ్డాయి.
ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ), మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా), పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూ-జీకేవై), దీన్ దయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ (డే-ఎన్‌యూఎల్‌ఎం) వంటి భారీ పెట్టుబడులు, వ్యయంతో కూడిన ప్రాజెక్టులు, పథకాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
స్వయం ఉపాధి కల్పన కోసం ప్రధాన మంత్రి ముద్ర యోజనను (పీఎంఎంవై) కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పీఎంఎంవై కింద రూ.10 లక్షల వరకు పూచీకత్తు రహిత రుణాలు అందిస్తారు. సూక్ష్మ/చిన్న వ్యాపార సంస్థలకు, వ్యక్తులకు వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడానికి లేదా విస్తరించేందుకు ఇవి వీలు కల్పిస్తాయి. 25-11-2022 వరకు, 37.76 కోట్ల రుణ ఖాతాల్లోకి రూ.15.56 లక్షల కోట్లను ఈ పథకం కింద పంపిణీ చేశారు. 2022-23లో (25-11-2022 వరకు), జమ్ము&కశ్మీర్‌లో ఈ పథకం కింద 1.89 లక్షల రుణ ఖాతాలకు రూ.4,209.69 కోట్లు అందించారు.
రూ.1.97 లక్షల కోట్లతో, 2021-22 నుంచి 5 సంవత్సరాల కాలానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇది 60 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాలన్నీ సమష్టిగా బహుళ ప్రయోజనాలతో మధ్య-దీర్ఘకాలంలో ఉపాధిని సృష్టిస్తాయని భావిస్తున్నారు.
ఆర్థిక వృద్ధి, స్థిరమైన అభివృద్ధిలోకి మారేందుకు తీసుకొచ్చిన కార్యక్రమం పీఎం గతి శక్తి. రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ప్రజా రవాణా, జలమార్గాలు, సరకు రవాణా అనే ఏడు ఇంజిన్ల ద్వారా ఈ విధానం నడుస్తోంది. శుద్ధ ఇంధనం, అందరి ప్రయత్నం అన్న విధానాలతో, భారీగా ఉద్యోగాలు & వ్యవస్థాపక అవకాశాలను ఈ కార్యక్రమం అందిస్తుంది.
ఈ కార్యక్రమాలతో పాటు మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్-అప్ ఇండియా, స్టాండ్-అప్ ఇండియా, డిజిటల్ ఇండియా, హౌసింగ్ ఫర్ ఆల్ మొదలైన కీలక ప్రభుత్వ ప్రభుత్వ పథకాలు కూడా ఉపాధి అవకాశాలను సృష్టించే దిశగా అమలవుతున్నాయి.
లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని కార్మిక & ఉపాధి శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలి ఇవాళ అందించారు.
******
(Release ID: 1885003)
Visitor Counter : 170