శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శాస్త్రీయ ప్రచురణల్లో భారత స్థానం 7 నుంచి 3 కు పెరిగింది: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


సైన్స్, ఇంజనీరింగ్ పి హెచ్ డి లలో భారత్ కు మూడో స్థానం: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

భారత అధ్యయనపత్రాలు 2010 లో 60,555 కాగా, 2020 నాటికి 1,49,213

వచ్చే బడ్జెట్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి 20% అధికంగా కేటాయించే అవకాశం

Posted On: 18 DEC 2022 5:30PM by PIB Hyderabad

శాస్త్రీయ ప్రచురణల్లో భారత స్థానం 7 నుంచి 3 కు ఎగబాకింది. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ విషయం వెల్లడించారు. శాస్త్ర సాంకేతిక విభాగం కేంద్ర కార్యదర్శి డాక్టర్ ఎస్. చంద్రశేఖర తో సమీక్ష అనంతర మంత్రి ఈ విషయం ప్రకటించారు.  భారత శాస్త్రవేత్తలు ఆవిశ్రాంతంగా చేస్తున్న కృషిని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. శాస్త్రవేత్తలు స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేయటానికి తగిన వాతావరణం కల్పించారని ప్రధానికి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. గత కొద్ది సంవత్సరాలలోనే శాస్త్ర పరిశోధనలలో చెప్పుకోదగిన పురోగతి కనబడుతోందన్నారు. ప్రాధాన్య క్రమాలు నిర్ణయించటంలోనూ, విధానాన్ని సులభతరం చేయటంలోనూ ప్రధాని నిర్ణయాలు సానుకూలంగా ఉన్నాయన్నారు.

అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్  వారి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సూచికలు-2020 నివేదిక ప్రకారం  అంతర్జాతీయ స్థాయిలో భారతీయ శాస్త్ర సాంకేతిక పరిశోధనాపత్రాల ప్రచురణ రాంకు 7 నుంచి 3 వ స్థానానికి ఎగబాకింది. భారత పరిశోధకుల అధ్యయనపత్రాలు 2010 లో 60,555 కాగా, 2020 నాటికి 1,49,213 కు పెరిగియని, ఇందులో కూడా భారత్ మూడో స్థానంలో ఉందని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. సైన్స్ పట్ల ప్రత్యేకమైన గౌరవం ఉండటంతోబాటు సైన్సు అభివృద్ధికి అండగా నిలబడటం వల్లనే ఆత్మ నిర్భర భారత్ లో కీలకపాత్ర పోషించటానికి ఈ రంగం  సిద్ధమైందన్నారు.

భారతదేశంలో శాస్త్ర  పరిశోధన తీరు గత కొద్ది సంవత్సరాలలో బాగా మెరుగుపడిందని పరిశోధనా ప్రచురణలలో, టెక్నాలజీలు, నవకల్పనల పెరుగుదలలో  ఆ విషయం స్పష్టంగా కనబడుతోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దీనివలన సర్వతోముఖాభివృద్ధి జరిగిందన్నారు. సైన్స్, ఇంజనీరింగ్ విభాగాలలో భారతదేశంలో పి హెచ్ డి ల సంఖ్య ప్రపంచంలో మూడో స్థానంలో ఉండటం గర్వించదగిన విషయమన్నారు. గడిచిన మూడేళ్లలో భారత శాస్త్రవేత్తలకు లభించిన పేటెంట్లు  కూడా పెరిగాయని, 2018-19 లో 2511 ఉండగా 2019-20 కి 4003 కు, 2020-21 నాటికి 5629 కి పెరగటాన్ని ఆయన ప్రస్తావించారు.

అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ప్రాథమిక పరిశోధనను, వైద్యేతర రంగాలైన సైన్స్, ఇంజనీరింగ్ లో విద్యను ప్రోత్సహిస్తుంది. ప్రపంచ మేథో సంపత్తి సంస్థ వెలువరించిన అంతర్జాతీయ నవకల్పనల సూచీ -2022 ప్రకారం భారత స్థానం 2014 లో 81 ఉండగా 2022 లో అది గణనీయంగా పెరిగి  40 వ స్థానానికి వచ్చింది. శాస్త్ర, సాంకేతిక రంగాల అభ్యున్నతి  కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, సంబంధిత శాఖలకు నిధుల కేటాయింపు పెంచిందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

గత బడ్జెట్ లో పోల్చినప్పుడు 2023-24 బడ్జెట్ లో శాస్త్ర, సాంకేతిక విభాగానికి కేటాయించే బడ్జెట్ 29 శాతం మేరకు పెరిగే అవకాశం ఉందని ఒక సీనియర్ అధికారు అన్నారు.  గత బడ్జెట్ లో సైన్స్ అండ్  టెక్నాలజీకి రూ.6,002 కోట్లు కేటాయించగా అది మొత్తం  మంత్రిత్వశాఖ కేటాయింపులో 42%. కార్పొరేట్ రంగం పరిశోధనలమీద పెట్టే ఖర్చును కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధి నుంచి ఇచ్చుకోవచ్చునని ప్రభుత్వం అనుమతించింది. టెక్నాలజీ సంబంధిత ఇన్ క్యుబేటర్లలో పెట్టుబడి పెట్టాలని కార్పొరేట్ రంగాన్ని ప్రభుత్వం కోరుతోంది. అదే విధంగా జాతీయ స్థాయి పరిశోధనాలయాల్లో కూడా ఖర్చుపెట్టాలని కోరింది. అలాంటి వ్యాయానికి పన్ను రాయితీలకు కూడా హామీ ఇచ్చింది.

***


(Release ID: 1884714) Visitor Counter : 208